
జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాత పేదలకు 4 వేల ఇళ్లు:సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పేదలకు శుభవార్త తెలిపారు. ఉపఎన్నికల ప్రక్రియ ముగిసిన తక్షణమే, అర్హులైన పేదలకు 4,000 ఇళ్లను కేటాయించనున్నట్లు ప్రకటించారు.రాహమత్ నగర్ జంక్షన్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్‌లో సీఎం మాట్లాడుతూ, తమ ప్రభుత్వం నియోజకవర్గంలో ఇప్పటికే 14,197 రేషన్ కార్డులు, 25,925 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అలాగే 23,311 క్వింటాళ్ల సన్న బియ్యం పంపిణీ చేసిందని వివరాలు వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతిని కేంద్రం ఆమోదించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రికి దమ్ముంటే నవంబర్ 11 లోపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై సీబీఐ కేసు నమోదు చేయాలని సవాల్ విసిరారు.
ఫార్ములా ఈ రేస్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి కోరినా, రెండు నెలలుగా ఎందుకు స్పందన లేదని సీఎం కిషన్ రెడ్డిని నిలదీశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య 'రహస్య ఒప్పందం' కుదిరిందని, ఢిల్లీకి వెళ్లగానే 'కారు' (బీఆర్‌ఎస్ గుర్తు) 'కమలంగా' మారుతోందని ఎద్దేవా చేశారు. గతంలో బీజేపీ నేతలే కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి 'ఏటీఎం' అని ఆరోపించారని, కానీ ఇప్పుడు చర్యలు తీసుకోవడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని సీఎం ఆరోపించారు.
జూబ్లీ హిల్స్‌కు మంత్రిగా కేటీఆర్ ఏమీ చేయలేదని, ఇప్పుడు కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని సీఎం విమర్శించారు. కేసీఆర్ కుమార్తె కవితను సైతం కేసీఆర్ కుటుంబం దూరం పెట్టిందని, సొంత ఆడపడుచుకే గౌరవం ఇవ్వని బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు మహిళా సెంటిమెంట్ పేరుతో ఓట్లు అడగడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. మహిళలకు, మైనారిటీలకు కాంగ్రెస్ మాత్రమే తగిన గౌరవం ఇచ్చిందన్నారు.
కాంగ్రెస్ నేత పి జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) కుటుంబాన్ని కేసీఆర్ అవమానించారని గుర్తు చేశారు. పీజేఆర్‌ను అవమానించినందుకు రాహమత్ నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. జూబ్లీ హిల్స్ అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
