Let's talk: editor@tmv.in
జేబులో డబ్బు.. అనేక నిర్వచనాలు

జేబులో డబ్బు.. అనేక నిర్వచనాలు

Dantu Vijaya Lakshmi Prasanna
2 అక్టోబర్, 2025

ప్రపంచంలో ప్రతి మనిషి తనకంటూ ఒక కల, ఒక లక్ష్యం పెట్టుకుని జీవిస్తాడు. కానీ ఆ లక్ష్యాలన్నిటి వెనుక ఎక్కువగా కనిపించేది ఒకే ఒక్క సాధనం డబ్బు. “డబ్బు లేకపోతే జీవితం ముందుకు సాగదు” అన్న నిజం ఎవరూ తిరస్కరించలేరు. అందుకే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ డబ్బు కోసం పరితపిస్తూ గడుపుతున్నారు. చదువు, ఉద్యోగం, వ్యాపారం, శ్రమ అన్నీ చివరికి డబ్బు సంపాదనే లక్ష్యంగా మారాయి. అయితే ఒక సారి ఆలోచించండి . డబ్బు సంపాదన మనిషి జీవితానికి మూల్యమేనా? లేక అది కేవలం ఒక మాధ్యమమా? డబ్బు మనకు ఇల్లు ఇస్తుంది, కానీ ఇంటి లోపల ఉండే ప్రేమను ఇవ్వలేదు. డబ్బు మనకు భోజనం ఇస్తుంది, కానీ ఆహారంలో రుచిని ఇచ్చేది మనసులోని ఆనందమే. డబ్బు మనకు మందులు కొనిపెడుతుంది, కానీ నిజమైన ఆరోగ్యాన్ని మాత్రం ఇవ్వదు.

చాలా మంది తమ జీవితమంతా కష్టపడి సంపాదిస్తారు. దాంతోపాటే సంపాదన పెరిగే కొద్దీ కుటుంబానికి దూరమవుతారు. స్నేహితుల్ని కోల్పోతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. చివరికి కోట్ల సంపాదన ఉన్నా మనసుకు శాంతి లేకుండా, ఒంటరితనంలో బాధపడుతూ మిగిలిపోతారు.అందుకే మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఎంత డబ్బు సంపాదించినా, జీవితం సంతోషంగా లేకపోతే దాని ప్రయోజనం ఏమిటి? మనిషి జీవితంలో డబ్బుకి ప్రాధాన్యం ఎంత స్థాయిలో ఉందో చూద్దాం.

డబ్బు అవసరమనే వాస్తవం

డబ్బు లేకపోతే నిత్యావసరాలను సమకూర్చుకోలేం. పిల్లల చదువు, వైద్యం, వృద్ధాప్యంలో భద్రత అన్నిటికీ భరోసా ఈ డబ్బే. అందుకని డబ్బు సంపాదనను పూర్తిగా నిర్లక్ష్యం చేయలేం. మంచి ఇల్లు, వాహనం, ఆధునిక సాంకేతిక సౌకర్యాలు ఏదైనా డబ్బుంటే పొందవచ్చు. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్ట, పదవి ఇలా అన్నీ చాలా సార్లు ధనంపై ఆధారపడి ఉంటాయి.

డబ్బుకీ పరిమితులు

ఒక్కోసారి ఎంత డబ్బు వున్నా ఆ డబ్బు మనకు ఆరోగ్యం ఇవ్వలేదు .సంపాదన కోసం రాత్రింబగళ్లు కష్టపడి శరీరాన్ని నాశనం చేసుకుంటే, ఆ తర్వాత సంపాదించిన మొత్తం ఆసుపత్రులకే చదివించాల్సి వస్తుంది. ఒకవేళ అక్కడ ఖర్చుపెట్టినా ప్రాణాలతో తిరిగి వస్తామనే గ్యారంటీ లేదు. డబ్బు మనసుకు ప్రశాంతతను ఇవ్వలేదు . విలాసవంతమైన ఇల్లు ఉన్నా, కుటుంబంతో సమయం గడపకపోతే ఆ ఇల్లు ఒక జైలు లాంటిదే. డబ్బు ప్రేమను కొనలేదు. బంధాలు,స్నేహాలు, విశ్వాసంతో నిలుస్తాయి, ధనంతో కాదు.

