Let's talk: editor@tmv.in
జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 క్రీడా పోటీలు

జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 క్రీడా పోటీలు

Gaddamidi Naveen
14 జులై, 2026

ఆంధ్రప్రదేశ్‌ను ‘క్రీడా ఆంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దే లక్ష్యంతో జూలై 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0’ క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ అనిమిని రవి నాయుడు ప్రకటించారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో ఈ పోటీల అధికారిక పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అండర్-17, అండర్-23 విభాగాల్లో 12 క్రీడాంశాలలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. దాదాపు 3 లక్షల మందికి పైగా విద్యార్థులు, యువత పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, విజేతలకు రూ. 94 లక్షల నగదు బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. నియోజకవర్గ స్థాయి ఎంపికల అనంతరం జిల్లా స్థాయి పోటీలు ఆగస్టు 1-15 వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు ఆగస్టు 20-25 వరకు జరుగుతాయని, ఆగస్టు 29న ‘జాతీయ క్రీడా దినోత్సవం’ సందర్భంగా విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పతకాలు సాధించే ముందే వర్ధమాన క్రీడాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు విద్యార్థులకు ఇదొక సువర్ణావకాశమని శాప్ ఎండీ భరణి తెలిపారు. ఈ క్రీడా సంబరాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

ట్యాగ్‌లు
AmaravatiChampionship2AmaravatiChampionshipSportsAndhraPradeshAndhraPradeshSportsSAAPSportsForAllYouthSportsSportsTalent
జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 క్రీడా పోటీలు - Tholi Paluku