Let's talk: editor@tmv.in
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు

Shaik Mohammad Shaffee
25 అక్టోబర్, 2025

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఈసారి చరిత్ర సృష్టించింది. నవంబర్ 11న పోలింగ్ జరగనున్న ఈ ఎన్నికల్లో ఏకంగా 58 మంది అభ్యర్థులు తుది జాబితాలో నిలిచారు. ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయడం ఈ నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారి అని రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు.

భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఈ ఉపఎన్నిక, కేవలం రాజకీయ పోరుగానే కాకుండా, ప్రజా సమస్యల వేదికగా మారింది. ప్రధాన పార్టీలతో పాటు, పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి నాయకులు, రైతులు బరిలోకి దిగారు.

నామినేషన్ల సంఖ్య రికార్డు

మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, పరిశీలన అనంతరం 81 మంది అర్హత సాధించారు. వీరిలో వివిధ పార్టీలు, స్వతంత్రులు కలిపి 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఫలితంగా, చివరికి 58 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. గత ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్యతో పోలిస్తే ఇది గణనీయంగా పెరిగింది. 2009లో

13 మంది అభ్యర్థులు, 2014లో 21 మంది అభ్యర్థులు, 2018లో 18 మంది అభ్యర్థులు, 2023లో 19 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

భారీ నామినేషన్లకు కారణాలు

సాధారణంగా ఉపఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్యే పోటీ ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్‌లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడానికి వెనుక సామాజిక నిరసన స్ఫూర్తి ఉంది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, ఈ ఉపఎన్నికను ఉద్యమ వేదికగా వాడుకుంటున్నారు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు, ఇతరులు రూ.10 వేలు చెల్లించి మరీ నామినేషన్లు వేశారు.

ప్రధానంగా ప్రాంతీయ రింగు రోడ్డు భూసేకరణ నిర్వాసితులు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ నామినేషన్లు వేశారు. 12 మంది ప్రస్తుతం రంగంలో ఉన్నారు. యాచారం ఫార్మాసిటీ భూ నిర్వాసితులు తగిన పరిహారం ఇవ్వలేదని, భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 10 మంది దాఖలు చేశారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఒక సామాజిక వర్గం తరఫున 10 మంది, ఉద్యోగ నియామక ప్రకటనలు లేవని నిరసిస్తూ నిరుద్యోగ జేఏసీ తరఫున 13 మంది నామినేషన్లు సమర్పించారు. పింఛన్లు సక్రమంగా రావడం లేదని సీనియర్ సిటిజన్ల తరఫున 9 మంది, తెలంగాణ ఉద్యమకారుల తరఫున ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు.

ఇంతమంది అభ్యర్థులు బరిలో ఉండటం వలన ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. ఇది ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల ఎన్నికల వ్యూహాలపై, తుది ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

మొత్తం 4,01,365 ఓటర్లు*

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌.వి. కర్ణన్ శుక్రవారం ప్రకటించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో 2,08,561 మంది పురుష ఓటర్లు, 1,92,779 మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపారు.

ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల్లో ఏర్పాటు చేసిన అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలాగా హెల్ప్ డెస్కులు కూడా ఏర్పాటు చేస్తామని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలియజేశారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు - Tholi Paluku