Let's talk: editor@tmv.in
జేఈఈ అభ్యర్థులకు ఎన్‌టీఏ అలర్ట్

జేఈఈ అభ్యర్థులకు ఎన్‌టీఏ అలర్ట్

Shaik Mohammad Shaffee
1 అక్టోబర్, 2025

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2026కి సిద్ధమవుతున్న విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలక సూచన చేసింది. జేఈఈ మెయిన్ సెషన్ 1 దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ నెలలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థులు తమ ఆధార్ కార్డ్, కేటగిరీ సర్టిఫికెట్లు (ఈడబ్యూఎస్, ఓబీసీ నాన్ క్రిమి లేయర్, ఎస్సీ, ఎస్టీ) వంటి ముఖ్యమైన పత్రాలను ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ముందే అప్‌డేట్ చేసి, లోపాలు లేకుండా చూసుకోవాలని సలహా ఇచ్చింది. ఈ సర్టిఫికెట్లలో చిన్నపాటి తేడాలు ఉన్నా, అది దరఖాస్తు తిరస్కరణకు లేదా అడ్మిషన్ ప్రక్రియలో సమస్యలకు దారితీయొచ్చని ఎన్‌టీఏ హెచ్చరించింది.

ఏయే పత్రాలు సరిచూసుకోవాలి?

ఆధార్ కార్డు: పుట్టిన తేదీ, పేరు వంటి వివరాలు 10వ తరగతి సర్టిఫికెట్‌ ప్రకారం సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఆధార్‌పై ఉన్న ఫోటోగ్రాఫ్, చిరునామా, తండ్రి పేరు వంటి వివరాలు కూడా ప్రస్తుతానికి అనుగుణంగా అప్‌డేట్‌ అయి ఉండాలి.

కేటగిరీ సర్టిఫికెట్లు: రిజర్వేషన్ కోటా కింద దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తమ కేటగిరీ సర్టిఫికెట్లను చెల్లుబాటులో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఓబీసీ నాన్ క్రిమి లేయర్, ఈడబ్యూఎస్ అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా జారీ చేయబడ్డాయో లేదో నిర్ధారించుకోవాలి.

యూడీఐడీ కార్డ్: దివ్యాంగుల (పీడబ్యూడీ) కేటగిరీ అభ్యర్థులు తమ యూనిక్ డిసేబిలిటీ ఐడీ (యూడీఐడీ) కార్డ్ చెల్లుబాటు అవుతుందో లేదో చూసుకోవాలి. గడువు ముగిసినట్లయితే, దరఖాస్తుకు ముందే రెన్యూవల్ చేసుకోవడం తప్పనిసరి.

ఎన్‌టీఏ ప్రకారం, దరఖాస్తుల్లో తప్పుల వల్ల గతంలో అనేక ఫిర్యాదులు, సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా పేరు/పుట్టిన తేదీలో తేడాలు ఉంటే ఆన్‌లైన్ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యలను నివారించడానికి, దరఖాస్తుకు ముందే సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవడం ద్వారా విద్యార్థులు చివరి నిమిషంలో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

జేఈఈ మెయిన్ 2026 ద్వారా దేశంలోని ప్రతిష్ఠాత్మక ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి విద్యా సంస్థల్లో ప్రవేశాలు లభిస్తాయి. అలాగే ఐఐటీల్లో ప్రవేశానికి అవసరమైన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత పొందాలంటే, జేఈఈ మెయిన్‌లో మంచి ర్యాంకు సాధించడం తప్పనిసరి. జేఈఈ మెయిన్‌కు దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేస్తుంటారు. వారిలో ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 2.50 లక్షల మంది ఉంటారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లు nta.ac.in, jeemain.nta.nic.inలను సందర్శించండి.

జేఈఈ అభ్యర్థులకు ఎన్‌టీఏ అలర్ట్ - Tholi Paluku