Let's talk: editor@tmv.in
జూలై 30నే ఆరు జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

జూలై 30నే ఆరు జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Gaddamidi Naveen
25 జులై, 2026

భోగాపురం వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని’ ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ వేడుకల నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో జూలై 31కి బదులుగా ఒక రోజు ముందుగానే, అంటే జూలై 30వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాల వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో మొత్తం 11,98,044 మంది లబ్ధిదారులకు రూ. 514.42 కోట్లు పంపిణీ చేయనున్నారు. పెన్షన్ల పంపిణీకి అవసరమైన నగదు ఉపసంహరణ ప్రక్రియను జూలై 29 నాటికే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల యంత్రాంగం తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.