
జేఎన్‌యూ క్యాంపస్‌లో ఉద్రిక్తత: 14 మంది అరెస్టు
దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) లో గురువారం సాయంత్రం జరిగిన విద్యార్థుల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి 14 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టైన వారిలో జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అదితి మిశ్రా, ఉపాధ్యక్షురాలు గోపికా బాబు, మాజీ అధ్యక్షుడు నితీష్ కుమార్, సంయుక్త కార్యదర్శి దానిష్ అలీ తదితరులు ఉన్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 132/3(5) (దాడి లేదా నేరబల ప్రయోగం), 221 (ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడం), 121(1) (స్వచ్ఛందంగా గాయపరచడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జేఎన్‌యూ క్యాంపస్‌లోని సబర్మతి టీ-పాయింట్ వద్ద కూడిన జేఎన్‌యూఎస్‌యూ సభ్యులు విద్యా మంత్రిత్వ శాఖ వైపు మార్చ్ చేపట్టేందుకు ప్రయత్నించగా, విశ్వవిద్యాలయ గేట్ల వద్ద భారీగా ఏర్పాటు చేసిన బ్యారికేడ్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య తోపులాట చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ నిరసనకు కారణంగా, జేఎన్‌యూ ఉపకులపతి సంతిశ్రీ ధూలిపుడి పండిట్ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు, యూజీసీ నిబంధనల అమలు, జేఎన్‌యూఎస్‌యూ కార్యవర్గ సభ్యుల రస్టికేషన్, అలాగే ప్రతిపాదిత ‘రోహిత్ చట్టం’పై విద్యార్థుల్లో అసంతృప్తి ఉన్నట్లు విద్యార్థి నేతలు చెబుతున్నారు. విద్యా విధానాల అమలు తీరుపై స్పష్టత కోరుతూ, విద్యార్థులపై తీసుకుంటున్న క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
గురువారం సాయంత్రం మొత్తం 51 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో విద్యార్థులు భౌతిక దాడులకు పాల్పడి పోలీసు సిబ్బందిలో పలువురికి గాయాలు కలిగించారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, జేఎన్‌యూఎస్‌యూ ఒక ప్రకటన విడుదల చేసి, పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించింది. ముగ్గురు కార్యవర్గ సభ్యులు సహా 13 మంది విద్యార్థులను నిర్బంధించారని, పలువురిని “క్రూరంగా దాడి చేసి గాయపరిచారని” ఆరోపించింది. అలాగే, పోలీసు చర్యలో డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి నష్టం వాటిల్లిందని పేర్కొంటూ, ఇది తీవ్ర ఆవేదనకు గురి చేసిందని తెలిపింది.
విద్యార్థుల సంఘం తమ డిమాండ్లలో భాగంగా అరెస్టైన వారందరినీ తక్షణం, నిబంధనలేమి లేకుండా విడుదల చేయాలని, ఉపకులపతి రాజీనామా చేయాలని, అంబేద్కర్ చిత్రపటానికి జరిగిన అవమానంపై బాధ్యులైన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేకాదు, విద్యార్థి కార్యకర్తలపై విధించిన ప్రాక్టోరియల్ చర్యలు ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ సంపూర్ణ విశ్వవిద్యాలయ బంద్‌కు పిలుపునిచ్చింది.
ఈ ఘటనపై అధ్యాపక వర్గం నుంచి కూడా స్పందన వచ్చింది. జేఎన్‌యూ టీచర్ అసోసియేషన్ పోలీసుల జోక్యాన్ని ఖండిస్తూ, క్యాంపస్‌లో శాంతియుత వాతావరణం నెలకొనేలా అన్ని పక్షాలు సంయమనం పాటించాలని కోరింది. జేఎన్‌యూ పరిణామాలు దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు, విద్యా విధానాలపై జరుగుతున్న చర్చలకు మరోసారి కేంద్రబిందువుగా మారాయి.
కాగా, ‘రోహిత్ చట్టం’ అనేది విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో విద్యార్థులపై జరిగే వివక్ష, వేధింపులు, అన్యాయ క్రమశిక్షణ చర్యలును అడ్డుకోవడానికి ప్రతిపాదిత చట్టం. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధన విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన తరువాత దేశవ్యాప్తంగా వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ఈ చట్ట ఆలోచన ముందుకు వచ్చింది. ఈ చట్టం అమలైతే, విద్యార్థులపై సస్పెన్షన్ లేదా రస్టికేషన్ వంటి చర్యలకు స్పష్టమైన నిబంధనలు ఉండటం, ఫిర్యాదుల కోసం స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేయడం, అలాగే విశ్వవిద్యాలయ పరిపాలనపై జవాబుదారీతనం పెరగడం ద్వారా విద్యార్థుల హక్కులకు చట్టపరమైన రక్షణ లభిస్తుందని భావిస్తున్నారు.
