Let's talk: editor@tmv.in
జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా నితీశ్‌కుమార్

జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా నితీశ్‌కుమార్

Pinjari Chand
25 మార్చి, 2026

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ జాతీయ జనతాదళ్ (యునైటెడ్) — జేడీయూ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి మరెవ్వరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయనను ప్రత్యర్థుల్లేకుండా ఎన్నుకున్నారు. పార్టీ ఎన్నికల ప్రక్రియ వివరాలను జేడీయూ నేత అనిల్‌ హగ్డే న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో వెల్లడించారు. మార్చి 22 నామినేషన్ల దాఖలు చివరి తేదీ కాగా, 23న పరిశీలన పూర్తయిందని చెప్పారు. ఉపసంహరణకు చివరి గడువు మార్చి 24 ఉదయం 11 గంటల వరకు ఉండిందని తెలిపారు. ప్రస్తుతం అధ్యక్షుడైన నితీశ్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో, ఆయనను జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నానని హెగ్డే పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్‌ ఝా నితీశ్ నాయకత్వాన్ని ప్రశంసించారు. 1994లో సమతా పార్టీ స్థాపనతో ప్రారంభమైన పార్టీ ప్రయాణం నితీశ్ కృషి, నిబద్ధతతో ముందుకు సాగిందని తెలిపారు. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు విడిపోకముందు ప్రారంభమైన ఈ ప్రయాణం 32 సంవత్సరాలకు చేరిందని, ఇది పార్టీ చరిత్రలో ముఖ్య ఘట్టమని అన్నారు. ఎన్డీయే కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నితీశ్ కుమార్ నాయకత్వంలో బీహార్ అభివృద్ధి దిశగా పెద్ద మార్పు చోటుచేసుకుందని, గత 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. బీహార్ గౌరవాన్ని, గుర్తింపును తిరిగి తీసుకువచ్చిన నాయకుడు నితీశ్ కుమార్ అని ప్రశంసించారు.

ఇదిలా ఉండగా, నితీశ్ కుమార్ ఇప్పటికే 2023 డిసెంబర్‌లో లలన్‌ సింగ్‌ రాజీనామా చేసిన తర్వాత జేడీయూ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 75 సంవత్సరాలు కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించిన అనీల్‌ ప్రసాద్‌ హెగ్డే ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించి, ఎన్నిక సర్టిఫికెట్‌ను సంజయ్ కుమార్ ఝా, కేంద్ర మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌కు అందజేశారు. అయితే నితీశ్ కుమార్ ఎన్నిక ప్రకటన సమయంలో కార్యక్రమానికి హాజరు కాలేదు. ప్రస్తుతం ఆయన ‘సమృద్ధి యాత్ర’లో పాల్గొంటుండటంతో, ఆయన తరఫున పార్టీ నేతలు సర్టిఫికెట్ అందుకున్నారు. నితీశ్ కుమార్ ఢిల్లీకి రాకుండానే తన నామినేషన్ దాఖలు చేయగా, ఆయన నామినేషన్‌కు ప్రతిపాదకుల్లో సంజయ్ కుమార్ ఝా ఒకరుగా ఉన్నారు.