Let's talk: editor@tmv.in
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లలో సోదాలు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లలో సోదాలు

Gaddamidi Naveen
8 నవంబర్, 2025

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలు నిర్వహించారు. గురువారం రాత్రి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, అలాగే పార్టీ సీనియర్‌ నేత మర్రి జనార్ధన్‌రెడ్డి నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలు జరిగాయి.

ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సందర్భంలో, వస్తువులు, నగదు పంపిణీ వంటి ఆరోపణలపై ముందస్తు చర్యగా అధికారులు ఈ సోదాలు చేపట్టారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌తో పాటు రెవెన్యూ, పోలీసు, ఎన్నికల శాఖ, వీడియో సర్వీలెన్స్‌ టీములు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.సుమారు రెండు గంటల పాటు కొనసాగిన ఈ సోదాలలో అధికారులు ఎటువంటి నగదు, బంగారం, పత్రాలు లేదా ఆస్తులు స్వాధీనం చేసుకోలేదు. ఇంట్లో సాధారణ వస్తువులు మాత్రమే ఉన్నాయని వారు నివేదికలో పేర్కొన్నారు.

ఈ పరిణామంపై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ నేతలపై రాజకీయ ప్రేరణతో దాడులు చేస్తున్నారని ఆరోపించింది. ఎన్నికల ప్రచార వేళ జరుగుతున్న ఈ తరహా చర్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం అని విమర్శించింది.ఎన్నికల అధికారులు మాత్రం,నియమావళి ఉల్లంఘనలపై అందిన సమాచారాన్ని బట్టి సాధారణ తనిఖీలు మాత్రమే చేశామ‌ని తెలిపారు.జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి చర్యలు మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొనసాగే అవకాశముందని వారు తెలిపారు.

బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు

ఈ పరిణామంపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీ వర్గాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆరోపించారు.ఎలక్షన్ కోడ్ వర్తించని ప్రాంతాలలో కూడా పోలీసులు బీఆర్ఎస్ నాయకుల ఇళ్లపై దాడులు చేసి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపణలు చేశారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోవడానికే ఈ దాడులు జరుగుతున్నాయని ప్రజలు గమనిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు.ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారని, రాబోయే ఎన్నికల్లో ఈ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్గాలు ఘాటుగా వ్యాఖ్యానించాయి.

మొత్తంగా, తనిఖీల్లో ఎలాంటి వస్తువులు దొరకనప్పటికీ, ఈ చర్యలు మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి.