Let's talk: editor@tmv.in
జేఎన్‌యూలో నినాదాలు దురదృష్టకరం : కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్

జేఎన్‌యూలో నినాదాలు దురదృష్టకరం : కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్

Pinjari Chand
8 జనవరి, 2026

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై నినాదాలు చేయడంపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ స్పందించారు. బుధవారం ఈ ఘటనను ఆయన దురదృష్టకరమే అయినప్పటికీ ఈ సంఘటన కొత్తది కాదంటూ వ్యాఖ్యానించారు. జేఎన్‌యూకు గతంలోనూ దేశ విరోధి నినాదాల చరిత్ర ఉందని షేకావత్ గుర్తు చేశారు. ఇది దురదృష్టకరం, కానీ ఆశ్చర్యకరం కాదు. ఇక్కడ గతంలో దేశవిరోధి నినాదాలు వినిపించాయి. కసబ్ మరణశిక్షను కూడా వ్యతిరేకించారు. వారి మనస్తత్వం ప్రజలకు తెలిసిందే. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే కర్ణాటకలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీ నుంచి ఇలాంటి వారికి మద్దతు లభిస్తోందని తెలిపారు. జేఎన్‌యూ ఘటనపై ఢిల్లీ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా కూడా స్పందించారు. ప్రధాని, హోంమంత్రి వంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులపై నినాదాలు చేయడం తీవ్రంగా ఖండనీయమని ఆయన అన్నారు. ఈ ఘటనపై తప్పనిసరిగా కేసు నమోదు చేయాలి. ఇది ‘తుగ్లక్’ మనస్తత్వానికి నిదర్శనం. ఇలాంటి ఆలోచనలు దేశంలో కొనసాగనీయకూడదు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై నినాదాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిర్సా మీడియాతో చెప్పారు.

ఈ ఘటనపై జేఎన్‌యూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఫిర్యాదును పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి పై నినాదాల ఘటనకు సంబంధించి జేఎన్‌యూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి ఫిర్యాదు అందింది. తదుపరి అవసరమైన చర్యలపై విచారణ చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ముందుగా సోమవారం రాత్రి సబర్మతి హాస్టల్ వెలుపల అభ్యంతరకర, రెచ్చగొట్టే, ఉద్రిక్తత కలిగించే నినాదాలు చేసిన విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని జేఎన్‌యూ యాజమాన్యం పోలీసులను కోరిన విషయం తెలిసిందే.