Let's talk: editor@tmv.in
జోగుళాంబ ఆలయం - మహత్తరమైన శక్తిపీఠం

జోగుళాంబ ఆలయం - మహత్తరమైన శక్తిపీఠం

Dantu Vijaya Lakshmi Prasanna
1 అక్టోబర్, 2025

భారతదేశ చరిత్రలో శక్తి ఆరాధనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. “ఆది శక్తి”గా పిలిచే అమ్మవారికి అనేక రూపాలు ఉన్నాయి. శక్తి పీఠాలులో వెలసిన అమ్మవారికి మరింత ప్రత్యేకత ఉంది. భారత దేశంలోప్రజలు ఈ శక్తి పీఠాలను అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు.అలాంటి 18 శక్తి పీఠాలలో ఒకటైన జోగుళాంబ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల్ జిల్లాలో ఆలంపూర్ పట్టణంలో తుంగభద్ర నది తీరాన వెలసి ఉంది. ఈ ఆలయం మహా శక్తి పీఠాలలో ఒకటి కావడం ఇక్కడి అత్యంత విశిష్టతగా చెబుతారు. జోగుళాంబ అమ్మవారు ఇక్కడ ఉగ్ర స్వరూపంలో దర్శనమిస్తారు. ఆమె శవంపై ఆసీనమై ఉంటారు. తలపై తాబేలు, బల్లి, తేనెటీగ వంటి చిహ్నాలు అలంకరించబడి ఉంటాయి. ఇవి జీవన నశ్వరత్వం, మరణంపై తల్లి శక్తి అధిపత్యాన్ని సూచిస్తాయి. ఈ రూపమే అమ్మవారి భక్తులకు భయనివారణం, దుష్టశక్తుల నివారణం కలిగిస్తుందని నమ్మకం. చరిత్రలో, ఈ ఆలయం 14వ శతాబ్దంలో బహ్మనీ సుల్తాన్ల దాడుల వలన ధ్వంసమైంది. అమ్మవారి విగ్రహాన్ని అప్పట్లో భద్రంగా మరొక చోట దాచిపెట్టారు. దాదాపు 600 సంవత్సరాలు ఆ విగ్రహం బయటకు రాలేదు. 2005లో జోగుళాంబ అమ్మవారి మూలవిగ్రహాన్ని మళ్లీ ప్రతిష్టించి, ఆలయాన్ని పునర్నిర్మించారు. అప్పటి నుంచి ఇది భక్తుల యాత్రా క్షేత్రంగా తిరిగి వెలుగులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం చాళుక్య శిల్పకళ, పురాణ కథలు, భక్తి సంప్రదాయాల సమ్మేళనంగా నిలుస్తుంది. శివ - శక్తి సంబంధం గల శక్తి పీఠం - శ్రీశైల జ్యోతిర్లింగం సమీపంగా ఉండడం వల్ల యాత్రికులకు ఈ క్షేత్రం మరింత చేరువయ్యింది .

జోగుళాంబ దేవాలయం - **చారిత్రక నేపథ్యం

దక్ష యజ్ఞం మరియు సతీ స్వీయ దహనం యొక్క పురాణాలు శక్తి పీఠాలలో మూలకథలు

స్కంద పురాణం ప్రకారం, సతీదేవి తన తండ్రి దక్షుని యజ్ఞంలో అగ్నిప్రవేశం చేసినప్పుడు, శివుడు ఆమె దేహాన్ని మోసుకుంటూ భూమి చుట్టూ తిరిగాడు. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని అనేక భాగాలుగా చేశారు. అవి భూలోకంలోని విభిన్న ప్రదేశాల్లో పడ్డాయి. ఆ ప్రదేశాలన్నీ శక్తి పీఠాలుగా రూపాంతరం చెందాయి. వాటిలో ఆలంపూరులో సతీదేవి దవడ (జవడ/పళ్ళ భాగం) పడినదని చెబుతారు.ఆలంపూర్ ప్రాంతాన్ని “దక్షిణ కాశి” అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ నవబ్రహ్మ దేవాలయాలు (శ్రీ బాల బ్రహ్మేశ్వరుడు ప్రధానంగా) సహా అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి.

