Let's talk: editor@tmv.in
జేడీయూలో చేరిన నిశాంత్ కుమార్

జేడీయూలో చేరిన నిశాంత్ కుమార్

Pinjari Chand
9 మార్చి, 2026

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌‌ కుమారుడు నిశాంత్‌కుమార్ ఆదివారం జనతాదళ్ (యునైటెడ్) పార్టీలో అధికారికంగా చేరారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు కీలక నేతల సమక్షంలో ఆయనకు పార్టీ సభ్యత్వం కల్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్‌రంజన్‌ సింగ్‌ (‘లలన్ సింగ్’గా ప్రసిద్ధి)తో పాటు జేడీయూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్‌ఝా పాల్గొన్నారు. పార్టీలో చేరిన అనంతరం నిషాంత్ మాట్లాడుతూ, తన తండ్రి నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాలను గౌరవిస్తామని చెప్పారు. నా తండ్రి రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఆయన మార్గదర్శకత్వంలోనే మేమంతా పనిచేస్తాం. నేను పార్టీ సంస్థాగత బలాన్ని పెంచడానికి కృషి చేస్తానని అన్నారు.

ఇంజినీరింగ్ పట్టభద్రుడైన నిషాంత్ ప్రస్తుతం నలభై ఏళ్ల వయస్సులో ఉన్నారు. గత ఇరవై సంవత్సరాల్లో బీహార్ అభివృద్ధికి తన తండ్రి ఎంతో కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి నితీశ్ కుమార్ చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పారు. పార్టీ కార్యాలయానికి నిషాంత్ చేరుకున్నప్పుడు జేడీయూ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ జెండాలు ఊపుతూ, డప్పులు కొడుతూ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం తెలిపారు. ఇదిలా ఉండగా, కొత్త ప్రభుత్వ ఏర్పాటులో నిశాంత్ కుమార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే వచ్చే నెలలో ఆయనను రాష్ట్ర శాసన మండలికి కూడా ఎన్నిక చేసే అవకాశం ఉందని జేడీయూ ఎమ్మెల్యే హరినారయణ్​ సింగ్‌ పేర్కొన్నారు.

నేతల శుభాకాంక్షలు

ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి, ఎన్డీయే రాజ్యసభ అభ్యర్థి రాంనాథ్‌ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రజలతో అనుసంధానం కొనసాగించేందుకు నిశాంత్ కుమార్ జేడీయూలో చేరారని చెప్పారు. బీహార్ మంత్రి రత్నేష్ సదా నిశాంత్ కుమార్‌ను బీహార్ భవిష్యత్‌గా అభివర్ణించారు. అలాగే కాంగ్రెస్ నేత అఖిలేశ్ ప్రసాద్ సింగ్‌ కూడా నిశాంత్‌ రాజకీయ ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల నిశాంత్ కుమార్ జేడీయూ సీనియర్ నేతలు, యువ ఎమ్మెల్యేలతో సమావేశమై పార్టీ భవిష్యత్ వ్యూహంపై చర్చించారు. ఇదే సమయంలో నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లేందుకు నామినేషన్ దాఖలు చేయడంతో బీహార్ రాజకీయాల్లో కీలక మార్పులకు ఇది నాంది అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.