
జెలెన్స్కీపై ట్రంప్ అసహనం.. శాంతి ప్రతిపాదన ఇంకా చదవలేదంటూ వ్యాఖ్య
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా మధ్యవర్తిత్వంలో జరుగుతున్న శాంతి చర్చలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల తాము పంపిన శాంతి ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ ఇంకా చదవకపోవడం తనకు నిరాశ కలిగించిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఆదివారం వాషింగ్టన్ డీసీలోని కెన్నెడీ సెంటర్ వద్ద విలేకరులతో మాట్లాడిన ట్రంప్, "జెలెన్‌స్కీ ఆ ప్రతిపాదనను ఇంకా చదవకపోవడం నాకు కొంచెం నిరాశ కలిగించింది. కొన్ని గంటల క్రితమే ఉక్రెయిన్ ప్రజలు ఆ ప్రతిపాదనను ఇష్టపడ్డారు. ఈ ప్రణాళికతో రష్యా బాగానే ఉందని నేను నమ్ముతున్నా. కానీ జెలెన్‌స్కీ మాత్రం ఆ ప్రణాళికపై సంతృప్తిగా ఉన్నారా లేదా అనే విషయం నాకు కచ్చితంగా తెలియదు. ఉక్రెయిన్ ప్రజలు దానిని ఇష్టపడతారు, కానీ ఆయన (జెలెన్‌స్కీ) మాత్రం సిద్ధంగా లేరు" అని స్పష్టం చేశారు. కీవ్ వైపు నుంచి సరైన స్పందన రాకపోవడాన్ని ట్రంప్ ఈ విధంగా నిరసించారు.
చర్చల నుంచి వైదొలిగే అవకాశం: ట్రంప్ జూనియర్
ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ చేసిన సంచలన వ్యాఖ్యలు శాంతి ఒప్పందం భవిష్యత్తుపై సందేహాలు పెంచాయి. దోహా ఫోరమ్‌లో ఆయన మాట్లాడుతూ, ఉక్రెయిన్ సీనియర్ అధికారుల అవినీతి ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో, తన తండ్రి శాంతి చర్చల నుంచి పూర్తిగా వైదొలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
"ఉక్రెయిన్ దేశం రష్యా కంటే చాలా ఎక్కువ అవినీతిమయం" అని ట్రంప్ జూనియర్ ఆరోపించారు. అంతేకాక, జెలెన్‌స్కీని ఆయన "గొప్ప మార్కెటర్"గా అభివర్ణించారు. అధ్యక్షుడు ట్రంప్ చర్చల నుంచి వైదొలగుతారా అని ప్రశ్నించగా, "అది కూడా జరగొచ్చు" అని ట్రంప్ జూనియర్ సమాధానమిచ్చారు.
చర్చలపై ఉక్రెయిన్ స్పందన
కీవ్-వాషింగ్టన్ ప్రతినిధుల మధ్య ఇటీవల మూడు రోజుల పాటు మియామిలో చర్చలు జరిగాయి. ఈ చర్చలపై జెలెన్‌స్కీ స్పందిస్తూ, అమెరికాతో శాంతి చర్చలు నిర్మాణాత్మకంగా ఉన్నాయని, కానీ అవి సులభం కాదని ప్రకటించారు. ట్రంప్ తరఫున చర్చల ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్‌తో ఫోన్‌లో మాట్లాడిన తరువాత "అమెరికాకు ప్రాథమిక ఉక్రెయిన్ పరిధులు తెలుసు" అని చెబుతూనే, ఈ శాంతి ఒప్పందం ముందుకు పోయే అవకాశం లేదని పరోక్షంగా తేల్చి చెప్పారు. మయామి చర్చలు బాగానే జరిగినప్పటికీ, భద్రతా హామీలు, ప్రాదేశిక అంశాలపై ఎటువంటి నిర్దిష్ట పురోగతి లేదని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్ చాలా కాలంగా అవినీతి సమస్యలు ఎదుర్కొంటోంది. శాంతి చర్చల్లో కీలకంగా ఉన్న జెలెన్‌స్కీ ముఖ్య సహాయకుడు ఆండ్రీ యెర్మాక్ ఇంటిపై నవంబర్‌లో అవినీతి నిరోధక సంస్థలు దాడులు చేయడంతో ఆయన రాజీనామా చేశారు. ఈ పరిణామం అవినీతి సమస్య తీవ్రతను మరోసారి హైలైట్ చేసింది.
అమెరికా ప్రతిపాదనను స్వాగతించిన రష్యా
భద్రతకు సంబంధించి అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా స్వాగతించింది. ఇది తమకు అన్ని విధాలా ఆమోదయోగ్యంగా ఉందని క్రెమ్లిన్ పేర్కొంది. ట్రంప్ కొత్త వ్యూహంతో రష్యాతో వ్యూహాత్మక స్థిరత్వాన్ని పునఃస్థాపించాలని యూఎస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రత్యేక రాయబారి మాట్లాడుతూ, “యుద్ధాన్ని ముగించే ఒప్పందం చాలా దగ్గరగా ఉంది, కానీ డాన్‌బాస్ ప్రాంతం భవితవ్యం, జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్ నియంత్రణ వంటి రెండు ప్రధాన సమస్యల పరిష్కారంపైనే ఆ ఒప్పందం ఆధారపడి ఉంది” అని అన్నారు.
ట్రంప్ శాంతి ఒప్పందంలో ఏముంది?
ట్రంప్ ప్రభుత్వం ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపడానికి రూపొందించిన 28-పాయింట్ల శాంతి ప్రతిపాదన ఒక వివాదాస్పద ముసాయిదా (డ్రాఫ్ట్). ఇది అమెరికా, రష్యా అధికారుల మధ్య రూపొందింది, కానీ ఉక్రెయిన్ అంగీకరించలేదు. ఈ ప్లాన్ ఉక్రెయిన్‌కు భారీ భూభాగ నష్టాలు (క్రిమియా, డొనెట్స్క్, లుహాన్స్క్ రష్యాకు ఇవ్వడం, ఇతర ప్రాంతాలను ప్రస్తుత యుద్ధ రేఖల వద్ద ఫ్రీజ్ చేయడం), సైనిక పరిమితులను (నాటో సభ్యత్వం రద్దు, సైన్యాన్ని తగ్గించడం) విధిస్తుంది. దీనికి ప్రతిగా, రష్యాపై ఉన్న ఆర్థిక ఆంక్షలు తొలగించి, జీ8లోకి తిరిగి చేర్చడానికి, రష్యా ఆస్తులను ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి ఉపయోగించడానికి ప్రతిపాదిస్తుంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దీనిని "చర్చల ప్రారంభ దశ"గా చూసినా, భూభాగాలను వదులుకోవడం సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని, అమెరికా హామీలు బలహీనంగా, షరతులతో ఉన్నాయని తిరస్కరిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు, ఎందుకంటే ఇది వారి భద్రతా డిమాండ్లలో 70 వరకు వరకు తీరుస్తుంది. ఉక్రెయిన్ ఈ శాంతి ప్రతిపాదనను అంగీకరించకపోతే ట్రంప్ ప్రభుత్వం సైనిక, ఆర్థిక మద్దతును పూర్తిగా నిలిపివేస్తామని ఒత్తిడి చేస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఒప్పందం యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపినా, బలమైన హామీలు లేకపోవడం వలన భవిష్యత్తులో ఉద్రిక్తతలు వచ్చే అవకాశం ఉంది.
