Let's talk: editor@tmv.in
జూలై 18న స్కైరూట్ ‘విక్రమ్-1’ ప్రయోగం.. భారత అంతరిక్ష చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం
జూలై 18న స్కైరూట్ ‘విక్రమ్-1’ ప్రయోగం.. భారత అంతరిక్ష చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం
జూలై 18న స్కైరూట్ ‘విక్రమ్-1’ ప్రయోగం.. భారత అంతరిక్ష చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం

జూలై 18న స్కైరూట్ ‘విక్రమ్-1’ ప్రయోగం.. భారత అంతరిక్ష చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం

Dantu Vijaya Lakshmi Prasanna
17 జులై, 2026

భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ‘విక్రమ్-1’ రాకెట్ తొలి పరీక్షా ప్రయోగం జూలై 18న ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (ఎస్‌డీఎస్‌సీ-షార్) తొలి ప్రయోగ వేదిక నుంచి జరగనుంది. భారత భూభాగం నుంచి పూర్తిగా ఒక ప్రైవేట్ సంస్థ రూపకల్పన చేసి, అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ తరగతి రాకెట్ ఇదే కావడం విశేషం. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచ అంతరిక్ష ప్రయోగ సేవల రంగంలో భారత ప్రైవేట్ సంస్థలకు కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి.

స్కైరూట్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, విక్రమ్-1 ప్రయోగానికి సంబంధించి అవసరమైన అన్ని సాంకేతిక, భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రయోగ సమయంలో రాకెట్ ప్రయాణించే గగనతల మార్గం, సముద్ర ప్రాంతాలను తాత్కాలికంగా నిషేధిత మండలాలుగా ప్రకటిస్తూ సంబంధిత అధికారులు వైమానిక, సముద్ర హెచ్చరికలు (ఎయిర్‌స్పేస్, మెరైన్ నోటీసులు) జారీ చేశారు. దీంతో ప్రయోగానికి అధికారిక అనుమతులు పూర్తయ్యాయి.

‘మిషన్ ఆగమన్’తో కొత్త యుగానికి శ్రీకారం

స్కైరూట్ ఈ తొలి ఆర్బిటల్ ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ అనే పేరు పెట్టింది. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ప్రపంచ ప్రయోగ మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెడుతున్న సంకేతంగా ఈ పేరును ఎంపిక చేసినట్లు సంస్థ తెలిపింది. ఇప్పటివరకు ఉపగ్రహ ప్రయోగాల్లో ప్రభుత్వ సంస్థ ఇస్రో కీలక పాత్ర పోషిస్తుండగా, ఇప్పుడు ప్రైవేట్ రంగం కూడా అదే స్థాయిలో సేవలు అందించే దిశగా అడుగులు వేస్తోందని సంస్థ పేర్కొంది.

వాస్తవ పరిస్థితుల్లో రాకెట్ పనితీరుపై పరీక్ష

స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కుమార్ చందానా మాట్లాడుతూ, విక్రమ్-1కు సంబంధించిన ప్రతి వ్యవస్థను భూమిపై అనేక దశల్లో క్షుణ్నంగా పరీక్షించామని తెలిపారు. అయితే వాస్తవ ప్రయోగ పరిస్థితుల్లో రాకెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం ఈ పరీక్షా ప్రయోగం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.

ఇది సంస్థకు తొలి ఆర్బిటల్ ప్రయోగం కావడంతో ఇందులో లభించే సమాచారం అత్యంత విలువైనదిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ డేటా ఆధారంగా భవిష్యత్తులో మరింత విశ్వసనీయమైన ప్రయోగ వాహనాలను రూపొందించడంతో పాటు, తరచూ ప్రయోగాలు నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

సాంకేతిక పేలోడ్‌లతో పాటు కళాఖండాలకు కూడా అవకాశం

విక్రమ్-1 రాకెట్‌లో పలు సాంకేతిక ప్రదర్శన పేలోడ్‌లు కూడా ప్రయాణించనున్నాయి. ఇందులో గ్రాహా స్పేస్, కాస్మోసర్వ్, డీక్యూబ్డ్ సంస్థల పేలోడ్‌లతో పాటు స్కైరూట్ స్వయంగా అభివృద్ధి చేసిన ఎస్‌కోప్ పేలోడ్‌ను కూడా అంతరిక్షంలోకి పంపనున్నారు.

అంతేకాకుండా కాస్మోస్ డైమండ్స్ రూపొందించిన ‘కాస్మిక్ బ్లూమ్’ అనే ప్రత్యేక కళాఖండంతో పాటు ఒక సూక్ష్మ కళా నమూనాను కూడా ఈ ప్రయోగంలో పంపిస్తున్నారు. విజ్ఞానశాస్త్రంతో పాటు కళకు కూడా అంతరిక్షంలో చోటు కల్పించడం ఈ ప్రయోగం ప్రత్యేకతగా నిలుస్తోంది.

చిన్న ఉపగ్రహాల మార్కెట్‌పై స్కైరూట్ దృష్టి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చిన్న ఉపగ్రహాల ప్రయోగాలకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, ప్రయోగ సేవలు అందించే సంస్థల సంఖ్య పరిమితంగానే ఉందని పవన్ కుమార్ చందానా తెలిపారు. రానున్న సంవత్సరాల్లో కమ్యూనికేషన్, వ్యవసాయం, రక్షణ, వాతావరణం, నావిగేషన్, ఇంటర్నెట్ సేవల కోసం వేల సంఖ్యలో చిన్న ఉపగ్రహాలు అంతరిక్షంలోకి వెళ్లనున్నాయని చెప్పారు.

