Let's talk: editor@tmv.in
జూబ్లీహిల్స్‌ రణభేరి!

జూబ్లీహిల్స్‌ రణభేరి!

T Venkata Ramana
7 అక్టోబర్, 2025

తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్న ప్రతిష్టాత్మక జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో ఖాళీ అయిన ఈ స్థానానికి, బిహార్ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా ఖాళీ అయిన పలు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు కలిపి నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నెల రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, వ్యూహాలకు ఈ ప్రకటనతో మరింత వేడిని అద్దనుంది. ఓ వైపు అధికార కాంగ్రెస్, సిట్టింగ్ స్థానం కోసం పోరాడుతున్న బీఆర్‌ఎస్, బలపడాలని చూస్తున్న బీజేపీల మధ్య ఈ ఉపఎన్నికలో ముక్కోణపు పోరు అనివార్యంగా కనిపిస్తోంది. ఈ ఫలితం రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేయనుంది.ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.

ఎన్నికల షెడ్యూల్

నోటిఫికేషన్ విడుదల అక్టోబర్‌ 13, 2025

నామినేషన్లకు తుది గడువు - అక్టోబర్‌ 21,2025

నామినేషన్ల పరిశీలన - అక్టోబర్‌ 22

నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు - అక్టోబర్‌ 24

పోలింగ్‌ తేదీ - నవంబర్‌ 11, 2025

ఓట్ల లెక్కింపు - నవంబర్‌ 14, 2025

ఎమ్మెల్యే గోపినాథ్ మృతితో

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ ఏడాది జూన్ 8న మరణించడంతో ఖాళీ అయిన సీటుకు ఇప్పుడు ఉపఎన్నిక జరగనుంది. ఇప్పటికే పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నతరుణంలో ఎన్నికల సంఘం బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ షెడ్యూల్‌ను ప్రకటించింది. జూబ్లీహిల్స్ హైదరాబాద్‌లోని ప్రముఖ రెసిడెన్షియల్ ప్రాంతం. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. ఈ ఉపఎన్నికలో 3.92 లక్షల మంది ఓటర్లు తమ హక్కు ఉపయోగించుకోనున్నారు. డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేసిన ఎన్నికల అధికారులు, క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్‌ను సెప్టెంబర్ 25 వరకు స్వీకరించారు. ఫైనల్ ఎలక్టరల్ రోల్ సెప్టెంబర్ 30న ప్రచురించారు.

ఓటర్ల సంఖ్య

అగస్టు 20 నాటి డ్రాఫ్ట్ ప్రకారం పురుషులు 2.04,167, మహిళలు 1,88,213 మంది ఉన్నారు. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 25 మంది. ప్రత్యేక అవసరాలతో ఉన్న ఓటర్లు 1,858 మంది, 80 ఏళ్లు పైబడినవారు 6,049 మంది. ఎన్‌ఆర్‌ఐలు 96 మంది. తుది జాబితాలో 3.99 లక్షలకు పెరిగినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఓటర్లు తమ పేరు లిస్ట్‌లో ఉందో తనిఖీ చేసుకోవాలని ఈసీఐ పిలుపునిచ్చింది. ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లు, ఫారం-7 ద్వారా తొలగింపు, ఫారం-8 ద్వారా సవరణలు చేసుకునే అవకాశం కల్పించింది.

407 పోలింగ్ బూత్ లు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 407 పోలింగ్ బూతులు 139 లొకేషన్లలో ఏర్పాటు చేశారు. ఇందులో 183 బూతుల్లో 1,200 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. అయితే ఏ బూతులోనూ 1,500 మందికి మించి ఓటర్లు ఉండకుండా రేషనలైజేషన్ పూర్తి చేశారు. ప్రతి బూతు ఓటర్ నివాసానికి 2 కి.మీ. దూరంలో ఉండేలా చూశారు. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు) 3,500 మంది శిక్షణ పొందారు. మొబైల్ ఫోన్లు బూతు వెలుపల డిపాజిట్ చేయాలి.ఈసీఐ కొత్త యాప్‌లు, ఈసీఐ‌నెట్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఉపయోగించి పారదర్శకత పెంచారు.

ఈ ఎన్నిక పార్టీలకు ప్రతిష్టాత్మకం

ఈ ఉపఎన్నిక రాజకీయాల్లో ప్రతిష్టాత్మకమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలిచారు. మహ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని కసరత్తు చేస్తోంది. జూబ్లిహిల్స్ లో ముక్కోణపు పోటీ జరగనుంది.

