
జేడీ లక్ష్మీనారాయణ భార్యకు టోకరా.. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో రూ.2.58 కోట్ల మోసం
స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై అధిక లాభాల ఆశచూపి సైబర్ నేరగాళ్లు మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్యను భారీగా మోసగించారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో ఆమె నుంచి ఏకంగా రూ. 2.58 కోట్లు కొల్లగొట్టిన ఘటన నగరంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు జనవరి 6న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కుట్ర జరిగిందిలా..
బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది నవంబర్‌లో ఆమెకు ఒక ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్‌లో అనుకోకుండా ఆహ్వానం వచ్చింది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని ఆ సందేశంలో పేర్కొన్నారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పద్ధతులపై తనకు సరైన అవగాహన లేకపోవడంతో, ఆ యాప్ గ్రూప్‌లో తన తరఫున చేరాలని ఆమె తన భర్తను (మాజీ ఐపీఎస్ అధికారి) కోరింది. ఆయన నవంబర్ 29న ఆ గ్రూప్‌లో చేరారు.
నమ్మకం కలిగించిన 'దినేష్ సింగ్'
తర్వాత ‘దినేష్ సింగ్’గా పరిచయం చేసుకున్న వ్యక్తి గ్రూప్‌లో తరచూ క్లాసులు, చర్చలు నిర్వహించడం ప్రారంభించాడు. అతడు పంపిన సందేశాలు చాలా విశ్లేషణాత్మకంగా, పండితుల స్థాయిలో ఉండటంతో గ్రూప్ సభ్యులందరికీ, ముఖ్యంగా బాధితురాలికి అతనిపై పూర్తి నమ్మకం ఏర్పడింది. తాము సెబీ నమోదు పొందిన భారతీయ సంస్థ ద్వారా ట్రేడింగ్ చేయిస్తున్నామని, ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల ప్రతులను కూడా గ్రూప్‌లో పోస్టు చేశారు.
ఆ సూచనల మేరకు ఆమె భర్త సహాయంతో అతని పేరుతో ఒక ట్రేడింగ్ ఖాతాను తెరిచింది. అనంతరం దినేష్ సింగ్ చెప్పిన మాటలను నమ్మి, నిరంతర ప్రోత్సాహంతో భారీ మొత్తాలను పెట్టుబడిగా జమ చేసింది. ఈ పెట్టుబడుల కోసం ఆమె తన పేరుతోనే కాకుండా భర్త పేరుతో కూడా బంగారు రుణాలు (గోల్డ్ లోన్లు) తీసుకొని డబ్బు జమ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఐపీఓలో పాల్గొనాలంటూ పెద్ద మొత్తాలు వేయించారని ఆమె తెలిపింది.
అనుమానం వచ్చినా..
ఈ సమయంలో ఆమె భర్త, రోజుకు మారుతూ వస్తున్న వివిధ బ్యాంకుల కరెంట్ అకౌంట్ నంబర్లపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెను హెచ్చరించాడు. వెస్ట్ బెంగాల్, అస్సాం, భువనేశ్వర్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లోని బ్యాంకు ఖాతాలకు డబ్బులు పంపమని చెప్పడం చట్టబద్ధమైన బ్రోకరేజ్ విధానాలకు విరుద్ధంగా ఉందని ఆయన సూచించారు. అయినప్పటికీ మొదట ఆమె ఆ హెచ్చరికలను పట్టించుకోలేదని తెలిపింది.
తర్వాత ఇంటర్నెట్‌లో స్వయంగా పరిశీలన చేయగా, దేశవ్యాప్తంగా ఇలాంటి పెట్టుబడి మోసాలపై వార్తలు కనిపించడంతో ఆమెకు అనుమానం కలిగింది. అయినా కూడా గ్రూప్ నిర్వాహకులు మరిన్ని ఐపీఓల పేరిట ఇంకా డబ్బులు జమ చేయాలని ఒత్తిడి కొనసాగించారు. జనవరి 5న ఆమె రూ.10 లక్షలు ఉపసంహరించగా, ఆ మొత్తం ఆరు చిన్న లావాదేవీలుగా జమ కావడం ఆమె అనుమానాలను మరింత పెంచింది.
మోసగాళ్లకు అనుమానం రాకుండా, డబ్బు పూర్తిగా ఉపసంహరించుకునే అవకాశం దక్కాలని భావించి, పోలీసుల జోక్యం వచ్చే వరకు జాగ్రత్త చర్యగా కొంతకాలం ప్లాట్‌ఫామ్‌లో పరిమిత కార్యకలాపాలు కొనసాగించినట్టు ఆమె తెలిపింది. పలువురు బ్యాంకు ఖాతాలను ఉపయోగించి, ఒక పేరుగాంచిన సంస్థగా నటిస్తూ ఈ మోసగాళ్లు ముందే రూపొందించిన పథకం ప్రకారం నన్ను రూ.2.58 కోట్ల మేరకు మోసం చేశారు అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసుల దర్యాప్తు
పథకం ప్రకారం తప్పుడు గుర్తింపులతో తనను రూ. 2.58 కోట్లు మోసం చేశారని ఆమె జనవరి 6న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
