
టీమిండియా తగ్గేదేలే
ఆసియా కప్ 2025లో టీమిండియా తగ్గేదేలే అన్న తీరులో దూసుకెళ్తోంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో తన తడాఖా ఏంటో చూపిస్తూ ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతోంది. ఆడిన మొదటి మ్యాచ్కు, రెండో మ్యాచ్కు పెద్ద తేడా ఏమీ లేదు. యూఏఈ, పాక్.. ప్రత్యర్థి ఎవరైనా సరే దండయాత్ర చేస్తోంది.. అలవోకగా విజయం సాధిస్తోంది. ఆసియా కప్లో జోరు ఇలానే కొనసాగితే.. టైటిల్ భారత్దే అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
భారత్ జైత్రయాత్రలో కీలక పాత్ర బౌలర్లు, బ్యాటర్ల సమిష్టి కృషే. మొన్న యూఏఈతో జరిగిన మ్యాచ్, నిన్న పాక్తో జరిగిన మ్యాచ్ చూస్తే ఈ విషయం మనకి స్పష్టమవుతుంది. భారత్.. యూఏఈ లాంటి పసికూనతో తలపడి విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ పాకిస్థాన్ లాంటి బలమైన జట్టును ఎదుర్కొని విజయం సాధించింది. ఎందుకంటే పాక్ ప్రపంచ క్రికెట్లో ఓ బలమైన జట్టు. ప్రస్తుతం ఆ జట్టు బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. అలాంటి జట్టుతో భారత్ ఆడి గెలిచింది.
ఆదివారం దుబాయ్లో జరిగిన భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్లో భారత జట్టు పాకిస్థాన్పై సాధించిన ఘన విజయం, యావత్ దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. కేవలం 15.5 ఓవర్లలోనే 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఏడు వికెట్ల తేడాతో గెలవడం, ఈ మ్యాచ్లో భారత బౌలర్లు, బ్యాటర్ల సమష్టి కృషికి నిదర్శనం. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు చూపించిన ఆధిపత్యం అమోఘం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ను భారత బౌలర్లు కేవలం 127 పరుగులకే కట్టడి చేశారు. కుల్దీప్ యాదవ్ (3/18), అక్షర్ పటేల్ (2/18), జస్ప్రీత్ బుమ్రా (2/28) అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా, కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో పాక్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. పవర్ప్లేలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వేసిన బంతులకు పాక్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఈ సమష్టి బౌలింగ్ ప్రదర్శన పాకిస్థాన్ను స్వల్ప స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించింది.
ఆ తర్వాత బ్యాటింగ్ వంతు. 128 పరుగుల లక్ష్యం సులువే అనిపించినా, పాక్ బౌలింగ్ను తక్కువ అంచనా వేయలేం. అయితే భారత బ్యాటర్లు ధైర్యంగా, దూకుడుగా ఆడారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (31) ఆరంభంలోనే దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ (31)తో కలిసి సూర్యకుమార్ యాదవ్ చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాడు. శుభ్మన్ గిల్, శివమ్ దూబె కూడా తమ వంతు సహకారాన్ని అందించారు.
యూఏఈతో ఆడిన మొదటి మ్యాచ్లో కూడా భారత్ ఇదే దూకుడును ప్రదర్శించింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి యూఏఈని స్వల్ప స్కోరుకే (57) కట్టడి చేసింది. ఈ మ్యాచ్లో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు, శివమ్ దుబే మూడు, బుమ్రా, అక్షర్పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ 30 పరుగులు, శుభ్మన్ గిల్ 20 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 7 పరుగులతో రాణించారు. కాగా ఆసియా కప్ టోర్నమెంట్లో సాధించిన ఈ రెండు విజయాలు రాబోయే మ్యాచ్లకు జట్టుకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. గ్రూప్-ఏలో ఆడిన రెండు మ్యాచ్లలోనూ విజయం సాధించిన భారత్, సూపర్ ఫోర్ దశకు చేరుకుంది. సెప్టెంబర్ 19న శుక్రవారం భారత్, ఒమన్తో అబుదాబి వేదికగా తలపడనుంది.
