
టీడీపీకి మరో గవర్నర్ పదవి?
తొలిపలుకు, ఏపీ;* కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తెలుగుదేశానికి మరో ఆఫర్ ఇస్తున్నదని అంటున్నారు.. టీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్ నాయుళ్లకు కేంద్ర కేబినెట్లో స్థానం ఇవ్వడమే కాకుండా సీనియర్ నేత అశోక్ గజపతికి గోవా గవర్నరుగా అవకాశం ఇచ్చారు.. అయితే ఇప్పుడు టీడీపీకి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని మోడీ భావిస్తున్నారని.. ఈ క్రమంలోనే ఇంకో గవర్నర్ పదవి కూడా ఇవ్వొచ్చని చంద్రబాబు నాయుడు క్యాంప్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలో బిహార్ లో ఎన్నికలు జరగనుండగా వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయా రాష్ట్రాల్లోని భాగస్వామ్య పార్టీలతో మరింత బలమైన బంధాల్ని కొనసాగించాలని భావిస్తోస్తున్న బీజీపీ.. ఈ క్రమంలోనే మరి కొన్ని పదవులను ఆయా పార్టీలకు ఎరగా వేస్తోందని అంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే సీనియర్ టీడీపీ నాయకుడైన అశోక్ గజపతి రాజు ను గోవా గవర్నరుగా నియమించగా ఇప్పుడు ఇంకో గవర్నర్ పోస్ట్ కూడా టీడీపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. టీడీపీకి ఇంకో పోస్ట్ ఇస్తే అది బీసీ లేదా దళిత వర్గాలకు ఇవ్వొచ్చని అంటున్నారు. బీసీల్లో అయితే యాదవ వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు పేరు పరిశీలించవచ్చని అంటున్నారు. అయన గతంలో చంద్రబాబు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు.. మొదటినుంచి బాబు అనుచరుడిగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాలన్న ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.లేదంటే రాయలసీమ నుంచి బలిజ వర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తికి అయినా గవర్నర్ పదవి దక్కవచ్చని అంటున్నారు.. గత టీడీపీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా చేసిన కేఈ కృష్ణమూర్తి కాంగ్రెస్లో రాజకీయ జీవితం మొదలు పెట్టి.. ఆ తర్వాత టీడీపీలో చేరి కీలక హోదాల్లో పని చేశారు. ఆయన సీనియారిటీ, సామాజికవర్గ ప్రాతినిధ్యం దృష్ట్యా గవర్నర్ పదవి ఆయనకు దక్కవచ్చని అంటున్నారు..
