
జైల్లో నన్ను తీవ్రవాదిలా చూశారు
మద్యం కేసులో అరెస్ట్ అయి దాదాపు 71 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి మొన్ననే విడుదల అయిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు.. తానున్న సెల్లో సీసీ కెమెరాలు పెట్టారని.. వాటిని విజయవాడ.. హైదరాబాద్ లో ఉంటున్న కొందరు పెద్దలు చూస్తూ ఉండేవాళ్ళని తనకు తెలిసిందని అన్నారు.. బుధవారం అయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. జైల్లో తనను అవమానకరంగా చూసేవారని.. పక్కనున్నవారితో కూడా మాట్లాడనిచ్చేవారు కాదని అన్నారు.
జైల్లో తనను తీవ్రవాదిలా చూశారని, అధికారులు కూడా తనతో మాట్లాడేందుకు వెనుకాడేవారని మిథున్ రెడ్డి ఆవేదన చెందారు. జైలులో తన గదిలో సీసీ కెమెరాలు పెట్టి విజయవాడ నుంచి పర్యవేక్షించేవారని మిథున్ రెడ్డి ఆరోపించారు. జైలులో తనను ఒక బ్లాకులో నిర్బంధించారని, బయట ఎవరితో ఎవరితో మాట్లాడనీయలేదని ఎంపీ చెప్పారు. కేవలం ములాఖత్ లో మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడేవాడనని, సీసీ కెమెరాల నిఘాలో ఉంచారని మిథున్ రెడ్డి చెప్పారు. పక్కవారితో మాట్లాడితే ఏదో ఇబ్బంది వస్తుందన్నట్లు చూశారని ఆరోపించారు. సీసీ కెమెరాలో తనను విజయవాడ నుంచి కొందరు పెద్దలు చూసే అవకాశం ఉందని జైలు అధికారులు చెప్పారన్నారు. అక్కడ దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నానని, అయినా ధైర్యంగా ఉంటూ ప్రజలమధ్యకు వచ్చానని అన్నారు.
