జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసులో 30 లక్షల పేజీల దర్యాప్తు పత్రాలను విడుదల చేసిన అమెరికా
మిలియనీర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక వేధింపుల దర్యాప్తుకు సంబంధించిన సుమారు 30 లక్షల పేజీల డాక్యుమెంట్లను అమెరికా న్యాయ శాఖ తాజాగా విడుదల చేసింది. 'ఎప్‌స్టీన్ ఫైల్స్ ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్' అనే కొత్త చట్టం ప్రకారం ఈ వివరాలను వెల్లడించారు. ఎప్‌స్టీన్‌కు సమాజంలోని అత్యంత ధనవంతులు, శక్తివంతులతో ఉన్న సంబంధాల గురించి ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని బహిర్గతం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నారు.
ప్రముఖుల పేర్లు, గోప్యత
గతంలో వెల్లడైన రికార్డులలో మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్ వంటి వారి పేర్లు, ఫోటోలు ఉన్నప్పటికీ, వారిపై ఎలాంటి నేరారోపణలు రుజువు కాలేదు. ప్రస్తుతం విడుదల చేస్తున్న 52 లక్షల పేజీల భారీ సమాచారాన్ని వందలాది మంది న్యాయవాదులు సమీక్షిస్తున్నారు. బాధితుల గుర్తింపు బయటకు రాకుండా ఉండటానికి వారి పేర్లు, వ్యక్తిగత వివరాలను డాక్యుమెంట్లలో 'బ్లాక్' చేసిన తర్వాతే వెబ్‌సైట్‌లో ఉంచుతున్నారు.
ఎప్‌స్టీన్ నేర చరిత్ర, మరణం
జెఫ్రీ ఎప్‌స్టీన్ ఒకప్పుడు ప్రముఖ ఫైనాన్షియర్‌గా ఉంటూనే, తెర వెనుక మైనర్ బాలికలను వేధించే భారీ నెట్‌వర్క్‌ను నడిపాడు. 2008లో ఫ్లోరిడాలో ఒకసారి జైలు శిక్ష అనుభవించిన అతను, 2019లో భారీ సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలపై మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. అయితే విచారణ ముగియకముందే 2019 ఆగస్టులో న్యూయార్క్ జైలులో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణం తర్వాత కూడా ఈ కేసులో కీలక నిందితురాలు గిస్లేన్ మాక్స్‌వెల్‌కు 20 ఏళ్ల శిక్ష పడింది.
బాధితుల పోరాటం
ఎప్‌స్టీన్ బాధితుల్లో ఒకరైన వర్జీనియా గియుఫ్రే చేసిన పోరాటం వల్ల బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ తన రాజరిక బిరుదులను కోల్పోవాల్సి వచ్చింది. శక్తివంతులైన వ్యక్తుల గుట్టు బయటపెట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అయితే, గత ఏడాది ఆమె ఆస్ట్రేలియాలో ఆత్మహత్య చేసుకోవడం ఈ కేసులో ఒక విషాదకర మలుపు. ఇప్పుడు విడుదలవుతున్న ఈ కొత్త ఫైళ్లు ఎప్‌స్టీన్ అరాచకాల వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తాయని బాధితులు ఆశిస్తున్నారు.
ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేస్తున్న రికార్డుల ద్వారా, ఎప్‌స్టీన్ ఇంకా ఎవరెవరితో సంబంధాలు పెట్టుకున్నాడు. అతని నేరాల గురించి అధికారులకు ముందే తెలిసినా, ఎందుకు చర్య తీసుకోలేదనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇన్నిరోజులు గోప్యంగా ఉంచడానికి కారణాలు
న్యాయ శాఖ ఈ పత్రాలను మొదటి నుంచీ ఎందుకు గోప్యంగా ఉంచింది. డిసెంబర్ గడువును ఎందుకు దాటిందనేది ఇప్పటివరకు ఒక ప్రశ్నగా మిగిలిపోగా, ఈ ఫైళ్లలో కొన్ని లక్షల పేజీల సమాచారం ఉంది. ఇందులో లైంగిక వేధింపులకు గురైన బాధితుల పేర్లు, వారి వ్యక్తిగత వివరాలు, వారు ఇచ్చిన వాంగ్మూలాలు ఉంటాయి. ఈ వివరాలను నేరుగా బహిర్గతం చేస్తే బాధితుల గోప్యతకు భంగం కలుగుతుంది. అందుకే, ప్రతి పేజీని క్షుణ్ణంగా పరిశీలించి, బాధితుల పేర్లను 'రెడాక్ట్' (Redact - నల్ల సిరాతో తొలగించడం) చేయడానికి వందలాది మంది న్యాయవాదులు పని చేయాల్సి వచ్చిందనేది న్యాయశాఖ సమాధానం.
