
‘జోహో’ మెయిల్‌కి మారిన అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తన అధికారిక ఈ మెయిల్ సేవల కోసం ‘జోహో’ మెయిల్‌ను ఎంచుకున్నట్టు బుధవారం ప్రకటించారు. సోషల్ మీడియా ఎక్స్ లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక నుంచి తనతో జరిగే అన్ని అధికారిక మెయిల్ కమ్యూనికేషన్లను ఈ కొత్త ఈమెయిల్ ఐడీ కి పంపాలని ఆయన కోరారు. అమిత్ షా తన కొత్త ఈమెయిల్ ఐడీ amitshah.bjp@zohomail.in అని వివరించారు. అందరికీ నమస్కారం నేను ఇప్పుడు జోహో మెయిల్ కు మారాను. దయచేసి నా ఈ మెయిల్ ఐడీ మార్పును గమనించండి. నాతో కమ్యూనికేట్ చేసేవారు ఇక నుంచి ఈ ఐడీకి మెయిల్ పంపాలని సూచించారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
‘మాపై విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు. దేశ నాయకులు భారతీయ అవిష్కరణలను ప్రోత్సాహించడం చాలా స్పూర్తివంతమైంది. మా టీం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని’ జోహో వర్క్‌ప్లేస్ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
జోహో మెయిల్ మనదేశానిదే
జోహో మెయిల్ మనదేశానికి చెందినదే. చెన్నై కేంద్రంగా పని చేస్తోంది. ఇది భద్రతాపరంగా కూడా బాగుంటుందని, ప్రకటనలు లేకుండా రూపోందించారని జోహో సంస్థ నిర్వహకులు తెలిపారు. దీనిని 2008లో ప్రారంభించారు. దీన్ని ప్రస్తుతం వివిధ దేశాలలోని ప్రభుత్వాలు, ప్రొఫెషనల్స్, చిన్నపాటి వ్యాపార సంస్థలు విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి.
దీంట్లో ముఖ్యంగా గోప్యతా ప్రమాణాలు, ఎన్‌క్రిప్టెడ్ డేటా ట్రాన్స్‌మిషన్, టూస్టెప్ ఆథెంటికేషన్ , కస్టమ్ డొమెయిన్ వంటి ప్రత్యేకతలతో ప్రసిద్ధి పొందింది. జీమెయిల్ వంటి అంతర్జాతీయ సంస్థల సేవలపై ఆధారపడకుండా, భారతదేశం నుంచి పనిచేసే స్థానికంగా లభించే సేవలనే ఉపయోగిస్తే మంచిదనే దృష్టితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీని సర్వర్లు కూడా ఇండియా, అమెరికాలో ఉన్నాయి.
దేశీయ టెక్నాలజీకి మద్దతు
అమిత్‌షా జోహో కు మారడంతో భారతదేశ ప్రభుత్వ ఉన్నత స్థాయి నాయకులు, అధికారులు కూడా దేశీయ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌లకు మద్దతు తెలుపుతున్న విషయాన్ని స్పష్టంగా గమనించవచ్చు. ముఖ్యంగా భద్రత, గోప్యత, డేటా స్వాధీనత వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని, కేంద్ర మంత్రుల స్థాయిలో ఇలాంటి మార్పులు చేపట్టడం భవిష్యత్తులో దేశీయ డిజిటల్ సేవలకు మరింత ప్రోత్సాహాన్ని అందించనుంది. ఇటీవల 2025 సెప్టెంబర్ 22న, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా తన కార్యాలయ డాక్యుమెంటేషన్ అవసరాల కోసం జోహో ఆఫీస్ సూట్‌ను ఉపయోగించుకుంటున్నట్లు ప్రకటించారు. దీని వల్ల ఆయన "ఆత్మనిర్భర్ భారత్" (స్వదేశీ) ఉద్యమాన్ని ప్రోత్సహించినట్లైంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కూడా జోహోను వాడుతున్నాయి.
