Let's talk: editor@tmv.in
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ప్రజలు తప్పును పునరావృతం చేయరు: మంత్రి అజారుద్దీన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ప్రజలు తప్పును పునరావృతం చేయరు: మంత్రి అజారుద్దీన్

Gaddamidi Naveen
4 నవంబర్, 2025

తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ నాయకులు మహ్మద్ అజారుద్దీన్‌ జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని నమ్మకంగా తెలిపారు. గతంలో చేసిన పొరపాటును ప్రజలు ఈసారి పునరావృతం చేయరని, కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ భారీ మెజారిటీతో గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

అజారుద్దీన్ మాట్లాడుతూ.. ప్రజలలో మంచి ఉత్సాహం కనిపిస్తోంది. గత పాదయాత్రలో మాతో కలిసిన వారే ఇప్పుడు మళ్లీ వచ్చి, కాంగ్రెస్‌కు ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారు. గత సారి చేసిన తప్పును పునరావృతం చేయమని ప్రజలు చెబుతున్నారని అజారుద్దీన్ తెలిపారు.

ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం

తెలంగాణ కేబినెట్‌లో ఇటీవలే మంత్రి పదవిని స్వీకరించిన మాజీ భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ అజారుద్దీన్‌, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ తరపున ప్రచారం నిర్వహించారు.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు మాత్రం కాంగ్రెస్‌పై మైనారిటీ రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఉందని, బీజేపీ మాత్రం అభివృద్ధి అంశాలపై ఎన్నికలు ఎదుర్కొంటోందని ఆయన తెలిపారు.

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల ప్రచారం బీజేపీ ప్రారంభించింది. రహమత్‌నగర్‌, పరిసర ప్రాంతాల్లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. కాంగ్రెస్‌ మైనారిటీ ప్రీతిపాత్రత రాజకీయాలపై ఆధారపడి పోటీ చేస్తోంది. బీఆర్‌ఎస్‌ వాగ్దానాలతో ప్రజలను ఆకర్షిస్తోంది. కానీ బీజేపీ మాత్రం అభివృద్ధి ఆధారంగా పోటీ చేస్తోంది,” అని రామచందర్‌రావు పేర్కొన్నారు.

అదే సమయంలో, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా రహమత్‌నగర్‌ విభాగంలో రోడ్‌షో నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన ఆయన, తెలంగాణ ప్రజలు ఎవరికి భయపడరని, బెదిరింపులకు లొంగరని స్పష్టం చేశారు. “ఇది బెదిరింపులకు వణికే తెలంగాణ కాదు,” అని కేటీఆర్‌ గర్జించారు.

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలకు నవంబర్‌ 11న పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ నేత మగంటి గోపీనాథ్‌ మరణంతో ఈ ఉపఎన్నిక జరుగుతోంది.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున బీసీ నేత నవీన్‌ యాదవ్‌ బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ గోపీనాథ్‌ భార్య సునీతను అభ్యర్థిగా నిలబెట్టగా, బీజేపీ లంకాల దీపక్‌రెడ్డిని పోటీకి రంగంలోకి దించింది.

ఈ ఉప ఎన్నిక ఫలితం ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై ఏమైనా ప్రభావం చూపుతుందా?

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఫలితం కేవలం ఒక నియోజకవర్గ ఫలితమే అయినప్పటికీ, రాష్ట్ర రాజకీయ వాతావరణంపై ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రతిష్ఠపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి ముఖ్యమైన ఎన్నిక.ఈ ఫలితం ద్వారా రాష్ట్ర‌ ప్రజలు ప్రభుత్వంపై తమ మొదటి అంచనా వేస్తారు. ఒక‌వేళ కాంగ్రెస్ విజయం సాధిస్తే, “ప్రజలు ప్రభుత్వ పనితీరుతో సంతృప్తిగా ఉన్నారు” అనే సంకేతం లభిస్తుంది.ఓటమి అయితే, “ఒక సంవత్సరంలోనే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు” అనే భావన ఏర్పడవచ్చు.కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో అభివృద్ధి దిశలో ప్రభుత్వం నడుస్తోంది అనే కథనం బలపడుతుంది.కానీ ఓటమి అయితే విపక్షాలు దీన్ని ప్రజలు నిరాశ చెందారు అని ప్రచారం చేయడానికి ఉపయోగిస్తాయి.

బీఆర్‌ఎస్, బీజేపీ వ్యూహాలపై ప్రభావం

బీఆర్‌ఎస్ కోసం ఈ ఉపఎన్నిక “రాజకీయ పునరుజ్జీవన పరీక్ష” లాంటిది. బీఆర్ఎస్ గెలిస్తే, ప్రజల్లో ఇంకా బీఆర్‌ఎస్‌కు మద్దతు ఉందని చూపించవచ్చు.ఓటమి అయితే హైదరాబాదు ఇంకా వ్య‌తిరేకం ఉంద‌ని తెలుపుతుంది.

బీజేపీ ఈ ఫలితాన్ని తమ అర్బన్ ప్రెజెన్స్‌ పెరుగుదల కొలమానంగా తీసుకుంటుంది. మంచి ఓటు శాతం సాధించినా, అది భవిష్యత్ జీహెచ్ఎంసీ లేదా స్థానిక‌, అసెంబ్లీ ఎన్నికలలో ప్ర‌భావం చూప‌నుంది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ప్రజలు తప్పును పునరావృతం చేయరు: మంత్రి అజారుద్దీన్ - Tholi Paluku