
టీమిండియాకు ఐసీసీ జరిమానా
తొలిపలుకు, క్రీడా వార్తలు, సెప్టెంబర్ 24:* టీమిండియా మహిళా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత మహిళల క్రికెట్ జట్టుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు. ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్ సభ్యురాలు జీఎస్ లక్ష్మి, భారత్ జట్టు నిర్ణీత సమయం తర్వాత కూడా రెండు ఓవర్లు తక్కువగా వేసినందున ఈ జరిమానాను విధించారు.
"ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, జట్లు నిర్దేశించిన సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువ వేసిన ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధిస్తారు’’ అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ తప్పును అంగీకరించింది. కాబట్టి అధికారిక విచారణ అవసరం లేకుండానే జరిమానాను ఆమోదించారని ఐసీసీ పేర్కొంది.
ఇటీవల ఆస్ట్రేలియా మహిళల జట్టు భారత్‌లో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియాతో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడింది. ఫస్ట్, చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, రెండో మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. చివరి మ్యాచ్‌లో స్మృతి మంధాన మెరుపు శతకం (125 పరుగులు) సాధించినప్పటికీ, ఆతిథ్య భారత్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో 43 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. ఇక ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ విషయానికి వస్తే, ఈ టోర్నీని భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. భారత్ తమ టోర్నమెంట్‌ను సెప్టెంబర్ 30న గౌహతిలో శ్రీలంకతో ప్రారంభిస్తుంది. ఆస్ట్రేలియా మరుసటి రోజు ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.
