
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది: కేంద్ర మంత్రి శేఖావత్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ శేఖావత్ హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతంలో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు.నవంబర్ 11న జరగనున్న ఈ ఉపఎన్నిక 2028లో రాష్ట్రంలో అధికార మార్పుకు పునాది వేయనున్నదని ఆయన అన్నారు. జాతీయవాద శక్తులను తెలంగాణలో అధికారంలోకి తేవడమే ఈ ఎన్నికల అసలు లక్ష్యమని ఆయన తెలిపారు.
మంత్రి శేఖావత్ మాట్లాడుతూ, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి విజయం కోసం పార్టీ కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇది సాధారణ ఎన్నిక కాదు. ఇది తెలంగాణలో ప్రభుత్వ మార్పు విత్తనాలు నాటే ఎన్నిక. దేశభక్తి, జాతీయత విలువలను కాపాడే శక్తులను ముందుకు తెచ్చే అవకాశం ఇది అని ఆయన పేర్కొన్నారు.తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలంటే కాంగ్రెస్ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, శేఖావత్ తీవ్రంగా విమర్శించారు. దేశాన్ని విభజించే వ్యాఖ్యలు చేసే శక్తులను ప్రజలు తిరస్కరించాలన్నారు. ఇలాంటి విభజనాత్మక వ్యాఖ్యలు చేసే వారిని దేశం ఎప్పుడూ క్షమించదు. భారత్ ఎప్పుడూ దేశభక్తి విలువల పట్ల నిబద్ధంగా ఉంటుందని ఆయన తెలిపారు.
అలాగే, నవంబర్ 6న బీహార్‌లో జరిగిన తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన అధిక ఓటింగ్ శాతం ఎన్డీఏ భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందనే సంకేతమని శేఖావత్ పేర్కొన్నారు. తెలంగాణలోనూ ప్రజలు అదే ధోరణిని చూపించి, బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