ఈ ఆలయ సముదాయం 7వ శతాబ్దంలో చాళుక్యుల కాలం (బాదామి చాళుక్యుల కాలం, పులకేశి II పాలన) లో నిర్మించబడింది. అందుకే శిల్పకళల సమ్మేళనంగా నిలిచింది. అలాగే ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా ”దక్షిణ కాశి”గా ప్రసిద్ధి చెందింది. 14వ శతాబ్దం 1390లో బహమనీ సుల్తానులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. అప్పట్లో జోగుళాంబ అమ్మవారి విగ్రహాన్ని దాదాపు 600 సంవత్సరాలు రహస్యంగా భద్రపరిచారు. విజయనగర చక్రవర్తి హరహర రాయ 2 బహమనీ సుల్తాన్ సైన్యంతో పోరాడటానికి తన సైన్యాన్ని పంపాడని మరియు తదుపరి దాడులను ఆపడానికి ఆలయ సముదాయాన్ని బలోపేతం చేశాడని చెబుతారు. ప్రధాన విగ్రహాన్ని నవ బ్రహ్మ ఆలయ సముదాయంలోని సమీపంలోని బాల బ్రహ్మ ఆలయానికి మార్చారని, అప్పటి నుండి, ఆ విగ్రహాన్ని బాల బ్రహ్మ ఆలయంలో ఏకాంత ప్రదేశంలో పూజిస్తున్నారనీ చరిత్ర కారులు చెబుతున్నారు . జోగులాంబ ఆలయాన్ని 2005లో దాని పూర్వ స్థానంలో పునర్నిర్మించారు. అసలు విగ్రహాన్ని కొత్త ఆలయంలో ప్రతిష్టించారు.

మతపరమైన ప్రాముఖ్యత*

జోగులాంబ అమ్మవారు ఆది శక్తి యొక్క ఉగ్ర స్వరూపంగా పూజింపబడతారు. అమ్మవారు శవంపై ఆసీనంగా, తలపై తాబేలు, బల్లి, తేనెటీగ వంటి చిహ్నాలతో దర్శనమిస్తారు. ఇవి జీవన నశ్వరత్వం, మరణం మీద తల్లి శక్తి ఆధిపత్యాన్ని సూచిస్తాయి. ఆలయ పరిసరాల్లోని నవబ్రహ్మాల గుడులు చాళుక్యుల శిల్పకళను ప్రతిబింబిస్తాయి. అమ్మవారిని దర్శించుకోవడం వలన అపశకునాలు, దుష్టశక్తులు తొలగిపోతాయని, ఐశ్వర్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

ఆలయ నిర్మాణ శైలి

ప్రస్తుత దేవాలయం ఆధునిక నిర్మాణం అయినప్పటికీ, చాళుక్య శిల్పకళా మాధుర్యం స్పష్టంగా కనిపిస్తుంది. గర్భగుడిలో జోగులాంబ అమ్మవారు ప్రతిష్టించబడి ఉంటారు. సమీపంలోని బాల బ్రహ్మేశ్వర ఆలయం మరియు ఇతర నవబ్రహ్మ గుడులు శిల్ప వైభవానికి అద్భుత ఉదాహరణలు.సమీపంలో ప్రవహించే తుంగభద్ర నది ఈ పవిత్ర క్షేత్ర సౌందర్యాన్ని మరింత పెంచుతుంది.

ముఖ్య ఉత్సవాలు

మహా శివరాత్రి -మహా శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి .ఆలయ సముదాయమంతా భక్తులతో కిక్కిరిసిపోతుంది.ప్రత్యేక పూజలు అబిషేకాలు కన్నుల పండుగగా జరుగుతాయి . నవరాత్రులు, శక్తి పూజలు - అమ్మవారి ఆరాధనలో ప్రధానంగా జరుగుతాయి.

