Let's talk: editor@tmv.in
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఘన విజయం

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఘన విజయం

Gaddamidi Naveen
15 నవంబర్, 2025

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం.ఓట్ల లెక్కింపు మొదలైన దగ్గరి నుంచే నవీన్‌ యాదవ్‌ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండ్‌ రౌండ్‌కూ అది మరింత పెరిగింది. మెత్తం 10 రౌండ్లో కాంగ్రెస్ విజయం సాధించింది.భాజపాకు డిపాజిట్‌ గల్లంతైంది.2025 ఉపఎన్నిక సందర్భంగా పోలింగ్ శాతం సుమారు 48.49శాతంగా నమోదైంది.

జూబ్లిహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌ యాదవ్ మొత్తం 98,988 ఓట్లను సంపాదించగా, అతని సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్‌ అభ్యర్థి మగంటి సునీత 74,259 ఓట్లు పొందారు. కాంగ్రెస్ అభ్యర్థికి 24,729 ఓట్ల భారీ మెజారిటీ లభించింది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి 17,061 ఓట్లతో మూడో స్థానానికి చేరి డిపాజిట్ కోల్పోయారు.

నవీన్‌యాదవ్ రాజకీయ చరిత్ర

2009లో యూసుఫ్‌గూడ డివిజన్‌ ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్‌గా నిలిచి తెదేపా అభ్యర్థి మురళీగౌడ్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. 2014లో ఎంఐఎం తరఫున జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 2015లో ఎంఐఎం అభ్యర్థిగా రహ్మత్‌నగర్‌ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌ పోటీచేసి ఓడిపోయారు. 2018లో జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి18,800 ఓట్లు పొందారు. 2023అప్పటి పీసీసీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి సమక్షంలో నవీన్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

జూబ్లీహిల్స్ ఓటు సరళి విశ్లేషణ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటర్లు కాంగ్రెస్‌కు స్పష్టమైన తీర్పు ఇచ్చారని సీఎం తెలిపారు.కాంగ్రెస్‌‌కు 51శాతం, బీఆర్‌ఎస్‌‌కు 38 శాతం,బీజేపీ‌‌కి 8 శాతంగా నమోదు అయ్యాయి.ఓటింగ్ ట్రెండ్ పెరుగుదల 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39.5శాతం కాగా , 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 41శాతం ఉన్న కాంగ్రెస్ ఓటు శాతం, ఉపఎన్నికలో 51శాతంకు పెరిగింది.

గత జూన్‌లో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఉపఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఈ స్థానం హైదరాబాద్ రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా భావించబడుతుంది. పాలక కాంగ్రెస్‌కు, అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు ఇది కీలక పోరాటంగా మారింది.

జూబ్లీహిల్స్ గెలుపు మరింత బాధ్యతను పెంచింది: సీఎం

జూబ్లిహిల్స్‌ శాసనసభ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌ యాదవ్ అఖండ మెజారిటితో విజయం సాధించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.పీసీసీ నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు అందరూ ఏకతాటిపై కష్టపడిన ఫలితమే ఈ విజయం అని సీఎం పేర్కొన్నారు. ఐక్యతగా పనిచేస్తే కాంగ్రెస్‌ను ఎవరూ అడ్డుకోలేరని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయని ఆయ‌న‌ అన్నారు. ఈ విజయాన్ని పార్టీ కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.హైదరాబాద్ నగర అభివృద్ధి, పేదల సంక్షేమం పట్ల ఈ ఫలితాలు తమపై మరింత పెద్ద బాధ్యతను ఉంచాయని సీఎం తెలిపారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, ఫోర్త్‌ సిటీ నిర్మాణం, రీజినల్‌ రింగ్‌ రోడ్డు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు స్పష్టమైన ఆమోదం తెలిపినట్లుగా ఈ తీర్పు భావిస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.వచ్చే మూడేళ్లపాటు అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుందని, ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలకు విశ్రాంతి ఇచ్చి ప్రజాసేవకే ప్రాధాన్యం ఇస్తామని సీఎం తెలిపారు.ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం, పార్టీ తరఫున పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించడం ద్వారా తన నాయకత్వాన్ని మరింత బలపరిచారు. ఈ ఫలితంతో 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్య 66కి చేరింది. గత రెండేళ్లలో పార్టీ సాధించిన ఇది రెండో ఉపఎన్నిక విజయం అని సీఎం తెలిపారు.

కేటీఆర్‌, హరీష్‌రావులకు సలహా

బీఆర్‌ఎస్‌ నేతలైన కేటీఆర్‌, హరీష్‌రావుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ తనకన్నా వయసులో చిన్నవాడని, ఇంకా చాలా సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగాల్సి ఉందని గుర్తుచేస్తూ, అహంకారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ప్రజల మధ్య పనిచేయాలంటే వినయం, సహనం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. అదేవిధంగా హరీష్‌రావును ఉద్దేశించి మాట్లాడుతూ, రాజకీయాలలో అసూయకు స్థానం లేదని, ప్రజల తీర్పును గౌరవించడం నాయకుడి బాధ్యత అని వ్యాఖ్యానించారు. అసూయను విడనాడి, రాజకీయాల మార్పులను అర్థం చేసుకొని ముందుకు సాగాలని ఆయన సూచించారు.