డబ్బుతో వచ్చే ప్రమాదం

లోభం పెరిగితే మనిషి ఎప్పటికీ తృప్తి పొందడు. ఎంత ఉన్నా ఇంకా కావాలి అన్న ఆశతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటాడు. అధిక సంపాదన కోసం కొందరు అవినీతి, అక్రమాలకు పాల్పడతారు. దీని వలన వ్యక్తిగత జీవితం, సమాజం రెండూ దెబ్బతింటాయి. ధనముంటేనే అన్నీ అన్న భావన మనిషి విలువలను, నైతికతను కోల్పోయేలా చేస్తుంది.

సంతోషకర జీవితం అంటే ఏమిటి? ఎలా వస్తుంది

మనిషి జీవితం లో ఆస్తులు, అంతస్తులు, కీర్తీ, ప్రతిష్టలు అవసరం.కానీ ఇవన్నీ ఉన్నా కూడా నిజమైన సంతోషం అందరికీ దొరకదు. కొంతమంది ధనవంతులు కూడా తీవ్రమైన బాధలు అనుభవించడం మనం చూస్తుంటాం. ఇవి మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. మీ నాన్నగారి జీవితం కంటే మీ జీవితం మెరుగ్గా ఉంటే మీరు అదృష్టవంతులే. ఎందుకంటే చాలా మంది కోట్లు సంపాదించినా కూడా దివాళా తీయాల్సి వస్తుంది. అప్పుడు జీవితం సంపాదన కంటే జీవన విలువలు ముఖ్యమని నేర్పుతుంది.

డబ్బు ఎంత ఉన్నా మానసిక సంతోషాన్ని అస్వాదించలేని వారెందరో మన ముందు సాక్ష్యాలుగా ఉన్నారు. ఒకసారి సత్య నాదెళ్ళ జీవితాన్ని చూడండి. ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం. మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ళ వేల కోట్లు సంపాదించారు. ఆయన కొడుకు అంగవైకల్యం తో వీల్‌చైర్‌కే పరిమితమయ్యాడు. దాదాపు 25 సంవత్సరాల జీవితం తర్వాత కుమారుని మరణం అతని కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మాగుంట సుబ్బరామిరెడ్డి ధనవంతులే అయినా, ఆయన కొడుకు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేమంటే సంపదతో అన్నీ సాధ్యం కావు. ఆరోగ్యం, బుద్ధి చాలా ముఖ్యమైనవని కూడా గుర్తుంచుకోవాలి.

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వందల కోట్లు సంపాదించారు. రాజకీయ ప్రస్థానంలో అందనత ఎత్తుకి ఎదిగారు. తెలుగువారు గర్వపడే నాయకుడిగా చరిత్ర సృష్టించారు. మొదటి భార్య మరణంతో కుటుంబం లో ఖాళీ ఏర్పడింది. రెండో వివాహాం కలహాలకు దారి తీసింది. చివరికి మనస్తాపంతో ఆయన జీవితం ముగిసింది. ఇది ఒకరిని విమర్శించడం కాదు. వారి జీవితాలను చూసి ఏమినేర్చుకోవాలో ఆలోచించడం. సింఘానియా అందరికీ పరిచయమున్న వ్యక్తే. రేమాండ్స్ అధినేత విశ్వపతి సింఘానియా తన జీవితాన్ని పనికి అంకితమిచ్చి ఆస్తులు సంపాదించారు. చివరికి కుమారుడే వారిని ఇంటి నుంచి బయటకు పంపించాడు.డబ్బు ఉన్నా కూడా బంధాలు నిలబడకపోతే జీవితం శూన్యమవుతుంది.దీన్ని బట్టి కొన్నిసార్లు మనం సంపాదించే ప్రతీ రూపాయి మనకి ఉపయోగ పడకపోగా మనిషిని మరింత అధ:పాతాళంలోకి నెట్టేస్తుంది అని గ్రహించాలి.

డబ్బుకంటే ధర్మం

మనము ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు. ధర్మమైన మార్గంలో నడుస్తూ, పిల్లలకు మంచి సంస్కారం నేర్పడం ముఖ్యం. సంపాదించిన డబ్బు ధర్మకార్యాలకు ఉపయోగపడితేనే అది నిజమైన సుఖాన్ని ఇస్తుంది.

డబ్బుతో అహంకారం

డబ్బు ఎల్లప్పుడూ సుఖం ఇవ్వదు. అది మనిషిలో అహంకారాన్ని పెంచుతుంది. అహంకారం వచ్చిన చోట సమస్యలు వస్తాయి. డబ్బు అనేది కొంతమేరకు అవసరం కానీ అహంకారానికి మూలం కాకూడదు.

