Let's talk: editor@tmv.in
జోర్డాన్‌లో చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు స్వదేశానికి

జోర్డాన్‌లో చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు స్వదేశానికి

Gaddamidi Naveen
26 అక్టోబర్, 2025

బతుకుదెరువు కోసం జోర్డాన్ వెళ్లి అక్కడి సమస్యలతో చిక్కుకున్న12 మంది తెలంగాణ వలస కార్మికులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ హరీశ్ రావు నిరంతర కృషితో వీరు సురక్షితంగా తిరిగి వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న కార్మికులు హరీశ్ రావు నివాసానికి వెళ్లి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలకు చెందిన ఈ కార్మికులు జోర్డాన్‌లో కడుపు నిండా తిండి కూడా లేకుండా, అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్నామని చెబుతూ కంటతడి పెట్టుకున్నారు.

ప్రభుత్వం పట్టించుకోకపోయినా, బీఆర్‌ఎస్‌ ఆదుకుంది

వలస కార్మికులు తమ సమస్యలను వివరిస్తూ, స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినప్పటికీ ఎటువంటి స్పందన లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని వారు పేర్కొన్నారు. తమను తిరిగి స్వస్థలాలకు తీసుకురావడానికి కృషి చేసిన బీఆర్‌ఎస్ పార్టీకి, హరీశ్‌ రావుకు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేశారు.

హరీశ్‌ రావు వారి కుటుంబ పరిస్థితులు జోర్డాన్‌లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని వారికి ధైర్యం చెప్పి ఇకపై తెలంగాణలోనే ఉండి ఉపాధి, ఉద్యోగ మార్గాలు ఆలోచించాలని సూచించారు. అనంతరం కార్మికులను వారి సొంతూళ్లకు పంపేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

హరీశ్‌ రావు చొరవ

కేసీఆర్ ఆదేశాల మేరకు జోర్డాన్‌లో చిక్కుకున్న 12 మందిని రప్పించేందుకు రెండు వారాలుగా కృషి చేశామని తెలిపారు. జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లి ఏజెంట్ల వలలో పడిన అనేక మంది తెలంగాణ యువకులు బాధలు పడుతున్నారు. ఈ 12 మంది పరిస్థితి తెలిసిన వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాం కానీ స్పందన లేకపోవడంతో, జోర్డాన్‌లోని కంపెనీతో చర్చలు జరిపి పెనాల్టీ చెల్లించి స్వయంగా వారి ప్రయాణ ఖర్చులు భరించాం అని ఆయన తెలిపారు.

ప్రభుత్వాల నిర్లక్ష్యంపై హరీశ్‌ రావు విమర్శ

ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ, బతుకు తెరువు కోసం జోర్డాన్, ఇజ్రాయిల్, గల్ఫ్ వంటి దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో చిక్కుకుని ఎంతో మంది బతుకులు ఆగం అవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దునిద్ర పోతే బీఆర్‌ఎస్ పార్టీ తమ వంతు బాధ్యతగా ఈ 12 మందినీ కాపాడి స్వదేశానికి తీసుకురావడం జరిగిందని హరీష్ రావు అన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ప్రత్యేక పాలసీ నిధులు పెడతామని చెప్పి రెండు సంవత్సరాలు అయినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌లకు కూడా విజ్ఞప్తి చేస్తూ విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ బిడ్డల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజలు మనకి అధికారం ఇచ్చింది ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానిక కష్టాల్లో ఉన్నవారిని కాపాడుకోవడానికి అని హరీశ్‌ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ పార్టీ వలస కార్మికులకు బాసటగా నిలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

గల్ఫ్ సంక్షేమ బోర్డు నిర్వర్తించబడిందా?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి సంబంధించి 2024 ఏప్రిల్‌లో బోర్డు ఏర్పాటు చేయాలని ప్రకటించారు. అయితే ఆ ప్రకటన తర్వాత ఈ బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి కార్యాచరణలు, నిబంధనలు ఇప్పటికి అమల్లోకి రాలేదు. ఇటీవల మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం చేసిన హామీలు అమలు చేయకపోవడం, బోర్డు ఏర్పాటు చేయకపోవడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. అయితే ప్రభుత్వ స్థాయిలో ఈ విమర్శలకు స్పందన లేకపోవడం గమనార్హం.