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతోనే ప్రధాన పార్టీల మధ్య పోటీ తారా స్థాయికి చేరుకుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కంకణం కట్టుకున్న బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచార పర్వంలో దూసుకెళ్తోంది. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ కేటాయించి సానుభూతి అస్త్రాన్ని ప్రధాన ప్రచారాంశంగా మలచుకుంది. జూబ్లీహిల్స్ ప్రజలు మాగంటి కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయం వచ్చిందంటూ బీఆర్ఎస్ నేతలు ప్రజల మద్దతు కూడగడుతున్నారు.

వ్యూహాలకు పదును

మరోవైపు అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్ సానుభూతి ప్రభావాన్ని ఛేదించి విజయం సాధించాలనే పట్టుదలతో ఈ రెండు జాతీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. క్షేత్రస్థాయి సమీక్షలు, సర్వేలు, కమిటీలతో బిజీగా గడుపుతున్నప్పటికీ ఇప్పటికీ అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం తీసుకోకపోవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అభ్యర్థి ఎంపికలో జాప్యమెందుకు?

బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి రోజురోజుకు ప్రచారంలో ముందంజలో ఉండగా కాంగ్రెస్, బీజేపీలు మాత్రం అభ్యర్థి ఎంపికపైనే తర్జనభర్జన పడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ రెండూ జాతీయ పార్టీలు కావడంతో కీలకమైన ఉపఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసే అధికారం ఎక్కువగా కేంద్ర అధిష్ఠానం చేతుల్లో ఉంటుంది. స్థానిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు, భవిష్యత్తు రాజకీయాలపై సుదీర్ఘ చర్చలు నివేదికల ఆధారంగానే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

గెలుపు గుర్రం కోసం కసరత్తు

బీఆర్ఎస్ సానుభూతిని సమర్థవంతంగా ఎదుర్కొని పార్టీని గెలుపు తీరాలకు తీసుకెళ్లగలిగే 'దమ్మున్న' నేత కోసం ఈ రెండు పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. కేవలం స్థానిక ప్రజాదరణే కాకుండా ఆర్థిక వనరులు, పోరాటపటిమ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిని ఫైనల్ చేయడంలో ఆలస్యం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ త్రిమెన్ కమిటీ ఇప్పటికే అభ్యర్థుల తుది జాబితాను అధిష్ఠానానికి సమర్పించినట్లు సమాచారం. జాబితాలో మొత్తం నలుగురి పేర్లు ఉన్నట్లు సమాచారం. అయితే ఇందులో ముఖ్యంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక నేతలు నవీన్ యాదవ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరో ఇద్దరి పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాలో ఎలిమినేషన్ తర్వాత ఎవరు ఫైనల్ అవుతారనేది పార్టీలో గుబులు రేపుతోంది. కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు, కోఆర్డినేటర్లతో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక సమావేశాలు నిర్వహించారు. ఎవరికి టికెట్ ఇస్తే పార్టీకి అత్యధిక ప్రయోజనం చేకూరుతుందనే అంశంపై వివరాలు సేకరించారు. కాంగ్రెస్ తమ అభ్యర్థిని రెండురోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సానుభూతిని బ్రేక్ చేయగలమని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తంచేస్తున్నారు. కంటోన్మెంట్ ఫలితాలే జూబ్లీహిల్స్‌లోనూ పునరావృతమవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు.

బీజేపీ ఆశలు

బీజేపీకి బ్రాండ్‌గా భావించే అర్బన్ ఏరియా కావడం, యువత ఓటర్లు అధికంగా ఉండటంతో ఉపఎన్నికలో విజయంపై బీజేపీ ధీమాతో ఉంది. పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండటం కూడా బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ మాదిరిగానే బీజేపీ కూడా అభ్యర్థి ఎంపిక కోసం త్రిమెన్ కమిటీని నియమించింది. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్‌లో అభ్యర్థి ఎంపికపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.

బీఆర్ఎస్ ధీమా

గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది. ఈ కారణంగా సిటీ బీఆర్ఎస్‌దే అన్న ధీమా గులాబీ పార్టీలో బలంగా ఉంది.

బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై ఉన్న సానుభూతిని బ్రేక్ చేసే నాయకుడి కోసం కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న కసరత్తే ఈ ఎన్నిక యొక్క ప్రాధాన్యతను పెంచుతోంది. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అధికార, విపక్ష పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో హైదరాబాద్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్ సానుభూతిని ఎదుర్కొని జాతీయ పార్టీలు తమ అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించి ప్రచార పర్వంలోకి దిగుతాయో వేచి చూడాలి.

భవిష్యత్ ప్రభావం

ఈ ఉపఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కీలకమవుతుంది. కాంగ్రెస్ గెలిస్తే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బలం పెరుగుతుంది. బీఆర్ఎస్ లేక బీజేపీ గెలిస్తే రెవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది.

జూబ్లీహిల్స్‌ రణభేరి! - Tholi Paluku