
టీమిండియాకు అన్నీ మంచి శకునములే
క్రీడా ప్రపంచంలో మహిళల క్రికెట్‌కు ఉన్న ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 టోర్నమెంట్ ప్రారంభంతో క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈసారి మహిళల క్రికెట్ మహా సంగ్రామానికి మన దేశం ఆతిథ్యం ఇవ్వడం విశేషం. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే పలుసార్లు ఈ టోర్నీని నిర్వహించిన భారత్, ఈసారి ట్రోఫీని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025కి కేవలం 11 రోజులే మిగిలి ఉండగా భారత మహిళల క్రికెట్ జట్టుపై ఆశలు రేకెత్తుతున్నాయి, దీనికి కారణం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే లీగ్‌లలో భారత మహిళల జట్టు చూపించిన ఆట తీరు. 2007 తర్వాత హోం గ్రౌండ్‌లో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్, రెండో వన్డే 102 రన్స్ భారీ మార్జిన్‌తో గెలిచింది. ఈ విజయంతో సిరీస్ 1-1కి చేరింది. ఈ సందర్భంగా భారత్ ఓపెనర్ స్మృతి మందాన అద్భుత సెంచరీతో అందరి అభినందనలు అందుకుంది. ఆస్ట్రేలియాకు ఇది వన్డేల్లో ఊహించని భారీ పరాజయం.
పీసీఏ ముల్లన్‌పూర్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అలిసా హీలీ బౌలింగ్ ఎంచుకొని, భారత్‌ను మొదట బ్యాటింగ్‌కు పంపింది. ఫ్లాట్ వికెట్ మీద భారత్ 49.5 ఓవర్లలో 292 రన్స్‌కు ఆలౌట్ అయింది. ఓపెనర్ స్మృతి మంధాన 91 బంతుల్లో 117 రన్స్ (14 ఫోర్లు, 4 సిక్సులు) సాధించి వన్డేల్లో 12వ సెంచరీని నమోదు చేశారు. స్మృతి 77 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. దీప్తి శర్మ (40) కొంత సహాయం చేసినా, ఆస్ట్రేలియా బౌలర్లు డార్సీ బ్రౌన్ (3-42), ఆష్లీ గార్డ్నర్ (2-39) మిగిలిన బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు అనే చెప్పాలి.
టార్గెట్‌ను ఛేదించేందుకు బయలుదేరిన ఆస్ట్రేలియా మొదటి 10 ఓవర్లలోనే 25/2కి సరిపెట్టుకుంది. యువ పేసర్ క్రాంతి గౌడ్ 9.5 ఓవర్లలో 3-28తో మ్యాచ్‌ను మలుపు తిప్పగా, రేణుకా సింగ్, దీప్తి శర్మ (2-24)లు కూడా కీలక వికెట్లను సాధించారు. అన్నబెల్ సదర్‌ల్యాండ్ (45), ఎల్లీస్ పెర్రీ (44)లు పోరాడినా, ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 190కే ఆలౌట్ అయింది.
స్మృతి మంధాన ఈ సెంచరీ తనకెంతో ప్రత్యేకమని చెప్పుకుంది. ‘ఆస్ట్రేలియాపై చివరి రెండు శతకాలు ఆన్‌టైమ్‌లో ముగిశాయి. ఈసారి గెలిచి సంతోషంగా ఉంది. పవర్‌ప్లేను పూర్తిగా ఉపయోగించుకోవాలని, ఫ్లాట్ వికెట్ మీద దూకుడుగా ఆడాలని ప్లాన్ చేశాను. వరల్డ్ కప్‌లోనూ ప్రతి మ్యాచ్‌లోనూ ఈ స్టైల్‌ను కొనసాగిస్తాను, కానీ పిచ్ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది’ అని 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికైన మందాన వ్యాఖ్యానించారు.
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ, స్మృతి మంధాన ప్రదర్శనను ప్రశంసించింది. పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, ‘స్మృతి బ్యాటింగ్‌ను చాలా సులభంగా చేస్తుంది. స్టేడియంలో అందరూ ఆమె బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేశారు. ఆమె అద్భుతంగా ఆడింది’ అని అన్నారు.
క్రాంతి గౌడ్ కూడా మంధానను ప్రశంసిస్తూ, "ఆమె బ్యాటింగ్ కోసం అందరూ క్రేజీగా ఎదురు చూస్తూ ఉంటారు. స్మృతి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మొత్తం స్టేడియం ఆమె పేరుతో మారుమ్రోగిపోయింది. ఆమె అద్బుతంగా ఆడింది’ అని అన్నారు. ఈ 22 ఏళ్ల పేసర్, ఆస్ట్రేలియా కెప్టెన్ హీలీని రెండోసారి ఔట్ చేసి మ్యాచ్ విన్నర్‌గా మారింది.
ఢిల్లీ ఓపెనర్ ప్రతికా రావల్‌తో కలిసి మంధాన ఈ వన్డేలో 80.66 సగటుతో ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పింది. ‘మేము ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటాం. ఆమె ప్రశాంతంగా ఉంటుంది, నేను కూడా అలాంటిదానినే. మేము ఎలాంటి కాంప్లికేషన్స్ పెట్టుకోము. ఇన్నింగ్స్ మధ్యలో ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమె తన బెస్ట్ చేస్తుంది, నేను నా బెస్ట్ చేస్తాను. మా మధ్య ఆ బేసిక్ సెన్స్ ఉంది’ అని రావల్ చెప్పుకొచ్చారు.
గత రెండేళ్లుగా మంధాన ఒక గట్టి ఫామ్ లోకి రావడం వలన భారత్ వరల్డ్ కప్ ఆశలు పెరిగాయి. ఆమె ఆఫ్ సైడ్‌లో గ్యాపులు కనుగొనే తెలివిని మాజీ భారత కెప్టెన్ వసీం జాఫర్ 'ఆఫ్ సైడ్ గాడ్డెస్' అని పిలిచారు. ఇది మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ శైలిని గుర్తు చేస్తుంది. వరల్డ్ కప్‌లో కూడా ఈ దూకుడుతో కూడిన స్ట్రోక్‌ప్లేను కొనసాగించాలని మంధాన నిర్ణయించుకుంది. ఈ విజయంతో భారత్ వరల్డ్ కప్ ప్రిపరేషన్లు మరింత బలపడ్డాయి. మూడో మ్యాచ్ డిసెంబర్ 20న ఢిల్లీలో జరగనుంది. ఈ సిరీస్ విజయంతో భారత్ తన ఐసీసీ ట్రోఫీ కోసం మరింత ఆత్మవిశ్వాసంగా ముందుకు సాగుతుంది.
