Let's talk: editor@tmv.in
జోర్డాన్ వలస కార్మికులకు హరీశ్‌రావు​ భరోసా

జోర్డాన్ వలస కార్మికులకు హరీశ్‌రావు​ భరోసా

Pinjari Chand
17 అక్టోబర్, 2025

మాజీమంత్రి హరీశ్ రావు చొరవతో జోర్డాన్ లో చిక్కుకున్న 12 మంది గల్ఫ్ కార్మికులను మరో వారం రోజుల్లో తెలంగాణకు రప్పించనున్నారు. ‘బతుకుబండిని నడిపేందుకు, కుటుంబాలను పోషించేందుకు జోర్డాన్ వెళ్లాం. కానీ ఇప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చే మార్గమే కనిపించట్లేదు సార్.. మమ్మల్ని కాపాడండి" అని పంపిన ఒక్క వాట్సప్ మెసేజ్ తో బీఆర్ఎస్ తెలంగాణకు చేరుకునేందుకు ప్రయత్నాలు చేసి వారిని తిరిగి తెలంగాణకు రప్పించనుంది. తెలంగాణ గల్ఫ్ కార్మికుల గోడును విన్న మాజీ మంత్రి హరీశ్ రావు , కేసీఆర్ ఆదేశాలతో 12 మందిని ఎలాగైనా రప్పించాలన్న నిర్ణయంతో వారి స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తన కార్యాలయానికి సూచించారు. వారికి స్వయంగా తానే ఫోన్ చేసి ‘ధైర్యంగా ఉండండి ఎట్లయినా మిమ్మల్ని తెలంగాణకు తీసుకువస్తాం’ అని భరోసా ఇచ్చారు.

ఒకవైపు జోర్డాన్ గల్ఫ్ కార్మికుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా మీడియా దృష్టికి తీసుకువెళ్లిన హరీశ్ రావు , మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి ద్వారా భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ఇంకోవైపు సంబంధిత కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో పెనాల్టీ చెల్లించి వారిని తెలంగాణకు తీసుకువెళ్లవచ్చు అని కంపెనీ చెప్పగా దానికి అంగీకరించారు.గల్ఫ్ కార్మికుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా చెల్లించాల్సిన మొత్తంతో పాటు, స్వదేశానికి రావడానికి అయ్యే విమాన టికెట్లను కూడా హరీశ్ రావు భరించారు. దీంతో విమాన టికెట్ల బుకింగ్ ప్రక్రియ పూర్తయింది. మరో వారంలో నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట లకు చెందిన గల్ఫ్ కార్మికులు తమ ప్రాంతాలకు చేరుకోనున్నారు. సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత వారి కుటుంబాలను కలవబోతున్నారు. త్వరలో స్వదేశానికి రాబోతున్నాం, కుటుంబ సభ్యులను కలుసుకోబోతున్నామని జోర్డాన్ లో ఉన్న గల్ఫ్ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు తమ వారు సొంతూళ్లకు రాబోతున్నారని వారి కుటుంబ సభ్యులు సంతోపడుతున్నారు.

కేసీఆర్ పాలనలో వలసలు వాపస్.. నేడు మల్లా మొదలు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

కేసీఆర్ ఆదేశాలతో జోర్డాన్ లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ గల్ఫ్ కార్మికులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలుగా ఏర్పాటు చేశాం. వారం రోజుల్లో ఇక్కడకు చేరుకుంటారు. ఇది నాకెంతో సంతృప్తిని కలిగిస్తున్నది. అభివృద్ది, సంక్షేమం సమ ప్రాధాన్యంగా సాగిన కేసీఆర్ పాలనలో వలసలు వాపస్ అయితే, రేవంత్ 22 నెలల పాలనలో వలసలు మల్లా మొదలయ్యాయి. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లుగానే, గల్ఫ్ కార్మికులను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమ బోర్డుకు ఇప్పటికీ అతీగతీ లేదు. కనీసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

జోర్డాన్ వలస కార్మికులకు హరీశ్‌రావు​ భరోసా - Tholi Paluku