Let's talk: editor@tmv.in
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణస్వీకారం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణస్వీకారం

Pinjari Chand
27 నవంబర్, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్ బుధవారం ఉదయం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో నవీన్ యాదవ్ తెలుగులో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు,అజారుద్దీన్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నవంబర్ 13న జరిగిన ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ 98,988 ఓట్లు సాధించగా... ఆయనకు అతి సమీప ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ భార్య, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. సుమారు 24,729 ఓట్ల భారీ మెజార్టీతో నవీన్ గెలుపొందారు.

గోపీనాథ్ మరణం తర్వాత ఖాళీ అయిన ఈ సీటును కాంగ్రెస్ గెలుచుకోవడం... గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీకి రెండో విజయంగా నమోదైంది. ప్రమాణస్వీకారం తర్వాత మీడియాతో మాట్లాడిన నవీన్ యాదవ్ ‘జూబ్లీహిల్స్ ప్రజలు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పార్కులు, స్ట్రీట్ లైట్లు అన్ని సమస్యలనూ పరిష్కరిస్తాను. ప్రతి వార్డులో ప్రజలతో సమావేశమై... వారి సూచనల మేరకే అభివృద్ధి చేపడతాను’ అని హామీ ఇచ్చారు. రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాత స్సీకర్, మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గాంధీభవన్ కు వెళ్లారు. ఈ విజయంతో తెలంగాణ అసెంబ్లీలో 119 సీట్లలో కాంగ్రెస్ బలం 66కి చేరగా... బీఆర్ఎస్ 37 సీట్లకు పరిమితమైంది. బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 సీటుతో ఉన్నాయి. నామినేషన్ సమయంలో నకిలీ ఓటరు కార్డులు పంచారన్న” ఆరోపణలతో నవీన్ యాదవ్ పై కేసు నమోదైంది. అయినా పార్టీ ఆయనకు మద్దతుగా నిలిచి... ఘన విజయం సాధించింది. జూబ్లీహిల్స్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని... కాంగ్రెస్ శ్రేణులు జై కాంగ్రెస్, జై రేవంత్ నినాదాలతో సంబరాలు జరుపుకున్నాయి.