అలాంటి పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో, వేగంగా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే సేవలను అందించడమే స్కైరూట్ లక్ష్యమని వివరించారు. విక్రమ్-1కు ప్రయోగ అనుమతి రావడం భారత అంతరిక్ష చరిత్రలో ఒక మైలురాయి అని ఆయన అభివర్ణించారు.

విక్రమ్-ఎస్ విజయానంతరం మరో కీలక అడుగు

2022 నవంబర్ 18న స్కైరూట్ విజయవంతంగా ప్రయోగించిన విక్రమ్-ఎస్ భారత భూభాగం నుంచి అంతరిక్షంలోకి చేరిన తొలి ప్రైవేట్ రాకెట్‌గా చరిత్ర సృష్టించింది. అది ఉపకక్ష్య (సబ్ ఆర్బిటల్) ప్రయోగం కాగా, ఇప్పుడు విక్రమ్-1 పూర్తిస్థాయి ఆర్బిటల్ ప్రయోగంగా మరింత కీలక మైలురాయిగా నిలవనుంది.

ఈ ప్రయోగం విజయవంతమైతే వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల రంగంలో సంస్థ మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం ఉందని అంతరిక్ష నిపుణులు భావిస్తున్నారు.

వెయ్యి మంది శ్రమకు ప్రతీక

స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఎఓఓ నాగ భరత్ డాకా మాట్లాడుతూ, జూలై 18న జరగబోయే ప్రయోగం ఒక రాకెట్ ప్రయోగం మాత్రమే కాదని, దాదాపు 1,000 మంది ఉద్యోగులు, 400కుపైగా సరఫరాదారులు, 3,000 రోజుల నిరంతర కృషికి ప్రతిఫలమని అన్నారు. ఈ ప్రయోగం ద్వారా సంస్థ అభివృద్ధి చేసిన ప్రతి సాంకేతిక వ్యవస్థ నిజ జీవిత పరిస్థితుల్లో ఎలా పనిచేస్తుందో తెలుసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. ప్రయోగం అనంతరం సేకరించే సమాచారాన్ని విశ్లేషించి మరింత మెరుగైన సాంకేతికతతో తదుపరి రాకెట్లను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

విక్రమ్-1 రాకెట్ అన్ని దశలను ఇప్పటికే విజయవంతంగా సమీకరించి ప్రయోగ వేదికపై ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన సమగ్ర సాంకేతిక తనిఖీలు, ప్రయోగ నియంత్రణ కేంద్రంతో అనుసంధాన పరీక్షలు, టెలిమెట్రీ గ్రౌండ్ స్టేషన్లు, ట్రాకింగ్ రాడార్లతో సమన్వయ పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తయ్యాయని స్కైరూట్ వెల్లడించింది. ప్రస్తుతం కౌంట్‌డౌన్‌కు ముందు చేపట్టాల్సిన తుది ఏర్పాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపింది.

విక్రమ్-1 ప్రత్యేకతలు

విక్రమ్-1 దాదాపు ఏడు అంతస్తుల ఎత్తు కలిగిన బహుళ దశల ఆర్బిటల్ ప్రయోగ వాహనం. దీనిని పూర్తిగా కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో తయారు చేశారు. ఇందులో స్కైరూట్ స్వయంగా అభివృద్ధి చేసిన 3డీ ముద్రిత రాకెట్ ఇంజిన్లు, అధిక శక్తి గల ఘన ఇంధన బూస్టర్లు ఉపయోగించారు.

ఈ రాకెట్ 350 కిలోల వరకు బరువున్న చిన్న ఉపగ్రహాలను భూమికి సమీప కక్ష్య (లో ఎర్త్ ఆర్బిట్)లోకి తీసుకెళ్లగలదు. తొలి పరీక్షా ప్రయోగంలో 450 కిలోమీటర్ల ఎత్తులో, 60 డిగ్రీల వంపు కలిగిన కక్ష్యను లక్ష్యంగా నిర్ణయించారు.

భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి కీలక మలుపు

విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైతే భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఇది చారిత్రాత్మక మలుపు కానుంది. ప్రపంచవ్యాప్తంగా చిన్న ఉపగ్రహాల ప్రయోగ సేవల మార్కెట్‌లో భారత్‌కు కొత్త గుర్తింపు తీసుకురావడంతో పాటు, దేశీయ స్టార్టప్‌ల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశాన్ని ఈ ప్రయోగం కల్పించనుంది. స్కైరూట్ ఆశయాలకు మాత్రమే కాకుండా, భారత అంతరిక్ష పరిశ్రమ భవిష్యత్ అభివృద్ధికి కూడా ఈ ప్రయోగం బలమైన పునాది వేయనుంది.

ట్యాగ్‌లు
AsaduddinOwaisiIndianAttackedInUSUSStabbingSyedSohailuddinUtahReligiousHateCrimeAIMIMHyderabadIndianDiasporaSIR2026TelanganaElectionCommissionVoterListRevisionPermanentResidenceCertificateDrugMenaceBreakingNewsTeluguNewsLatestNewsUSNewsIndiaNews
జూలై 18న స్కైరూట్ ‘విక్రమ్-1’ ప్రయోగం.. భారత అంతరిక్ష చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం - Tholi Paluku