
‘జోహో’ జయహో
సాఫ్ట్‌వేర్ రంగం అనగానే మనకు గుర్తుకు వచ్చే సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి పేర్లు గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు వాటికి పోటీగా, పూర్తిగా దేశ మేధస్సు, స్వదేశీ నైపుణ్యంతో, ఆలోచనలతో ఎదిగిన సంస్థ ‘జోహో’. తమిళనాడులోని తూత్తూకూడి జిల్లాలోని మారుమూలన ఉన్న తెన్కాసి గ్రామం నుంచే ప్రపంచానికి సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను అందిస్తోంది. ప్రస్తుతం జోహోకు 180 దేశాల్లో వినియోగదారులు, 100 మిలియన్లకుపైగా యూజర్లు, 55కిపైగా ఉత్పత్తులు ఉన్నాయి. గ్రామీణ భారత్‌లో పుట్టిన ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచ స్థాయి పోటీదారుగా నిలవడం భారత టెక్ శక్తికి ప్రతీక. లత
జోహో ఆవిర్భావం
1996లో శ్రీధర్ వెంబూ, టోనీ థామస్‌లతో కలిసి అడ్వెంట్ నెట్ (AdventNet) అనే పేరుతో సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత 2009లో దానిని జోహో కార్పోరేషన్ గా తీర్చిదిద్దారు. ఇప్పుడది ప్రపంచ దేశలైన అమెరికా, జపాన్, యూరప్ వంటి దేశాల్లో విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా వంద మిలియన్లకు పైగా వినియోగదారులు జోహో సర్వీసులను ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ దాని ప్రధాన కార్యాలయం మాత్రం తెన్కాసీలో ఉంది. శ్రీధర్ వెంబూ ఎప్పుడూ ఒకే మాట చెబుతారు. ‘మనం ఇతర దేశాల సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసే కాలం గడిచిపోయింది. ఇప్పుడు మనమే సాఫ్ట్‌వేర్ తయారు చేసి ప్రపంచానికి అమ్మే సమయం వచ్చింది’. ఈ దృక్పథమే జోహోను ప్రత్యేకంగా నిలిపింది. ఆయనకు భారత ప్రభుత్వం ‘పద్మ శ్రీ’ పురస్కారం కూడా అందించింది.
పెరుగుతున్న ఆదరణ
ఇటీవల కాలంలో జోహోకు గణనీయంగా దేశంలో ఆదరణ పెరుగుతుంది. భారతీయ స్వతంత్రత, గ్రామీణ అభివృద్ధి, స్వదేశీ టెక్నాలజీ అంశాలపై ఏర్పడ్డ సంస్థకు అనేక మంది ప్రముఖులు జోహోకు మద్దతు ప్రకటించారు. గతంలో రతన్ టాటా, సోనమ్ వాంగ్‌చుక్, అనంద్ మహీంద్రా లాంటి వ్యాపార నాయకులు జోహో స్వదేశీ ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే తాజాగా కేంద్రమంత్రులు అమిత్ షా, ఆశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ తదితరులు జోహోకు జైకొట్టారు. జోహోకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా భారతీయంగా నిర్మించిన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తి సంస్థ.
గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలకు పోటీగా సీఆర్ఎం మేనేజ్‌మెంట్, ఆఫీస్ టూల్స్, ఈ-మెయిల్ సొల్యూషన్స్ మొదలైన అనేక ఉత్పత్తులను జోహో స్వయంగా అభివృద్ధి చేస్తోంది. చిన్న వ్యాపారం నుంచి పెద్ద సంస్థ వరకు బిల్లింగ్, అకౌంటింగ్, పేస్‌రోల్ నిర్వహణ — ఇవన్నీ ఒక్కచోటనే చేయగలగడం జోహో ప్రత్యేకత.
అరట్టై కూడా అదుర్స్
జోహో కార్పొరేషన్ రూపొందించిన మరో యాప్ మేసిజింగ్ ‘అరట్టై’ యాప్ ప్రస్తుతం దేశీయ టెక్ ప్రపంచంలో సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పుడు దీనిపైనే పెద్ద చర్చ నడుస్తోంది. స్వదేశీ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌గా, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి అంతర్జాతీయ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ‘అరట్టై’ అనే పదానికి తమిళంలో ‘సంభాషణ’ అని అర్థం. ఈ యాప్ ద్వారా వినియోగదారులు టెక్స్ట్, ఆడియో, వీడియో కాల్స్, ఫోటోలు, డాక్యుమెంట్లు సులభంగా షేర్ చేసుకోవచ్చు.
కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇది అండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మ్యాక్ ఓఎస్, లినక్స్ (Android, iOS, Windows, macOS, Linux) లాంటి అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. వినియోగదారుల డాటా భారతదేశంలోని సర్వర్లలోనే భద్రంగా ఉంటుందని చెబుతున్నారు. 2021లో సాఫ్ట్ లాంచ్ అయిన ఈ యాప్‌కి, ఇటీవలి కాలంలో డౌన్‌లోడ్లు గణనీయంగా పెరిగాయి. భారతదేశంలో ‘స్వదేశీ యాప్‌లను ప్రోత్సహించాలి’ అనే ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో అరట్టై వినియోగదారులు వేగంగా పెరుగుతున్నారు. ప్రస్తుతం రోజుకు 3 లక్షలకు పైగా డౌన్‌లోడ్లు నమోదవుతున్నాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
గ్రామీణ యువతకు ప్రోత్సాహాం
తెన్కాసిలో ఉన్న జోహో క్యాంపస్ ప్రపంచానికి కొత్త పాఠం నేర్పింది ‘టాలెంట్ మెట్రో సిటీల్లోనే ఉండదు, అది గ్రామాల్లో కూడా వికసిస్తుంది’ అని నిరూపించారు జోహో స్థాపకులు. ఇక్కడ పనిచేసే ఇంజనీర్లలో చాలామంది గ్రామీణ యువకులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే. వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ వారికి ప్రోత్సాహం అందిస్తోంది. వారి కలలకు వాస్తవరూపాన్ని ఇస్తోంది. స్వీయ శిక్షణతో, ఆవిష్కరణతో వారు ప్రస్తుతం ప్రపంచస్థాయి ప్రాజెక్టులపై పని చేస్తున్నారు. ఇది భారతీయ సాఫ్ట్‌వేర్ స్వావలంబనకు సంకేతం. భారత మేధస్సు ప్రపంచాన్ని ఎలా ఆకర్షించగలదో చూపిన సజీవ సాక్ష్యం. ప్రపంచ మార్కెట్లో జోహో జెండా ఎగురుతుండగా, ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకోగల మాట ‘జోహో జయహో’.
