
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జోరు అందుకున్న ప్రచారం
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరు పెంచింది. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ఆదివారం రహ్మత్‌నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి చేపట్టిన ఈ ప్రచారంలో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ ను జూబ్లిహిల్స్ ప్రజలు నమ్మే స్థితిలో లేరు జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అత్యవసరం అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి, సంక్షేమం. గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే ఇందుకు నిదర్శనం" అని మంత్రి పేర్కొన్నారు.
నవీన్ యాదవ్‌ను గెలిపిస్తేనే నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయని, మౌలిక వసతులు మెరుగుపడతాయని నాయకులు హామీ ఇచ్చారు. నిరుద్యోగులు, మహిళలు, పేద వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.
ప్రజలంతా ఆలోచించి, స్థిరమైన, సంక్షేమ పాలన అందించే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు హస్తం గుర్తుకు ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు కోరారు. కచ్చితంగా యువకుడు అయినా మా అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఇక్కడి ప్రజలు గెలిపిస్తారు. అని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో డివిజన్ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
గేటెడ్ కమ్యూనిటీలో కేటీఆర్ ప్రత్యేక సమావేశం
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ తమ వ్యూహాలను పదును పెడుతోంది. ఇందులో భాగంగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం షేక్‌పేట్ డివిజన్‌లోని రిలయన్స్ జూబ్లీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ స్థానిక సమస్యలు, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలు, మధ్య తరగతి వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తూ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే నియోజకవర్గంలో మెరుగైన మౌలిక వసతులు, శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమని కేటీఆర్ వివరించారు.
అపార్ట్‌మెంట్ వాసులు కూడా తమ సమస్యలను, అంచనాలను నేరుగా పార్టీ ముఖ్య నాయకత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల్లో తమ మద్దతు కూడగట్టడానికి, పట్టణ ఓటర్లను ఆకర్షించడానికి బీఆర్ఎస్ చేపట్టిన ఈ ప్రత్యేక సమావేశం వ్యూహాత్మకంగా మారింది.ఈ సమావేశంలో కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, తదితరులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అపార్ట్‌మెంట్ వాసులతో నేరుగా ముఖాముఖి నిర్వహించడం ప్రచారంలో భాగంగా కీలకంగా మారింది.
కారుకు ఓటు గుద్దితే రేవంత్ గూబ గుయ్యిమనాలి – హరీష్ రావు
రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. మంగటి సునీత భర్త చనిపోయి ఏడుస్తుంటే, కాంగ్రెస్ పార్టీ దానిని వేళన చేస్తోంది. ఇది ఎంత దారుణం?" అంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలు నవంబర్ 11వ తేదీన మీ ఓట్లు మాత్రమే కాదు, అందరి ఓట్లు పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లండి. కారు గుర్తుకు ఓటు వేయండి. కారు మీద గుద్దితే, ఆ దెబ్బకు రేవంత్ రెడ్డి గూబ గుయ్యిమనాలి. అప్పుడే వారికి ప్రజా తీర్పు అంటే ఏంటో అర్థమవుతుంది" అని హరీష్ రావు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా ప్రజా వ్యతిరేకతను చాటాలని హరీష్ రావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రచారంలో హరీష్ రావు వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
'విజయం కాషాయనిదే' అంటున్న బీజేపీ
బీజేపీ తన ప్రచారంలో వేగాన్ని పెంచింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని వివిధ ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమం వీధి వీధినా పర్యటించిన కిషన్ రెడ్డి స్థానిక ప్రజలను కలుసుకుని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన "విజయం కాషాయనిదే" అనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలను పరిష్కరించడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి బీజేపీ అభ్యర్థి లంకా దీపక్ రెడ్డి గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈసారి కమలం గుర్తుకు ఓటు వేసి, బీజేపీకి అధికారం అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారు, అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
అన్ని పార్టీలు తమ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెపుతున్నారు. లేకపోతే జరగదా?
రాజకీయ పార్టీలు "మా వాళ్లే గెలిస్తే అభివృద్ధి" అని చెప్పడం ప్రధానంగా ఎన్నికల వ్యూహం అభివృద్ధి అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత, అది గెలిచిన ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందినవారైనా నియోజకవర్గానికి జరగాల్సిందే.
అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే అభివృద్ధి పనులు వేగవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది రాజకీయంగా ప్రజలు నమ్మే విషయం. లేకపోతే నియోజకవర్గం అభివృద్ధి చేయరా? అంటే చేయాలి. కానీ ప్రచారంలో ఈ అంశాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటారు.
