
‘జూబ్లీ హిల్స్’ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న 61-జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. పారదర్శకంగా, సజావుగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు అర్హులైన పౌరులు, రాజకీయ పార్టీల వాటాదారులందరూ ఈ కీలక తేదీలు, మార్గదర్శకాలను గమనించాలని ఈసీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఉపఎన్నిక కీలక తేదీలు
నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ - అక్టోబర్ 21
నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) - అక్టోబర్ 22
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - అక్టోబర్ 24
పోలింగ్ తేదీ - నవంబర్ 11
ఓట్ల లెక్కింపు - నవంబర్ 14
ఎన్నికల ప్రక్రియ ముగింపు - నవంబర్ 16
ఈ నెల అక్టోబర్ 19 ఆదివారం, అక్టోబర్ 20 దీపావళి పండుగ రావడంతో ఆరోజుల్లో నామినేషన్లను స్వీకరించమని రిటర్నింగ్ అధికారి పి. సాయి రామ్ స్పష్టం చేశారు.
నామినేషన్ పత్రాల సమర్పణ
నామినేషన్ ఫారాలు (ఫారం 2బి), నోటరీ చేయబడిన అఫిడవిట్ (ఫారం 26)ను షేక్‌పేట్ తాహసీల్ కార్యాలయంలో సమర్పించాలి. సాధారణ అభ్యర్థులు పదివేలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు (తగిన కుల ధృవీకరణ పత్రంతో) 5వేలు భద్రతా డిపాజిట్ చెల్లించాలి. అభ్యర్థులు 2x2.5 సెం.మీ. సైజులో కలర్ ఫోటోగ్రాఫ్‌ను సమర్పించాలి. కనీసం 25 సంవత్సరాలు నిండినవారై ఉండాలి. పరిశీలన తేదీకి ముందే ప్రమాణ ధృవీకరణ పూర్తి చేయాలి. ఫారాలు 'ఏ', 'బి'లను నామినేషన్ల చివరి రోజున మధ్యాహ్నం 3:00 గంటలలోపు పూర్తి చేసి అందజేయాలి.
బలపరిచేవారి నిబంధనలు
అభ్యర్థులను బలపరిచే నిబంధనలు పార్టీల గుర్తింపును బట్టి మారుతాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ , భారతీయ జనతా పార్టీ , సీపీఐ(ఎం), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ , నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ వంటి జాతీయ పార్టీలు, అలాగే ఏఐఎంఐఎం, బీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ ఆర్పీ వంటి తెలంగాణ రాష్ట్ర పార్టీల అభ్యర్థులకు సెప్టెంబర్ 30 నాటికి ఉన్న ఓటర్ల జాబితా నుండి బలపరిచే వ్యక్తి అవసరం. ఇతర అభ్యర్థులకు అదే ఓటర్ల జాబితా నుండి పది మంది బలపరిచే వ్యక్తులు అవసరం. వేరే నియోజకవర్గాల నుండి పోటీ చేసే అభ్యర్థులు సంబంధిత ఈఆర్ఓ నుండి ఎలక్టోరల్ దరఖాస్తును అందజేయాలి.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్
ఉపఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ , ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్వీ కర్ణన్ అక్టోబర్ 8న కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,620 కేసులు పోస్టర్లు, బ్యానర్లు, గోడ రాతలు నమోదు కాగా, వాటిలో 1,097 ప్రభుత్వ ఆస్తులపై, 523 ప్రైవేట్ ఆస్తులపై ఉన్నాయి. గుర్తించిన అన్ని ఉల్లంఘనలను తక్షణమే తొలగించారు.
నిరంతర నిఘా
డీఈఓ ఆర్వీ కర్ణన్ సంబంధిత ఫిర్యాదులపై నిరంతర నిఘా, సకాలంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 24గంటలపాటు ఫిర్యాదులను పర్యవేక్షించడానికి 1950 ఎన్నికల హెల్ప్‌లైన్ సి-విజిల్ మొబైల్ అప్లికేషన్ ద్వారా పర్యవేక్షణకు ఏర్పాట్లు చేశారు. తక్షణ ప్రతిస్పందన, కఠిన అమలు కోసం నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ ను మోహరించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆవరణలలో ఎలాంటి రాజకీయ ప్రచారం, ప్రచార సామగ్రి, గోడ రాతలను ప్రదర్శించాలన్నా తప్పనిసరిగా ఈసీ నుండి ముందస్తు అనుమతి పొందాలని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.
