Let's talk: editor@tmv.in
జూబ్లీహిల్స్ మంగళగౌరి వస్త్ర దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

జూబ్లీహిల్స్ మంగళగౌరి వస్త్ర దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

Dantu Vijaya Lakshmi Prasanna
27 ఫిబ్రవరి, 2026

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-36లో ఉన్న మంగళ్య గౌరీ శారీస్ షోరూమ్‌‌‌‌‌‌ ‌‌‌లో గురువారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

జిల్లా ఫైర్ ఆఫీసర్–2 అజ్మీరా శ్రీదాస్ తెలిపిన వివరాల ప్రకారం, భవనం నాలుగో అంతస్తులో పొగ ఎక్కువగా వ్యాపించినప్పటికీ పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉంది. ఘటన సమయంలో భవనం ఖాళీగానే ఉండటంతో భారీ ప్రమాదం తప్పిందని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోందన్నారు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వల్లాల నవీన్ యాదవ్ మాట్లాడుతూ, షోరూమ్‌లో పని చేస్తున్న సిబ్బంది మంటలు చెలరేగిన వెంటనే బయటకు రావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.దాదాపు పది మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, షోరూమ్‌లో దహన పదార్థాలు ఎక్కువగా లేకపోవడంతో మంటలు విస్తరించలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అయితే ఆస్తి నష్టం ఎంతవరకు జరిగిందనే అంశంపై ఇంకా అంచనా వేయాల్సి ఉందని పేర్కొన్నారు. భద్రతా నిబంధనల పాటింపుపై కూడా అధికారులు పరిశీలన చేపట్టారు.

ఇదిలా ఉండగా, ఇటీవలే హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ (కేపీహెచ్‌బీ)లోని ఓ మొబైల్ షాపులో కూడా అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 6:23 గంటలకు ఫైర్ కాల్ అందగానే ఒక అగ్నిమాపక వాహనం అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ ఘటనలో కూడా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

నగరంలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాల నేపథ్యంలో, వాణిజ్య భవనాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అగ్నిప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవడం అవసరమని, షార్ట్ సర్క్యూట్ వంటి కారణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అగ్నిమాపక శాఖ హెచ్చరించింది.ఇదిలాఉంటే బహిరంగ ప్రదేశంలో ధ్వజస్తంభం నమూనాను ఏర్పాటు చేసిన యాజమాన్యం తీరుపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.