మనిషి బాధలకు ప్రధాన కారణం కోరికలు అని గౌతమ బుద్ధుడు చెప్పారు. కోరికలు పెరుగుతున్న కొద్దీ మనసుకు అశాంతి పెరుగుతుంది. తక్కువ కోరికలతో జీవించడం మనసుకు తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది.

సద్వినియోగమే అసలైన సంపద

కడుపు నిండా భోజనం, కంటి నిండా నిద్ర, ఇల్లు, గౌరవప్రదమైన జీవితం ఉంటే మనం నిజంగా ధనవంతులమే. వీటికి తోడు ప్రశాంతత, ధర్మం ఉంటే జీవితం పరిపూర్ణమవుతుంది. ఇదే నిజమైన అదృష్టం. ఎవరికీ ఎప్పుడూ సుఖాలు ఉండవు, కష్టాలు కూడా తప్పవు. కానీ తక్కువ కోరికలతో సంతోషంగా, సమాజంలో గౌరవప్రదంగా జీవించడం గొప్ప అదృష్టం. డబ్బు తాత్కాలికం, కానీ విలువలు, తృప్తి శాశ్వతం. అందుకే ఉన్న దాంట్లో దానధర్మాలు చేస్తూ ఉండండి.

“మానవసేవే మాధవసేవ” అన్నారు పెద్ధలు. “తల్లి గర్భం నుంచి ధనం తీసుకెళ్లలేం. అన్నం మింగినట్టు బంగారం మింగలేం” అన్న శేషప్ప కవి మాటలు జీవిత సత్యం. నిజమైన ధనవంతుడు కోట్లు సంపాదించినవాడు కాదు, సంతృప్తిగా జీవించేవాడే.

డబ్బును సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో,దానం, విద్యా విస్తరణలో ఉపయోగిస్తే అది శాశ్వత ఫలితం ఇస్తుంది. పరిమితమైన సంపాదనతో సంతోషంగా జీవించడం నేర్చుకున్నవాడే నిజమైన ధనవంతుడు. డబ్బు సంపాదించడం ఒక వ్యక్తి జీవనంలో ముఖ్యమైన లక్ష్యం. కానీ మనసుకు సంతోషం, ఆరోగ్యం, కుటుంబ బంధాలు లేకుండా ఆ సంపాదన అర్థరహితం అవుతుంది. ఎంత డబ్బు సంపాదించినా, జీవితానికి విలువ ఇవ్వడం, ఇతరులకు ఉపయోగపడడం, మనస్సుకి ఆనందాన్నివ్వడం ఇవే కదా మనిషికి నిజమైన సంపద.

లోకానికి అందని విన్యాసం:

డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు. అంటే అంతిమంగా డబ్బుతోనే ఏదైనా సాధించగలం. జీవించగలం. కానీ, డబ్బు మైకం అనేక రకాలు. డబ్బు చుట్టూ మనిషి. మనిషి చుట్టూ డబ్బు. ఈరెండింటిలో ఏది సత్యం. ఏది నిత్యం. అనేదానికి ఇప్పటికీ సరియైన నిర్వచనాలు దొరకలేద. దొరకవు కూడా. డబ్బు అనేక అద్భుతాలకు కారణమవుతోంది. అనేక ఆవిష్కరణలకే ఆలంబనవుతోంది. అనేకమైన అనిశ్చితి అంశాలకు కారణమవుతోంది.

*చాలా సందర్భాల్లో డబ్బే సుఖం, డబ్బే అనందం, డబ్బే అసలైన జీవితపు సంచలనంగానూ చలామణి అవుతుంది. డబ్బే అనే విషయంలో ఎవరి దృష్టి వారిది, ఒక్కమాటలో చెప్పాలంటే డబ్బు విషయంలో ఎవరుకు వారే యమునా తీరే అన్నది మాత్రం నూరుపాళ్ళ సత్యం. అందుకే, మానవుని జేబులో డబ్బుకు సవాలక్ష ఆలోచనలుంటాయి. ఆ.. ఆలోచనలకు రూపాలు వెదకడం కష్టమే. డబ్బు విషయంలో మనసును స్వీయనియంత్రణలో పెట్టడమూ కష్టమే. అందుకే డబ్బు అంటే అనేక నిర్వచనాలు. లోకానికి అందని విన్యాసాలు.

జేబులో డబ్బు.. అనేక నిర్వచనాలు - Tholi Paluku