Let's talk: editor@tmv.in
జోగి రమేష్ నివాసానికి జగన్.. పోలీసుల ఆంక్షల మధ్య పర్యటన

జోగి రమేష్ నివాసానికి జగన్.. పోలీసుల ఆంక్షల మధ్య పర్యటన

Panthagani Anusha
7 ఫిబ్రవరి, 2026

రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఘటనలు నాగరిక సమాజాన్ని సిగ్గుపడేలా చేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని ఆయన సందర్శించారు. పెట్రోల్ బాంబులు, యాసిడ్ దాడులతో ఛిద్రమైన ఇంటి భాగాలను స్వయంగా పరిశీలించిన జగన్, భయాందోళనకు గురైన జోగి రమేష్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజ్యాంగం కాకుండా 'జంగిల్ రాజ్' నడుస్తోందని మండిపడ్డారు.

హత్యాయత్నమే.. ఇది ప్రజాస్వామ్యమా?

జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడిని జగన్ ముమ్మాటికీ హత్యాయత్నంగా అభివర్ణించారు.ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరారు, యాసిడ్ బాటిళ్లతో దాడులు చేశారు. ఇంట్లో 80 ఏళ్ల వృద్ధుడు ఉన్నాడని కూడా చూడకుండా ఇలాంటి క్రూరత్వానికి ఒడిగట్టారు. గోడలు, తలుపులు కాలిపోయాయి.. అదే యాసిడ్ స్విచ్ బోర్డులపై పడి ఉంటే పరిస్థితి ఏమిటి? ఇది పక్కా ప్లాన్ తో జరిగిన హత్యాయత్నం కాదా అని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా గుంటూరులో అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ, పోలీసుల సమక్షంలోనే గంటల తరబడి విధ్వంసం జరగడం నాగరిక ప్రపంచానికి అవమానకరమని జగన్ వ్యాఖ్యానించారు.

పోలీసులు - టీడీపీ కుట్రలు

ఈ దాడుల వెనుక పోలీసుల హస్తం కూడా ఉందంటూ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ నాయకులు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి సమావేశాలు నిర్వహించిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయని.. పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులు విసిరినా ఎవరూ అడ్డుకోలేదని ఆరోపించారు. జోగి రమేష్‌పై రాజకీయ కక్షతోనే 12 అక్రమ కేసులు పెట్టారని, 83 రోజులు జైల్లో పెట్టి బీసీ నాయకులను అణగదొక్కాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ జంగిల్ రాజ్‌ను దేశం దృష్టికి తీసుకెళ్తామని, ఎన్‌హెచ్‌ఆర్‌సీ నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు అబద్ధాలు బట్టబయలు

తిరుమల లడ్డూ కల్తీ అంశంపై చంద్రబాబు చేసిన ప్రచారం అంతా అబద్ధమని జగన్ విమర్శించారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న చంద్రబాబు ఆరోపణలను సీబీఐ చార్జిషీట్ తో పాటు ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టులు కూడా కొట్టివేసాయని గుర్తు చేశారు. "సీబీఐ చార్జిషీట్‌లో వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు లేవు. వారు తప్పు చేయలేదని స్పష్టమైంది. మరి ఇప్పుడు పాపం చేసినవారు ఎవరు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలి" అని డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ధ్వజమెత్తారు.

ఆంక్షల మధ్య పర్యటన - పార్టీ నేతలకు నోటీసులు

మరోవైపు జగన్ పర్యటన సందర్భంగా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేసి పర్యటనలో పాల్గొనవద్దని ఆదేశించారు. ఈ ఆంక్షలపై వైసీపీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ రావు స్పందిస్తూ ప్రతిపక్ష గొంతు నొక్కడం సాధ్యం కాదని, పోలీసులను అడ్డుపెట్టుకుని చేస్తున్న ఈ 'గూండా రాజ్' కు ముగింపు వస్తుందని హెచ్చరించారు. ఆంక్షలు ఎన్ని ఉన్నా, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్‌కు మద్దతు తెలపడం విశేషం.

జోగి రమేష్ నివాసానికి జగన్.. పోలీసుల ఆంక్షల మధ్య పర్యటన - Tholi Paluku