Let's talk: editor@tmv.in
జూలై 22న రాష్ట్రవ్యాప్తంగా గిగ్‌ కార్మికుల ఫ్లాష్‌ సమ్మె

జూలై 22న రాష్ట్రవ్యాప్తంగా గిగ్‌ కార్మికుల ఫ్లాష్‌ సమ్మె

Gaddamidi Naveen
18 జులై, 2026

తెలంగాణలో యాప్‌ ఆధారిత క్యాబ్‌, ఆటో, గూడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌, డెలివరీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ యాప్‌ ఆధారిత డ్రైవర్స్‌ ఫోరం (టీఏడీఎఫ్‌), తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (టీజీపీడబ్ల్యూయూ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్‌వీకే)లో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో ఓలా, ఉబెర్‌, రాపిడో, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్‌తో పాటు ఇతర డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన క్యాబ్‌ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, గూడ్స్‌ రవాణా కార్మికులు, డెలివరీ వర్కర్లు పాల్గొన్నారు. కార్మికుల ఆదాయాలు తగ్గిపోవడం, ప్లాట్‌ఫామ్‌ కంపెనీలు వసూలు చేస్తున్న కమిషన్లు పెరగడం, సంక్షేమ చర్యల అమలులో జాప్యం జరుగుతుండటంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.

యాప్‌ ఆధారిత రవాణా, డెలివరీ సేవలకు కనీస బేస్‌ ఫేర్‌తో పాటు కిలోమీటర్‌, నిమిషం, ఆర్డర్‌ ప్రాతిపదికన న్యాయమైన చార్జీలను ప్రభుత్వం, కంపెనీలు నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. అలాగే గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ రూల్స్‌ను వెంటనే నోటిఫై చేసి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. మోటార్‌ వెహికల్‌ అగ్రిగేటర్‌ మార్గదర్శకాలు–2025 ప్రకారం ప్రభుత్వం కనీస చార్జీలను ప్రకటించాల్సిందేనని, ప్రస్తుతం కంపెనీలు ఏకపక్షంగా చార్జీలు నిర్ణయించడం వల్ల కార్మికులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.

తమ సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వం, ప్లాట్‌ఫామ్‌ కంపెనీలతో పలుమార్లు చర్చలు జరిపినా స్పష్టమైన చర్యలు తీసుకోలేదని నాయకులు విమర్శించారు. డిమాండ్లు పరిష్కరించకపోతే జూలై 22న రాష్ట్రవ్యాప్తంగా ఫ్లాష్‌ సమ్మె నిర్వహిస్తామని, ఆగస్టు 10 తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

లక్షలాది మంది యాప్‌ ఆధారిత డ్రైవర్లు, డెలివరీ కార్మికుల జీవనోపాధిని రక్షించేందుకు ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాల ప్రతినిధులు, ప్లాట్‌ఫామ్‌ కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని టీఏడీఎఫ్‌ వ్యవస్థాపకుడు షేక్‌ సలావుద్దీన్‌ కోరారు. ఈ కార్యక్రమంలో పి.సతీష్‌, ఎ.నాగేశ్‌కుమార్‌, ఆర్‌కే రెడ్డి, సలీం తదితర నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
TelanganaHyderabadAppDriversGigWorkersPlatformWorkersTADFTGPWUFlashStrikeDriversStrikeDeliveryWorkers
జూలై 22న రాష్ట్రవ్యాప్తంగా గిగ్‌ కార్మికుల ఫ్లాష్‌ సమ్మె - Tholi Paluku