అలాగే గతంలో ఈ కేసు విచారణ దశలో ఉన్నప్పుడు, వివరాలను బయటపెడితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని లేదా నిందితులు తప్పించుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావించింది. 2021లో గిస్లేన్ మాక్స్‌వెల్ శిక్ష పడే వరకు కొన్ని రికార్డులు కోర్టు పరిధిలో సీలు వేసి ఉన్నాయని వివరణ ఇచ్చింది.
న్యాయ శాఖ మొదట అనుకున్నదానికంటే పత్రాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సుమారు 32 లక్షల పేజీల రికార్డులను సమీక్షించడం అనేది ఒక భారీ ప్రక్రియ. డిసెంబర్ 19, 2025 గడువు నాటికి ఈ సమీక్ష పూర్తి కాలేదు. ప్రతి పత్రాన్ని చట్టబద్ధంగా తనిఖీ చేయకుండా విడుదల చేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు వస్తాయని భావించి ఆలస్యం చేశారు.
రాజకీయ మరియు దౌత్యపరమైన కారణాలు
ఈ కేసులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది శక్తివంతులు, రాజకీయ నాయకులు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఇటువంటి సున్నితమైన సమాచారాన్ని బయటపెట్టేటప్పుడు అంతర్జాతీయ సంబంధాలు లేదా ఉన్నత వ్యక్తుల ప్రతిష్టకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది.
కాగా, ప్రభుత్వం ఈ వివరాలను అణచివేస్తోందని గతంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అందుకే కాంగ్రెస్ 'ఎప్‌స్టీన్ ఫైల్స్ ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్' అనే చట్టాన్ని తీసుకువచ్చి, ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అక్కడి ప్రభుత్వం న్యాయ శాఖను ఆదేశించింది.
జెఫ్రీ ఎప్‌స్టీన్
ఎప్‌స్టీన్ ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి, వాల్ స్ట్రీట్‌లో పెట్టుబడిదారుడిగా ఎదిగాడు. అతను తన స్వంత సంస్థను స్థాపించి, బిలియనీర్లకు సలహాదారుగా పనిచేశాడు. ఈ క్రమంలోనే అతనికి రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, హాలీవుడ్ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. తరువాతి కాలంలో జెఫ్రీ ఎప్‌స్టీన్ ఒక అత్యంత ప్రభావవంతమైన ఫైనాన్షియర్‌గా ఎదిగాడు. కానీ అతని అసలు రూపం ఒక కరుడుగట్టిన లైంగిక నేరగాడు. ఇతను తన అధికారంతో, ధనబలంతో ఒక భారీ 'సెక్స్ ట్రాఫికింగ్' నెట్‌వర్క్‌ను నడిపి, ఎంతోమంది మైనర్ బాలికలను వేధించాడు. ఇతనికున్న రాజకీయ, వ్యాపార సంబంధాల వల్ల, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ప్రముఖుల పేర్లు (బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, ప్రిన్స్ ఆండ్రూ వంటి వారు) ఈ వివాదంలోకి వచ్చాయి.
2019లో సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలపై పట్టుబడిన ఎప్‌స్టీన్, విచారణ జరుగుతుండగానే న్యూయార్క్ జైలులో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణం తర్వాత కూడా ఈ కేసు ఇంకా ముగియలేదు. ఇటీవల అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన లక్షలాది పేజీల రికార్డులు ఎప్‌స్టీన్ అరాచకాల వెనుక ఉన్న అసలు నిజాలను, అతనికి సహకరించిన వ్యక్తుల గుట్టును బయటపెడుతున్నాయి.
