
జూ కీపర్‌ను చంపి తినేసిన సింహాలు
బ్యాంకాక్‌లోని సఫారీ వరల్డ్ జూలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జంతు సంరక్షకుడిగా పని చేస్తున్న 58 ఏళ్ల జియాన్ రంగ్‌ఖరసమీపై సింహాలు దాడి చేసి చంపి తిన్నాయి. పర్యాటకులు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. దీంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. రంగ్‌ఖరసమీ 20 ఏళ్లకు పైగా ఈ జూలో పని చేస్తున్నాడు. భద్రతా నిబంధనలు పాటించకుండా, సింహాల జోన్‌లో కారు నిలిపి బయటకు రావడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
40 ఏళ్లలో మొదటిసారి దాడి
ఈ ఘటనపై వన్యప్రాణి శాఖ డైరెక్టర్జ నరల్ అట్టపోల్ చరోఎంచన్సా మాట్లాడుతూ సింహాలు ఆహారం తీసుకునే సమయంలో దాడి జరిగిందన్నారు. ఒక సింహం మానసిక స్థితి బాగా లేదని, అది దాడి ప్రారంభించడంతో మిగతా సింహాలు దాడికి దిగినట్లు చెప్పారు. దాడి చేస్తున్నప్పుడు ఒకానొక సమయంలో కొన్ని సింహాలు సంరక్షకుడిని గుర్తించి, భిన్నంగా ప్రవర్తించినట్లు తెలిపారు.
జూ అధికారులు మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపి, భద్రతా చర్యలను సమీక్షించాలని నిర్ణయించారు. పెటా సంస్థ సింహాలను సంరక్షణ కేంద్రానికి తరలించాలని డిమాండ్ చేసింది. వన్య ప్రాణులను బంధించడం వల్ల ఇలాంటి సమస్యలే ఎదురవుతాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. జూ అధికారుల సింహాలు, ఇతర జంతువులు సాధారణ స్థితిలో ఉన్నాయని, నిపుణుల బృందం వాటిని నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. గత 40 ఏళ్లలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదని స్పష్టం చేశారు. సందర్శకులు, సిబ్బంది భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, ఓపెన్ జూలో, ముఖ్యంగా వన్యప్రాణి జోన్‌లో వాహనాల నుంచి బయటకు రాకూడదని కోరారు.
జూ అధికారుల నిర్లక్ష్యం?
సఫారీ వరల్డ్ బ్యాంకాక్‌లో ఓపెన్ ఎయిర్ జూ పర్యాటకులకు ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇక్కడికి తరచూ స్థానికులతో పాటు విదేశీ పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో సింహాల దాడి చర్చనీయాంశంగా మారింది. రంగ్‌ఖరసమీపై సింహాలు సుమారు 15 నిమిషాల పాటు దాడి చేశాయి. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన జరిగినప్పుడు సందర్శకులు తమ వాహనాల హారన్‌లు మోగిస్తూ, అరుస్తూ సింహాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
కానీ ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. జూ అధికారులు ఈ దాడిపై ఆలస్యంగా స్పందించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సకాలంలో స్పందించి ఉంటే సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడే వాడని సందర్శకులు పేర్కొంటున్నారు. సింహాలు అతడిపై దాడి చేసి పావు గంట పాటు పీక్కు తిన్న తర్వాత జూ అధికారులు జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. సరైన శిక్షణ ఉన్నప్పటికీ పులులు, సింహాలు వంటి జంతువుల నిర్వహణలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. జూ అధికారులు సైతం ఏవైనా ఊహించని ఘటనలు ఎదురైనప్పుడు వేగంగా స్పందించాలి. ఈ ఘటనలో అధికారులు సకాలంలో స్పందించి ఉంటే జూ కీపర్ బతికే వాడు. ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సందర్శకులు జూ యంత్రాంగానికి సూచిస్తున్నారు.
