
టీమిండియా కొత్త స్పాన్సర్గా అపోలో టైర్స్
భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్షిప్ హక్కులను అపోలో టైర్స్ సొంతం చేసుకుంది. మూడు సంస్థల మధ్య జరిగిన పోటీలో అపోలో టైర్స్ రూ.579 కోట్ల భారీ బిడ్తో విజేతగా నిలిచింది. ఈ ఒప్పందం మూడేళ్ల కాలానికి వర్తిస్తుంది. ఈ కాలంలో 121 ద్వైపాక్షిక మ్యాచ్లు, 21 ఐసీసీ మ్యాచ్లకు అపోలో టైర్స్ స్పాన్సర్గా వ్యవహరించనుంది. గుర్గావ్కు చెందిన ఈ టైర్ల కంపెనీ 100కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ బిడ్డింగ్ పోటీలో కాన్వా (రూ.544 కోట్లు), జేకే సిమెంట్స్ (రూ.477 కోట్లు)ను వెనక్కి నెట్టి అపోలో టైర్స్ విజయం సాధించింది.
ఈ ఒప్పందం ప్రకారం, ఒక్కో మ్యాచ్కు దాదాపు రూ.4.77 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ద్వైపాక్షిక మ్యాచ్లు, ఐసీసీ మ్యాచ్ల విలువలో తేడాలు ఉండవచ్చు. క్రిక్బజ్ నివేదిక ప్రకారం, భారత క్రికెట్ నియంత్రణ మండలి ద్వైపాక్షిక మ్యాచ్లకు రూ.3.5 కోట్లు, ప్రపంచకప్ మ్యాచ్లకు రూ.1.5 కోట్లను కనీస ధరగా నిర్ణయించింది. రియల్ మనీ గేమింగ్ కంపెనీలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేయడంతో డ్రీమ్11తో ఉన్న ఒప్పందం రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం టెండర్లు పిలిచింది. ఆసియా కప్కు ముందు ఈ ఆదేశాలు రావడంతో భారత జట్టు జెర్సీ స్పాన్సర్ లేకుండానే టోర్నమెంట్లోకి వెళ్లాల్సి వచ్చింది.
కొత్త స్పాన్సర్ అపోలో టైర్స్ లోగో తొలిసారిగా అక్టోబర్ 2న ప్రారంభమయ్యే వెస్టిండీస్తో రెండు టెస్టుల హోమ్ సిరీస్లో భారత జట్టు జెర్సీపై కనిపించనుంది. అంతకు ముందు ఇండియా-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య జరిగే మూడు అనధికార వన్డేల సిరీస్లోనూ ఈ లోగో కనిపించనుంది. ఈ మ్యాచ్ల కోసం జెర్సీలను సిద్ధం చేయడానికి వీలుగా ఇండియా-ఏ వన్డే జట్టును ముందుగానే ఎంపిక చేయాలని బీసీసీఐ సెలెక్టర్లను కోరింది. దీంతో ఇండియా-ఏ జట్టును సెప్టెంబర్ 14న ప్రకటించారు. కాన్పూర్లో సెప్టెంబర్ 30, అక్టోబర్ 2, 5 తేదీల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి.
జెర్సీ స్పాన్సర్షిప్ కోసం బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్న కంపెనీలతో పాటు యూపీకి చెందిన షాంక్ ఎయిర్, దుబాయ్కు చెందిన ఓమ్నియాత్ సంస్థలు కూడా ఆసక్తి చూపించి టెండర్ డాక్యుమెంట్లు కొనుగోలు చేశాయి, కానీ బిడ్డింగ్లో పాల్గొనలేదు. ముంబైకి చెందిన డబ్ల్యూపీపీ మీడియా సంస్థ అపోలో టైర్స్ తరఫున ఈ బిడ్ను పర్యవేక్షించి, విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. రియల్ మనీ గేమింగ్ కంపెనీలపై నిషేధం ఉన్నందున బీసీసీఐ టెండర్కు పెద్దగా స్పందన ఉండదని చాలామంది భావించారు. కానీ రూ.358 కోట్ల ఒప్పందంతో ఉన్న డ్రీమ్11 కంటే దాదాపు రూ.200 కోట్లు ఎక్కువ చెల్లించడానికి సిద్ధమైన భాగస్వామి దొరకడం బీసీసీఐ లక్ అనే చెప్పొచ్చు.
