
జెన్ జీ గురించి వైసీపీ మాట్లాడటం విడ్డూరం: జనసేన నేత విజయ్ కుమార్
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, వారిని మాదకద్రవ్యాలకు బానిసలుగా మార్చిన వైసీపీ నాయకులు ఇప్పుడు ‘జెన్ జీ వార్’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మాల వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ డా. పెదపూడి విజయ్ కుమార్ విమర్శించారు. వైసీపీ పాలనలో యువతకు సకాలంలో జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని, మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ పేరుతో నిరుద్యోగులను నిరాశకు గురిచేశారని ఆరోపించారు.
ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి, మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ బేతపూడి విజయ్ శేఖర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 8,571 కిలోమీటర్ల సీసీ రోడ్లు, వందల కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. ‘అటవితల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా డోలీ రహిత గ్రామాల కోసం 2,710 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టామని చెప్పారు.
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేయడం వైసీపీ నాయకులకు తగదని విజయ్ కుమార్ అన్నారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అభివృద్ధి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. మార్కాపురంలో జల్ జీవన్ మిషన్ పనుల శంకుస్థాపనకు అధికారికంగా ఆహ్వానించినా ఆయన హాజరుకాలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పట్టించుకోకపోయినా నియోజకవర్గంలో దాదాపు రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
యువతను గంజాయి, డ్రగ్స్ వైపు నెట్టిన గత పాలకులు ఇప్పుడు జెన్ జీ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విజయ్ శేఖర్ అన్నారు. జగన్‌ను మెప్పించేందుకు విమర్శలు చేయడం మానుకుని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. శస్త్రచికిత్స అనంతరం కొద్దిరోజులకే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్ అంకితభావంతో పనిచేస్తున్నారని వారు పేర్కొన్నారు.
