Let's talk: editor@tmv.in
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత గెలుపు ఖాయం: కేసీఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత గెలుపు ఖాయం: కేసీఆర్

Gaddamidi Naveen
24 అక్టోబర్, 2025

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలో త‌న భార్య‌ మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును జూబ్లీ హిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని, పార్టీ నేతలు ప్రజలవద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉన్నదని పార్టీ నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు.

కేసీఆర్ మాట్టాడుతూ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థి రౌడీ షీటర్ కుటుంబానికి చెందినవారు కావడం, ప్రజలకు ఒక కఠిన పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని కేసీఆర్ సూచన చేశారు. అందువలన బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజలతో నేరుగా మమేకమై, కాంగ్రెస్ పాలనలో చోటుచేసుకున్న అవినీతి, దోపిడీ, ఆర్థిక అసమతుల్యాలను ప్రజలకు వివరించడం ముఖ్యమని అన్నారు.

ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున భారీ మెజారిటీ సాధించడానికి రూపొందించిన వ్యూహాలను పునరాలోచన చేసి, దిశా నిర్దేశం కోసం కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాస ప్రాంగణంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ సహా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేతలు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక కార్పొరేటర్లు, పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు.

సమావేశంలో అభ్యర్థి గెలుపుకు అనుకూలంగా ఇప్పటికే ప్రజల్లో సానుకూల స్పందన ఉనికిలో ఉన్నదని, ప్రస్తుత ప్రచారంపై సంబంధిత ఇంచార్జీలు సమగ్రంగా రిపోర్ట్ చేశారని ఆయ‌న తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణలను కేసీఆర్ సమీక్షించి ప్రత్యక్ష దిశానిర్దేశం చేశారు.

కేసీఆర్ మార్గదర్శకత్వం, సన్నాహక సమావేశంలో తీసుకున్న వ్యూహాలు బలంగా అమలవుతాయి అని బీఎఆర్ఎస్ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ఎదుర్కొని, ప్రజల చిత్తశుద్ధి, అభ్యర్థి గౌరవం ప్రాంతీయ శాంతి భద్రతలను కాపాడుతూ మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుస్తారని పార్టీ నేతలలో ఆశాభావం కనిపిస్తోందని కేసీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత గెలుపు ఖాయం: కేసీఆర్ - Tholi Paluku