ఇతర రాష్ట్రాల్లోనూ ఉపఎన్నికలు
అక్టోబర్ 6న భారత ఎన్నికల సంఘం ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 11న ఉపఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది. వివిధ కారణాల వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి ఈ ఉపఎన్నికలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని జూబ్లీ హిల్స్‌తో పాటు, జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాం, నగ్గ్రోటా, రాజస్థాన్‌లోని అంటా, జార్ఖండ్‌లోని ఘాట్‌శిలా, పంజాబ్‌లోని తార్న్ తారన్, మిజోరాంలోని దాంపా మరియు ఒడిశాలోని నువాపడా జిల్లాల్లో ఈ ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉపఎన్నికలన్నింటికీ ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.
జూబ్లీహిల్స్ ఉప సమరానికి సర్వం సిద్ధం
హైదరాబాద్ రాజకీయాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గత జూన్ 2025లో అకాల మరణం చెందడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం (అక్టోబర్ 13న) అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎన్నికల ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. నవంబర్‌లో పోలింగ్, ఓట్ల లెక్కింపు జరగనుండగా, నగర యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లతో ముందుకెళ్తోంది.
రాజకీయాల ప్రాధాన్యత
రాజధాని నగరంలోని అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ ఒకటి. ఇక్కడి ఫలితం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతుందన్న అంచనాల నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక అధికార, విపక్షాలకు అగ్నిపరీక్షగా మారింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన మాగంటి గోపీనాథ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడం ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. మరోవైపు నగరంలో తమ బలాన్ని నిరూపించుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు, మారుతున్న ఓటర్ల సమీకరణాలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించి వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
అమల్లోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి
అక్టోబర్ 13న నోటిఫికేషన్ వెలువడిన వెంటనే హైదరాబాద్ జిల్లా మొత్తం ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కన్డక్ట్) అమల్లోకి వచ్చింది. జిల్లా ఎన్నికల అధికారి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీని ప్రకారం కింది నిబంధనలు తక్షణమే వర్తిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు ప్రదేశాల్లో రాజకీయ ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లపై కఠిన నియంత్రణలు విధించారు. ఇప్పటికే ఉన్న వాటిని తొలగించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అభ్యర్థులు తమ నేర చరిత్ర, కేసుల వివరాలను తప్పనిసరిగా ప్రసార మాధ్యమాలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం, ఇతర బహుమతుల పంపిణీని అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. సరైన ఆధారాలు లేకుండా అధిక మొత్తంలో నగదు రవాణా చేస్తే సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.
పోలింగ్ ఏర్పాట్లు
ఎన్నికను ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 139 ప్రాంతాలలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈవీఎంలు, వీవీపాట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు క్షుణ్ణంగా పరిశీలించి సిద్ధం చేశారు. నగర పోలీస్ కమిషనర్ నేతృత్వంలో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ అదనపు బలగాలను మోహరించనున్నారు. రౌడీ షీటర్లను బైండోవర్ చేస్తున్నారు.
నిఘా బృందాలు
24 గంటలూ పనిచేసేలా ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, నిఘా బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తాయి. ఈవీఎంలను తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. లైసెన్స్ ఉన్న ఆయుధాలను సమీప పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు విజిల్ యాప్, 1950 హెల్ప్‌లైన్ నంబర్ అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ఎన్నికను "హరిత ఎన్నిక"గా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని, కాగిత వాడకాన్ని తగ్గించాలని పార్టీలకు అధికారులు సూచించారు. మొత్తం మీద హోరాహోరీగా జరగనున్న జూబ్లీహిల్స్ ఉప పోరుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య:3.9 లక్షలు, పురుష ఓటర్లు 2,04,288, మహిళ ఓటర్లు 1,88,356, ఇతర వర్గం ఓటర్లు 25 మంది ఉన్నారు. ఈ సంఖ్యలు డ్రాఫ్ట్ రోల్ ఆధారంగా ఉన్నాయి.