కార్తీక మాసం -దీపోత్సవాలు, ప్రత్యేక పూజలు, యాత్రలు జరుగుతాయి.

అమ్మవారి దసరా మహోత్సవాలు

ఈ ఆలయం లో దసరా (విజయదశమి) ఉత్సవాలు ఎంతో వైభవంగా, విశేష భక్తిశ్రద్ధలతో జరుగుతాయి. నవరాత్రుల తొలిరోజు నుండి విజయదశమి వరకు ఆలయ పరిసరాలు ఉత్సాహభరిత వాతావరణంలో మునిగిపోతాయి. మూలవిరాట్ జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు ప్రతి రోజు వేరువేరుగా చేస్తారు. అమ్మవారిని శక్తి రూపాలైన దుర్గ, మహిషాసుర మర్ధిని, లక్ష్మి, సారస్వతి, అన్నపూర్ణేశ్వరి మొదలైన రూపాలలో ఆరాధిస్తారు. భక్తులు గజమాల, బొమ్మల కొలువు, హారతులు సమర్పిస్తూ పాల్గొంటారు.

ఉత్సవాల ప్రధాన అంశాలు

అలంకరణలు - ప్రతి రోజు అమ్మవారిని వేరు వేరు రూపాలలో అలంకరిస్తారు .

చండీహోమం & నవరాత్రి హవనాలు -శక్తి ఆరాధనలో భాగంగా జరిగే విశిష్ట పూజలు.ఈ హోమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతాయి .

సామూహిక కుంకుమార్చన - స్త్రీలు విస్తృతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని పవిత్ర కుంకుమార్చన చేస్తారు. సంగీత, నృత్య కార్యక్రమాలు - ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయ కళా ప్రదర్శనలు ప్రతీ రోజు ఆద్యాత్మిక వాతావరణం లో జరుగుతాయి. విజయదశమి శోభాయాత్ర -చివరి రోజు అమ్మవారిని అలంకరించి ప్రత్యేక ఊరేగింపు జరుపుతారు

భక్తుల సందడి*

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు.

భక్తులు గరగాలు, బోనాలు, పాలహారాలు, ప్రసాదాలు సమర్పిస్తారు. అమ్మవారి ఆలయంలో దసరా రోజుల్లో పాలాభిషేకం, కుంకుమాభిషేకం విశేషంగా జరుగుతాయి.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత*

నవరాత్రుల్లో జోగుళాంబ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భయాలు తొలగి, శక్తి, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. విజయదశమి రోజున అమ్మవారిని పూజించడం వలన అన్ని అడ్డంకులను తొలగించి విజయాన్ని ప్రసాదిస్తుంది అని భావిస్తారు. ఈ దసరా రోజుల్లో జరిగే జాతరలో స్థానిక గిరిజన సంప్రదాయాలు, భక్తి ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తాయి . జోగుళాంబ దేవాలయంలో దసరా ఉత్సవాలు భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక వైభవం కలిసిన ఒక మహోత్సవం.

ఎలా చేరుకోవాలి?

రోడ్డు మార్గం: హైదరాబాద్‌ నుండి ఆలంపూర్‌ సుమారు 220 కి.మీ, కర్నూల్‌ నుండి 27 కి.మీ.రైలు మార్గం: సమీప రైల్వే స్టేషన్ ఆలంపూర్‌ రోడ్‌ స్టేషన్ (10 కి.మీ దూరంలో) హైదరాబాద్-బెంగళూరు హైవే లైన్‌లో ఉంది. సమీప విమానాశ్రాయం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (200 కి.మీ దూరంలో) ఉంది. జోగులాంబ దేవాలయం కేవలం శక్తి పీఠం మాత్రమే కాదు, ఇది చాళుక్య శిల్పకళ, పురాణ గాథలు, భక్తి సంప్రదాయాలు మిళితమైన అపూర్వమైన పవిత్ర క్షేత్రం.

జోగుళాంబ ఆలయం - మహత్తరమైన శక్తిపీఠం - Tholi Paluku