
జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ గుర్తుపై మజ్లిస్ అభ్యర్థి పోటీ : రామచందర్ రావు
హైదరాబాద్‌లోని ప్రముఖ నియోజకవర్గమైన జూబ్లీ హిల్స్‌లో జరిగే ఉప ఎన్నికకు ముందు రాజకీయ వర్గాల్లో ఆసక్తి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు చేసిన వ్యాఖ్య లే ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. “కాంగ్రెస్ గుర్తుపై మజ్లిస్ అభ్యర్థి పోటీ చేస్తున్నాడనే ప్రచారం బయటపడింది. జూబ్లీ హిల్స్ ప్రజలు ఇది గమనించాలి” అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ చెయ్యి, మజ్లిస్ పతంగి ఎగరవేస్తుంది అని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పోటీ చేస్తోందా? మజ్లిస్ పొటీ చేస్తోందా?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ తరఫున పోటీ చేశారని, ప్రకటించుకున్న తరువాత మజ్లిస్ అధినేతను కలిశారని చెప్పారు.దీన్ని ప్రజలు గమనించాలన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనను జూబ్లీహిల్స్ ప్రజలు చూశారు. ఈ రెండు పార్టీలు నగరాన్ని అధ్వానంగా తయారు చేశాయి. విశ్వనగరం చేస్తామన్న బీఆర్ఎస్ విషాద నగరంగా మార్చిందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీని ఆదరించాలని రామచందర్ రావు కోరారు. నియోజకవర్గంలోని మేధావులు, సినీ ప్రముఖులు తమ పార్టీకి ఓటు వేస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. రేపటిలోగా అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు.
