Let's talk: editor@tmv.in
టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు

టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు

Shaik Mohammad Shaffee
20 సెప్టెంబర్, 2025

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ శుక్రవారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ముగ్గురు ఎమ్మెల్సీలకు చంద్రబాబు పసుపు కండువాలు కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి పనులు చూసి తాను టీడీపీలో చేరినట్లు తెలిపారు. ఆరు నెలల కిందట తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా లేఖలు సమర్పించినప్పటికీ, మండలి చైర్మన్ ఇంకా వాటిని ఆమోదించలేదని ఆయన పేర్కొన్నారు. మండలి చైర్మన్ వెనుక ఉండి నడిపించే వారి వల్లనే తమ రాజీనామాలను ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారంటూ ఆరోపించారు. రాజీనామాల ఆమోదం కోసం 6 నెలల పాటు ఎదురు చూశామని, ఆమోదిస్తారనే నమ్మకం లేకే టీడీపీలోకి చేరినట్లు తెలిపారు.

మరో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ మాట్లాడుతూ, తన తండ్రి జీవితాంతం టీడీపీలోనే కొనసాగారని, ఇప్పుడు తాను కూడా అదే పార్టీలో చేరడం ఒక రకంగా సొంత గూటికి తిరిగి రావడంలాంటిదని అభివర్ణించారు. మరోవైపు వైసీపీ నుంచి పదవిలో ఉన్నా ప్రజలకు ఏమీ చేయలేకపోయామని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ అన్నారు. వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఏడాది కావొస్తోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని కర్రి పద్మశ్రీ చెప్పారు. కాగా ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీలు మారిన నేపథ్యంలో ఏపీ శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు వీరి రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.

టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు - Tholi Paluku