
జైళ్లు, సంస్కరణల బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
రాష్ట్రంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల పట్ల కూటమి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని వారి క్షమాభిక్ష విషయంలో మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఎనిమిదో రోజున ‘జైళ్లు-సంస్కరణల చట్ట సవరణ బిల్లును ఆమె సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ అనంతరం ఈ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
శిక్షా కేంద్రాలు కాదు.. పరివర్తన కేంద్రాలు
ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ జైళ్లను కేవలం శిక్ష విధించే కేంద్రాలుగా కాకుండా ఖైదీల్లో మానసిక పరివర్తన తెచ్చే సంస్కరణా నిలయాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్రం రూపొందించిన ‘మోడల్ ప్రిజన్ యాక్ట్ కు అనుగుణంగా రాష్ట్రంలోనూ సమగ్ర మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఖైదీల నేరచరిత్ర, జైలులో వారి ప్రవర్తన ఆధారంగా వివిధ కేటగిరీలుగా విభజించి వారికి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కల్పిస్తామన్నారు.
చిన్నారుల కోసం అంగన్‌వాడీలు.. పునరావాసానికి పెద్దపీట
మహిళా ఖైదీలతో పాటు జైలులో ఉంటున్న వారి పిల్లల భవిష్యత్తుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని మంత్రి వెల్లడించారు. జైలు ప్రాంగణాల్లోనే అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి చిన్నారులకు పౌష్టికాహారం, విద్య, ఆరోగ్య సదుపాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఖైదీలను బాధ్యతాయుత పౌరులుగా మార్చేందుకు ‘ఓపెన్ ఎయిర్ జైళ్ల’ సంఖ్యను పెంచుతామని, అక్కడ వ్యవసాయం వివిధ వృత్తి విద్యల్లో శిక్షణ ఇచ్చి వారు సమాజంలో గౌరవంగా బతికేలా పునరావాస కార్యక్రమాలు చేపడతామని వివరించారు.
ఖాళీలను భర్తీ చేయాలి: దూళిపాళ్ల
బిల్లుపై జరిగిన చర్చలో పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర చౌదరి కీలక సూచనలు చేశారు. జైళ్ల శాఖలో సుమారు 30 శాతం సిబ్బంది కొరత ఉందని, ముఖ్యంగా మహిళా పోలీసులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సభ దృష్టికి తెచ్చారు. 60 ఏళ్లు దాటిన వృద్ధ ఖైదీలకు చిన్న చిన్న కేసుల్లో రిమాండ్‌లో ఉన్న వారికి సత్‌ప్రవర్తన ఆధారంగా క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు. అండర్ ట్రయల్ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించి వారు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గకుండా చూడాలని సూచించారు. ఇక సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, చట్టపరమైన ప్రమాణాలను పాటిస్తూ అర్హులైన ఖైదీల విడుదలపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
