Let's talk: editor@tmv.in
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇక రసవత్తర పోరు?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇక రసవత్తర పోరు?

T Venkata Ramana
10 అక్టోబర్, 2025

తెలంగాణలో మరో ఉప ఎన్నిక హీట్‌ పుట్టిస్తోంది. కీలకమైన జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార పర్వాన్ని వేగవంతం చేశాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌లు తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగాయి. అయితే ఈ ఎన్నికల వేళ హైదరాబాద్ నగరంలో బలమైన పట్టున్న మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ వైఖరిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎంఐఎం (పతంగ్ గుర్తు) పోటీ చేస్తుందా? లేక ఎవరికైనా మద్దతు ఇస్తుందా? అన్న చర్చ ఇప్పుడు జూబ్లీహిల్స్ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. నామినేషన్ల ఘట్టం మొదలైనా బీజేపీ అభ్యర్థిని ప్రకటించకపోవడం, ఎంఐఎం మౌనం వహించడం ఈ ఎన్నికను మరింత రసవత్తరంగా మార్చుతోంది.

అభ్యర్థి వేటలో బీజేపీ?

ఈ ప్రతిష్టాత్మక పోరులో గెలిచి హైదరాబాద్‌పై తమ పట్టు నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విద్యావంతులు, ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు, ఉన్నత మధ్యతరగతి ప్రజలు అధికం. బీఆర్ఎస్ సానుభూతి అస్త్రాన్ని, కాంగ్రెస్ అధికార బలాన్ని తట్టుకుని నిలబడగల సమర్థుడైన, వివాదరహితుడైన అభ్యర్థి కోసం బీజేపీ అన్వేషిస్తోంది. స్థానికంగా ప్రజలతో సంబంధాలు కలిగి యువతను ఆకట్టుకోగల నాయకుడిని బరిలోకి దించాలని భావిస్తోంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆర్థికంగా బలమైన అభ్యర్థి ఎంపికపై కమిటీ దృష్టి పెట్టింది.

టికెట్ రేసులో

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున అభ్యర్థి ఎవరన్నదానిపై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. టికెట్ కోసం పలువురు రాష్ట్ర నాయకత్వాన్ని ఆశ్రయించారు. లంకల దీపక్ రెడ్డి హైదరాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలన్నీ ఆయనే పర్యవేక్షిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పార్టీతో బలమైన అనుబంధం ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్గం మద్దతు తనకు ఉంటుందని, టికెట్ తనకే దక్కుతుందని ఆయన గట్టి ధీమాతో ఉన్నారు. స్థానికంగా బలం, ఆర్థిక అండదండలు ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉంది.

మహిళా నేతలు

ఇక కీర్తి రెడ్డి గతంలోనూ జూబ్లీహిల్స్ టికెట్‌ను ఆశించారు. కిషన్ రెడ్డి అనుచర వర్గంగా పేరుంది. పార్టీలో సీనియర్ నాయకురాలు. మహిళా కోటాలో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉండటం, మహిళా కేటగిరీ కలిసి వస్తుందని భావిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం ముందు తన మనసులోని మాటను కీర్తిరెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. ఆకుల విజయ బీసీ మహిళా నేత. గతంలో మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేశారు. పార్టీతో మంచి అనుబంధం ఉంది. రాష్ట్రంలో బీసీ రాజకీయం నడుస్తున్న వేళ బీసీలకు అవకాశం ఇవ్వాలనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అధికార కాంగ్రెస్ కూడా బీసీని బరిలోకి దించాలని చూస్తున్నందున, బీజేపీ నుంచి బీసీ అభ్యర్థిగా తనకు సీటు ఇవ్వాలని కోరుతున్నారు. కొందరు రాష్ట్ర నేతల మద్దతు కూడా ఆమెకు ఉంది. వీరపనేని పద్మ బీజేపీ మహిళా నేత. పార్టీ కోసం చురుకుగా పనిచేస్తున్నారు. టికెట్ ఇస్తే పోటీ చేస్తానని రాష్ట్ర నాయకత్వాన్ని కోరారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలని డిమాండ్ చేస్తున్నారు.

పోటీలో ఉన్నారా? లేరా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. అయితే హైదరాబాద్ లో పట్టున్న ఎంఐఎం పార్టీ మాత్రం ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుందా? లేదా? అన్నది కూడా అనుమానంగానే ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం కీలక భూమిక పోషించనుంది. నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గతంలోనూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసింది. మిగిలిన పార్టీల కంటే అత్యధిక ఓట్లను ఎంఐఎం అభ్యర్థి సాధించింది. గతంలోనూ ఎంఐఎం తరుపున నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక ఓట్లను సాధించారు. గెలవకపోయినా అత్యధిక ఓట్లను సాధించారు.

బీజేపీకి ప్లస్ కాకూడదని

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం మిత్రుడిగా వ్యవహరిస్తుంది. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినప్పటి నాటి నుంచి ఎంఐఎం వైఖరి మారింది. అప్పటి వరకూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్న ఎంఐఎం తర్వాత కాంగ్రెస్ కు అనధికార మిత్రపక్షంగా తయారైంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించే అవకాశాలను కొట్టిపారేయలేం. తాము పోటీలో నిలబడితే అది బీజేపీకి ప్లస్ గా మారుతుందని కూడా ఎంఐఎం భయపడే అవకాశముంది. అందుకే ఈ ఎన్నికలకు ఎంఐఎం దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరోక్షంగానో ప్రత్యక్షంగానో కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మద్దతు పలికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇక రసవత్తర పోరు? - Tholi Paluku