
టీజీఎస్ఆర్టీసీలో 1,743 ఉద్యోగాల భర్తీ
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1, 743 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో డ్రైవర్ పోస్టులు 1,000 కాగా, శ్రామిక్ పోస్టులు 743 ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
డ్రైవర్ పోస్టులకు విద్యార్హతల విషయానికి వస్తే, అభ్యర్థులు జూలై 1, 2025 నాటికి పదవ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. జూలై 1, 2025 నాటికి 22 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. అలాగే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి. శ్రామిక్ పోస్టులకు అభ్యర్థులు జూలై 1, 2025 నాటికి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. జూలై 1, 2025 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ఫారం నింపేటప్పుడు అన్ని వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటో, సంతకం వంటి వాటిని అప్లోడ్ చేయాలి. దరఖాస్తు రుసుమును ఆన్లైన్లోనే చెల్లించాలి. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300, ఇతరులకు రూ.600 కాగా, శ్రామిక్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200, ఇతరులకు రూ.400గా ఉంది.
డ్రైవర్ పోస్టులు: ఈ పోస్టులకు రాతపరీక్ష ఉండదు. అయితే ఫిజికల్ టెస్టు, డ్రైవింగ్ టెస్టులు ఉంటాయి. ఫిజికల్ టెస్టులో అభ్యర్థుల ఎత్తు 160 సెం.మీ. కంటే తక్కువ ఉండకూడదు. కంటి చూపు ప్రమాణాలను కూడా పరిశీలిస్తారు. డ్రైవింగ్ టెస్టు 60 మార్కులకు ఉంటుంది. అభ్యర్థులు కనీస అర్హత మార్కులను సాధించాలి. ఈ టెస్టులో డ్రైవింగ్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. 40కి వెయిటేజ్ మార్కులు ఉంటాయి. డ్రైవింగ్ టెస్ట్, వెయిటేజ్ మార్కులను కలిపి మొత్తం 100 మార్కులకు అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
శ్రామిక్ పోస్టులు: అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సంబంధిత ట్రేడ్లో అభ్యర్థుల నైపుణ్యాలను పరిశీలిస్తారు. ట్రేడ్ టెస్టు మార్కులు, అకాడమిక్ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేసి ఎంపిక చేస్తారు. డ్రైవర్ ఉద్యోగాలకు రూ.20,960 నుంచి రూ.60,080 వరకు, శ్రామిక్ పోస్టులకు రూ.16,550 నుంచి రూ.45,030 పేస్కేల్ ఉంటుంది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://www.tgprb.in/ని సందర్శించండి .
