Let's talk: editor@tmv.in
జోగిపేట వాసికి మంత్రి దామోదర రాజనర్సింహ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌ అందజేత

జోగిపేట వాసికి మంత్రి దామోదర రాజనర్సింహ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌ అందజేత

Gaddamidi Naveen
24 ఫిబ్రవరి, 2026

ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తన ఉదారతను చాటుకున్నారు. జోగిపేట మున్సిపాలిటీకి చెందిన ఒక నిరుపేద రోగికి తన సొంత ఖర్చుతో వైద్య పరికరాలను అందజేసి ప్రాణదాతగా నిలిచారు.

జోగిపేట 16వ వార్డుకు చెందిన గంజి మల్లేశం గత కొంతకాలంగా తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబం, మల్లేశం శ్వాస తీసుకోవడానికి అవసరమైన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌, బైప్యాప్ మెషిన్ కోసం నెలకు రూ. 10 వేలు అద్దె చెల్లిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే స్పందించారు.

మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం, సోమవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి మల్లేశం కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడారు. వారికి సుమారు లక్షల విలువ చేసే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌, బైప్యాప్ మెషిన్‌ను స్వయంగా అందజేశారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని, ఆపదలో ఉన్న ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. తమ ఆర్థిక భారాన్ని తగ్గించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మల్లేశానికి అండగా నిలిచినందుకు ఆయన కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.