Let's talk: editor@tmv.in
జేఎన్‌యూలో ప్రధాని మోడీ, హోం మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు

జేఎన్‌యూలో ప్రధాని మోడీ, హోం మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు

Shaik Mohammad Shaffee
7 జనవరి, 2026

దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా చేసిన నినాదాలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనను యూనివర్సిటీ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి నినాదాలు చేసిన విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అసలు ఏం జరిగింది?

యూనివర్సిటీ వర్గాల సమాచారం ప్రకారం, సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో “ఎ నైట్ ఆఫ్ రెసిస్టెన్స్ విత్ గెరిల్లా ధాబా” అనే కార్యక్రమం క్యాంపస్‌లో జరిగింది. ఈ కార్యక్రమాన్ని జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ తో సంబంధం ఉన్న విద్యార్థులు నిర్వహించారు. మొదట ఈ సమావేశం 2020 జనవరి 5న జేఎన్‌యూ క్యాంపస్‌లో జరిగిన హింసాత్మక ఘటనను గుర్తు చేసుకునేందుకే నిర్వహించినట్లు కనిపించిందని యాజమాన్యం పేర్కొంది. ఆ సమయంలో అక్కడ సుమారు 30 నుంచి 35 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని తెలిపింది.

అయితే, ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత పరిస్థితి మారిందని యూనివర్సిటీ ఆరోపిస్తోంది. ఆ తర్వాత కొందరు విద్యార్థులు అత్యంత అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే, ఉద్రిక్తత పెంచే నినాదాలు చేశారని యాజమాన్యం పేర్కొంది.కొందరు విద్యార్థులు ప్రధాని మోడీ, అమిత్ షాలను ఉద్దేశించి "మోదీ-షా కబర్ ఖుదేగి" (మోదీ, షాల సమాధులు తవ్వుతాం) అంటూ తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. ఈ నినాదాలు సుప్రీంకోర్టును అవమానించేలా ఉన్నాయని, జేఎన్‌యూ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాయని స్పష్టం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

యాజమాన్యం కఠిన నిర్ణయం

ఈ ఘటనను జేఎన్‌యూ పరిపాలన విభాగం చాలా తీవ్రంగా పరిగణించింది. ఢిల్లీలోని వసంత్ కుంజ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, వివాదాస్పద నినాదాలు చేసిన విద్యార్థులపై 'భారతీయ న్యాయ సంహిత' చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని లేఖ రాసింది. ఈ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అదితి మిశ్రాతో పాటు మరికొందరు విద్యార్థులను ప్రాథమికంగా గుర్తించినట్లు వర్సిటీ తెలిపింది. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ నినాదాలు క్యాంపస్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ స్పందిస్తూ, రాజ్యాంగబద్ధమైన సంస్థలను, అత్యున్నత న్యాయస్థానాన్ని అవమానించడం తగదని హెచ్చరించారు. నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ, అది ద్వేషపూరిత మాటలుగా మారకూడదని విద్యార్థులకు సూచించారు. క్యాంపస్‌లో శాంతిని కాపాడేందుకు ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశామని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత విద్యార్థులపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని యాజమాన్యం స్పష్టం చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని వెల్లడించింది.

రాజకీయ దుమారం

ఈ నినాదాల వ్యవహారం రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ జేఎన్‌యూలో జరిగిన నినాదాలను తీవ్రంగా ఖండించారు. కొందరు దేశాన్ని విభజించాలనుకునే వారి అడ్డాగా క్యాంపస్‌ను మార్చారని ఆరోపించారు. సుప్రీంకోర్టును కూడా గౌరవించని వారు ఇలాంటి నినాదాలు చేస్తున్నారని విమర్శించారు. దేశ వ్యతిరేక భావాలు కలిగిన వారిని సహించబోమని ఆయన వ్యాఖ్యానించారు.

బీహార్ అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ కుమార్ ఈ ఘటనను దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తూ, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఉగ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించే వారికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ నేత దిలీప్ జైస్వాల్ కూడా ఇలాంటి నినాదాలు చేసిన వారికి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.

విద్యార్థి సంఘం వాదన

అయితే, విద్యార్థి సంఘం నేతలు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తాము ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని, కేవలం సిద్ధాంతపరమైన నిరసన మాత్రమే తెలిపానని అదితి మిశ్రా పేర్కొన్నారు. ప్రతి ఏడాది లాగే 2020 నాటి దాడులకు వ్యతిరేకగానే ఈ నిరసన జరిగిందని ఆమె సమర్థించుకున్నారు.

జేఎన్‌యూలో ప్రధాని మోడీ, హోం మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు - Tholi Paluku