Let's talk: editor@tmv.in
జ్ఞాన్‌ భారతం: 7.5 లక్షల రాతప్రతుల డిజిటలైజేషన్

జ్ఞాన్‌ భారతం: 7.5 లక్షల రాతప్రతుల డిజిటలైజేషన్

Dantu Vijaya Lakshmi Prasanna
3 ఫిబ్రవరి, 2026

భారతదేశంలోని ప్రాచీన రాతప్రతులను వెలికితీసి, భద్రపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జ్ఞాన్‌ భారతం' కార్యక్రమం వేగంగా పుంజుకుంటోంది. ఈ పథకం కింద ఇప్పటివరకు 7.5 లక్షలకు పైగా రాతప్రతులను డిజిటలైజ్ చేయగా, అందులో 1.29 లక్షల ప్రతులను ఇప్పటికే ప్రత్యేక పోర్టల్‌లో అందుబాటులోకి ఉంచినట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభకు వివరించింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఎన్‌సిపి (శరద్ పవార్) నాయకుడు అమర్ శరద్‌రావు కాలే అడిగిన ప్రశ్నలకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానమిస్తూ, ఇప్పటివరకు 45 కేంద్రాలను ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేసినట్లు తెలిపారు.

కేంద్ర బడ్జెట్ 2025-26లో ప్రకటించిన ఈ ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

ఈ బృహత్తర కార్యక్రమం కోసం స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ 2025 నుండి 2031 వరకు రూ. 491.66 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. 'వికసిత్ భారత్ 2047' విజన్‌లో భాగంగా, సాంస్కృతిక పరిరక్షణను మానవ వనరుల అభివృద్ధితో అనుసంధానించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. భారతీయ ప్రాచీన విజ్ఞానం నేటి తరానికి స్ఫూర్తినిచ్చేలా చేయడమే కాకుండా, అంతరించిపోతున్న అమూల్యమైన జ్ఞాన సంపదను శాశ్వతంగా భద్రపరచడానికి ప్రభుత్వం ఈ నిధులను వెచ్చిస్తోంది.

కార్యక్రమ నిర్వహణలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 45 కేంద్రాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిలో 28 క్లస్టర్ కేంద్రాలు కాగా, 17 స్వతంత్ర కేంద్రాలుగా సేవలందిస్తున్నాయి. క్లస్టర్ కేంద్రాలలో బీహార్‌లోని పాట్నా మ్యూజియం, ఢిల్లీలోని సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ, కోల్‌కతాలోని ఏషియాటిక్ సొసైటీ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. అలాగే, స్వతంత్ర కేంద్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన సనాతన జీవన్ ట్రస్ట్, ఉత్తరప్రదేశ్‌లోని నాగరి ప్రచారిణి సభ, ప్రయాగ్‌రాజ్‌లోని హిందీ సాహిత్య సమ్మేళనం.వంటివి కీలక పాత్ర పోషిస్తున్నాయి.

సాంకేతికత పరంగా కూడా ఈ ప్రాజెక్ట్ అత్యంత ఆధునికంగా రూపుదిద్దుకుంది. రాతప్రతుల డిజిటలైజేషన్ కోసం అత్యాధునిక స్కానర్లను వినియోగించడంతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానిత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను, మొబైల్ అప్లికేషన్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా సేకరించిన సమాచారాన్ని 'నేషనల్ డిజిటల్ రిపోజిటరీ' లో చేర్చి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుండైనా భారతీయ రాతప్రతులను వీక్షించేలా అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలను పాటిస్తున్నారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన 'జ్ఞాన్‌ భారతం' పోర్టల్ ప్రస్తుతం ఈ డేటా మొత్తానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ పోర్టల్ ద్వారా ప్రాచీన గ్రంథాల్లోని సాంప్రదాయ జ్ఞానాన్ని పరిశోధకులకు, విద్యార్థులకు సులభంగా అందుబాటులోకి తెస్తున్నారు. 20 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పథకానికి నోడల్ ఏజెన్సీలుగా ఉండి, క్షేత్రస్థాయిలో రాతప్రతుల గుర్తింపు సర్వే పనులను సమన్వయం చేస్తున్నాయి.