నన్ను మీ మనిషిగా భావించి గెలిపించినందుకు కృతజ్ఞతలు

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించిన నవీన్ యాదవ్ తమను భారీ మెజార్టీతో గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.నన్ను మీ మనిషిగా భావించి భారీ మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అని నవీన్ యాదవ్ పేర్కొన్నారు.ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన, తనను కేవలం రాజకీయ నాయకుడిగా కాకుండా, తమ మనిషిగా ఆదరించి, అఖండ విజయాన్ని అందించినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం జూబ్లీహిల్స్ ప్రజలకు దక్కిన విజయంగా ఆయన అభివర్ణించారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

ప్ర‌ధాన పార్టీలు అమ‌లు చేసిన‌ రాజ‌కీయ వ్యూహాలు

ఉపఎన్నికలో ముస్లింల ఓట్లు కీలకమని అంచనా వేసిన కాంగ్రెస్, వారి మద్దతు సాధించడానికి పలు వ్యూహాలు అమలు చేసింది. మాజీ క్రికెట్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ను మంత్రిగా నియమించడం, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో చర్చలు జరిపి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు పొందడం వంటి నిర్ణయాలు పార్టీకి అనుకూలంగా మారాయి. జూబ్లిహిల్స్‌లోని దాదాపు నాలుగు లక్షల ఓటర్లలో సుమారు 25 శాతం ముస్లింలు ఉన్నారు.

ప్రచారాల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చిన్న చిన్న సభలు, రోడ్‌షోలు నిర్వహించారు. హైదరాబాదులో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నగరాభివృద్ధికి సంబంధించిన మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్ వంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. చివరకు ఓటర్లు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చారు.

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ, జూబ్లిహిల్స్ ఫలితం గ్రేటర్‌ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతుందని నమ్ముతున్నామని చెప్పారు. ఈ విజయం ద్వారా ప్రజలు కాంగ్రెస్‌తో నిలిచారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ 100 సీట్లు సాధిస్తుందని పేర్కొన్నారు.

ఇక బీఆర్ఎస్‌ విషయానికి వస్తే, వరుసగా నగరంలో రెండు స్థానాలు కోల్పోవడం పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహాన్ని పెంచే అవకాశముంది. 2024లో సికింద్రాబాద్ కాంటోన్మెంట్‌ స్థానాన్ని కోల్పోయిన ఆ పార్టీ, ఇప్పుడు జూబ్లిహిల్స్‌ను కూడా చేజార్చుకుంది. అయితే ఈసారి ఓటమి అంత పెద్ద తేడాతో రాకపోవడం కొంత ఉపశమనం కలిగిస్తుంది.ఈ ఫలితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంపై కూడా ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉపఎన్నికల్లో ప్రచారం చేయకపోవడం చర్చకు దారితీసింది. ఫలితాల అనంతరం కేసీఆర్ కుమార్తె కవిత “కర్మా హిట్స్ బ్యాక్” అని చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

బీజేపీ విషయానికి వస్తే, గెలుపు లేకపోయినా, ఓట్ల శాతం పడిపోవడం ఆ పార్టీకి ప్రధాన ఆందోళనగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పార్టీ ప్రదర్శన బలహీనంగా ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు.జూబ్లిహిల్స్ ఫలితంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు కొత్త దిశగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జూబ్లిహిల్స్ ఉపఎన్నిక ఓటమిపై కవిత స్పందన, "కర్మా హిట్స్ బ్యాక్" ట్వీట్

జూబ్లిహిల్స్ శాసనసభ ఉపఎన్నికలో బీఆర్ఎ⁠స్‌కు వచ్చిన ఓటమిపై సస్పెండ్‌ అయిన ఎమ్మెల్సీ కే. కవిత వ్యంగ్యంగా స్పందించారు. ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికే ఆమె ఎక్స్‌ వేదికగా "కర్మా హిట్స్ బ్యాక్" అంటూ చేసిన పోస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కవితను సెప్టెంబర్‌లో బీఆర్ఎ⁠స్‌ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో తన బంధువులైన హరీష్‌రావు, జె. సంతోష్‌కుమార్‌లు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తన తండ్రి, మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రతిష్టను దెబ్బతీశారని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యల తర్వాత పార్టీ ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. సస్పెన్షన్ అనంతరం కవిత ‘తెలంగాణ జాగృతి’ పేరిట ప్రజా సమస్యలపై దృష్టిసారిస్తూ స్వతంత్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి నెలల్లో పార్టీ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సమాజ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు.

జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యంతో విజయం సాధించగా, బీఆర్ఎ⁠స్ అభ్యర్థి మగంటి సునీత 24,000కుపైగా ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఈ ఓటమి నేపథ్యంలో కవిత చేసిన వ్యాఖ్యను బీఆర్ఎ⁠స్ అంతర్గత పరిస్థితులతో అనుసంధానిస్తూ నేతలు, పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఘన విజయం - Tholi Paluku