Let's talk: editor@tmv.in
జేజెఎం 2.0తో 2028 నాటికి ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీరు: సీఎం చంద్రబాబు

జేజెఎం 2.0తో 2028 నాటికి ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీరు: సీఎం చంద్రబాబు

Panthagani Anusha
25 మార్చి, 2026

రాష్ట్రంలోని ప్రతి పల్లెకు, ప్రతి గృహానికి స్వచ్ఛమైన తాగునీటిని నిరంతరాయంగా అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 'హర్ ఘర్ జల్' లక్ష్య సాధనలో భాగంగా 'జల్ జీవన్ మిషన్ (జేజెఎం) 2.0' అమలుపై మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో ఉన్నతాధికారులు సంతకాలు చేయగా అమరావతి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్‌గా పాల్గొన్నారు.

నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థల నిర్వహణపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని . 2025 సెప్టెంబర్‌లోనే దీనిపై ఒక సమగ్ర విధానాన్ని ప్రకటించాం. నీటి సరఫరా బాధ్యతలను పంచాయతీలకు అప్పగించి వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం అని పేర్కొన్నారు.కాగా జేజేఎం గడువును 2028 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది తమ సంకల్పమని దీనికి కేంద్రం పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.

డ్వాక్రా మహిళల భాగస్వామ్యం

మరోవైపు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇప్పటికే 16 కోట్ల ఇళ్లకు కుళాయిలు అందించామని మిగిలిన 3 కోట్ల ఇళ్లకు జేజేఎం 2.0 ద్వారా నీరందిస్తామని పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో నీటి నాణ్యతను పరీక్షించే బాధ్యతలో డ్వాక్రా మహిళలను భాగస్వాములను చేయాలని ఆయన సూచించారు. "9 కోట్ల మంది మహిళలకు నీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే కష్టాలు త్వరలో తప్పుతాయి. 2047 నాటికి 'వికసిత్ భారత్' సాధించాలంటే ప్రతి ఇంటికీ సురక్షిత జలం చేరడం అనివార్యం అని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఏపీలోని జిల్లా కలెక్టర్లతో వర్చువల్ సమావేశం నిర్వహించి ప్రాజెక్టు లక్ష్యాలను దిశానిర్దేశం చేస్తామన్నారు.

ఢిల్లీలోని జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి అశోక్ కుమార్ మీనా, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పీఎం జన్ మన్, పీఎం జన్ భాగీదారీ మిషన్ల నిధులను కూడా మారుమూల ప్రాంతాల్లో నీటి సరఫరాకు వినియోగించుకోవాలని కేంద్రం సూచించింది. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో తాగునీటి మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కానుంది.