గల్ఫ్ దేశాలలో వలస కార్మికుల ఇబ్బందులు,సమస్యలు

ఇతర గల్ఫ్ దేశాల్లో కూడా భారత వలస కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు ముఖ్యంగా పని ప్రదేశాల్లో ప్రమాదాలు, వేతనాల ఆలస్యం, నేరుగా నియామక సంస్థల ద్వారా రిక్రూట్‌మెంట్ ఫీజులు, జీవన ప్రమాణాల లోపం వంటి అంశాలతో సంబంధం కలిగి ఉన్నాయి.

గల్ఫ్ దేశాల కఫాలా వ్యవస్థ ప్రభావం

కఫాలా వ్యవస్థ రద్దు గురించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జోర్డాన్‌లో కఫాలా వ్యవస్థను పూర్తిగా రద్దు ఇతర గల్ఫ్ దేశాలలో ఈ వ్యవస్థను రద్దు చేయడానికి కొన్ని చర్యలు తీసుకున్నాయి.

సౌదీ అరేబియా,కువైట్,కతార్,ఒమన్ దేశాలలో పరిస్థితులు

సౌదీ అరేబియాలో, నియోమ్ వంటి భారీ నిర్మాణ ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్న వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో, 2017 నుంచి 2024 వరకు సుమారు 21,000 మంది వలస కార్మికులు మరణించారని నివేదికలు తెలిపాయి. మరణాలపై సమగ్ర దర్యాప్తు లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. అలాగే 50°C వరకు వేడి 16 గంటల పని గంటలు తక్కువ నిద్ర వంటి పరిస్థితులు కార్మికుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

కువైట్‌లో 2024 జూన్‌లో మంగాఫ్ ప్రాంతంలో జరిగిన భవన అగ్నిప్రమాదంలో 50 మంది వలస కార్మికులు మరణించారు. వారిలో 46 మంది భారతీయులు ముఖ్యంగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు. ఈ ప్రమాదం తర్వాత భారత ప్రభుత్వం వారి శవాలను స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంది.

కతార్‌లో 2022 ఫిఫా ప్రపంచ కప్ కోసం నిర్మాణ ప్రాజెక్టులలో పనిచేస్తున్న వలస కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిలో అనేక మంది మరణించారు. అలాగే "కఫాలా" వ్యవస్థ కారణంగా కార్మికులు తమ ఉద్యోగ మార్పులు చేయడానికి లేదా స్వదేశానికి వెళ్లడానికి కష్టాలు ఎదుర్కొన్నారు.

ఒమన్‌లో, గృహ పనులలో పనిచేసే వలస కార్మికులు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. ప్రతి 6 రోజులకు ఒక భారతీయ వలస కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నివేదికలు ఉన్నాయి. ఈ సమస్యపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంస్థలు సూచిస్తున్నాయి.

కఫాలా వ్యవస్థ రద్దు వల్ల వలస కార్మికులకు వచ్చే లాభాలు, ప్రయోజనాలు

కఫాలా వ్యవస్థ రద్దు ద్వారా కార్మికులు స్వతంత్రంగా ఉద్యోగ మార్పు చేసుకోవడం తమ హక్కులు సాధించడం ఆర్థిక భద్రత జీవన ప్రమాణాలు మెరుగుపడటం మానసిక ఒత్తిడి తగ్గించడం వంటి ప్రధాన ప్రయోజనాలు పొందుతారు.

జోర్డాన్‌లో చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు స్వదేశానికి - Tholi Paluku