
జైపూర్ లో ఐఏఎస్ దంపతుల మధ్య గొడవలు
వారిద్దరూ ఐఏఎస్ అధికారులు, దంపతులు. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. కానీ తరచూ వారి మధ్య గొడవలు ఏర్పడి కేసులు నమోదు అయ్యే దాకా తెచ్చుకున్నారు. రాజస్థాన్ పరిపాలనా వర్గాల్లో ఈ వివాదం కలకలం సృష్టించింది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అయినా భారతీ దీక్షిత్ తన భర్త అయినా ఆశీష్ మోదీపై (ఆయన కూడా ఐఏఎస్ అధికారే) తీవ్రమైన ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవంబర్ 7న జైపూర్‌లోని ఎస్.ఎం.ఎస్. పోలీస్ స్టేషన్‌లో ఈమె ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భర్త తనను ఆయుధంతో బెదిరించడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధించారని, అన్యాయంగా బంధించి ఉంచాడని, ఆయనకు ఇతరులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే భర్త మద్యం మత్తులో తరచూ తనపై దాడి చేశారని, విడాకులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, ఐఏఎస్ ఎంపిక సమయంలో తన తండ్రి కేన్సర్‌తో బాధపడుతుండగా ఆ సమయంలో తన తండ్రిని మోసం చేసి తనను వివాహం చేసుకున్నారని, దాంతో పాటు తన కేడర్ వివరాలను తప్పుడు రీతిలో చూపించి రాజస్థాన్‌లోనే పోస్టింగ్ పొందారని ఆమె పేర్కొన్నారు.
2018లో వీరికి ఐవీఎఫ్ ద్వారా కూతురు జన్మించింది. ఆ తర్వాత భర్త ప్రవర్తన మరింత హింసాత్మకంగా మారిందని, గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారని, డిల్లీలో తల్లిదండ్రుల వద్ద ఆశ్రయం పొందాల్సి వచ్చిందని ఆమె వివరించారు. జైసల్మేర్, భిల్వారా పోస్టింగ్ సమయంలో భర్త ఇతరులతో వివాహేతర సంబంధాల్లో ఉన్నారని, ఆ విషయాలు స్థానిక మీడియాలో కూడా చర్చకు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఏడాది అక్టోబర్ 14, 15 తేదీల్లో తమను వేధించడం మరింత తీవ్రమైందని, భర్త తనను, కూతురిని ఒక ఇంట్లో గంటకు పైగా బంధించి, తుపాకీతో బెదిరించారని, ఫోన్ లాగేసుకుని తన కుటుంబానికి హానిచేస్తానని హెచ్చరించారని ఆమె ఆరోపించారు. అదేవిధంగా, రహస్య కెమెరాలు, ఫోన్ ట్రాకింగ్ చేసి తనపై బ్లాక్‌మెయిల్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో రాష్ట్ర ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
