Let's talk: editor@tmv.in
జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం

జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం

Pinjari Chand
13 ఏప్రిల్, 2026

జమ్మూ–కాశ్మీర్‌లోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రమైన అమర్నాథ్‌ యాత్ర ఈ ఏడాది జూలై 3న ప్రారంభమై ఆగస్టు 28న ముగుస్తుందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం జమ్మూలో మీడియాతో మాట్లాడుతూ యాత్ర తేదీలను అధికారికంగా ప్రకటించారు. మొత్తం 57 రోజులపాటు సాగే ఈ యాత్రను అమర్నాథ్‌ ఆలయ బోర్డు నిర్వహిస్తోంది.

రెండు మార్గాల్లో యాత్ర

లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపిన వివరాల ప్రకారం యాత్రకు రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా గుర్తించిన 556 బ్యాంక్ బ్రాంచ్‌లతో పాటు ఆన్‌లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ , యాక్సిస్ , యెస్ బ్యాంక్ వంటి సంస్థలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయనున్నాయి. యాత్రికుల వయస్సు పరిమితిని 13 నుంచి 70 సంవత్సరాల మధ్యగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. యాత్ర రెండు మార్గాల ద్వారా కొనసాగనుంది. ఒకటి 48 కిలోమీటర్ల నున్వాన్–పహల్గాం మార్గం, అలాగే 14 కిలోమీటర్ల బాల్టాల్ మార్గం ద్వారా భక్తులు గుహాలయాన్ని చేరుకుంటారు.

ఏర్పాట్లు పూర్తి

భద్రతాపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. జమ్మూ–కాశ్మీర్ పోలీస్, సీఆర్‌‌పీఎఫ్, ఎన్డీఆర్‌‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌‌ఎఫ్‌ బలగాలతో పాటు ఎత్తయిన ప్రాంతాల్లో భారత సైన్యం ముందస్తుగా మోహరించనుంది. అదనంగా, యాత్ర మార్గాల్లో ఆర్‌‌ఎఫ్‌ఐడీ కార్డులను తప్పనిసరి చేయడం, ప్రమాద బీమా పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడం వంటి సాంకేతిక చర్యలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాతావరణ వివరాల కోసం డాప్లర్ రాడార్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. వైద్య సదుపాయాలకు బాల్టాల్, చందన్వారిలో 100 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు, అలాగే జమ్మూ, శ్రీనగర్, ఇతర ప్రాంతాల్లో యాత్రి నివాస్ సదుపాయాలు విస్తరించినట్లు అధికారులు వివరించారు. యాత్ర సమయంలో భారీ వర్షాలు లేదా ప్రతికూల పరిస్థితుల్లో భక్తులకు అవసరమైన ఆశ్రయ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. మొబైల్ నెట్‌వర్క్ సేవలు నిరంతరం కొనసాగేందుకు అన్ని ప్రధాన టెలికాం సంస్థలను అనుసంధానం చేసినట్లు పేర్కొంది. మొత్తంగా ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.

జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం - Tholi Paluku